అనర్హతకు పార్టీ గుర్తింపుతో సంబంధం లేదు: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు పడుతుందని, దీనికి పార్టీ గుర్తింపుతో సంబంధం ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం.. ఒక పార్టీ గుర్తుపై పోటీచేసి గెలిచాక మరో పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని, వ్యక్తి వీడిపోతున్న రాజకీయ పార్టీకి గుర్తింపు ఉందా? లేదా అనే అంశాలతో సంబంధం ఉండదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) వీఎస్ సంపత్ తేల్చి చెప్పారు. వైఎస్సార్‌సీపీ నుంచి నంద్యాల ఎంపీగా గెలుపొందిన ఎస్పీవై రెడ్డి ఆదివారం టీడీపీలో చేరిన నేపథ్యంలో అనర్హత అంశాలపై తనను ఫోన్‌లో సంప్రదించిన మీడియా ప్రతినిధులకు ఆయన ఈమేరకు వివరణ ఇచ్చారు.