అనర్హత వేటుపడ్డ ఆప్ ఎమ్మెల్యేలు (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై పడ్డ అనర్హత వేటును హైకోర్టు పక్కన పెట్టింది. ఆప్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను శుక్రవారం పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. ఎన్నికల సంఘం తమ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. కోర్టు తీర్పును ఢిల్లీ ప్రజల విజయంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ఎమ్మెల్యేలు తమ వాదనను వినిపించే అవకాశం గతంలో ఇవ్వలేదు. అందుకే కోర్టు నేడు ఆ ఆప్ ఎమ్మెల్యేలకు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించింది. ఎన్నికల కమిషన్ ఆప్ ఎమ్మెల్యేల అంశాన్ని మరోసారి పరిశీలించనుందని ఆప్ నేత సౌరబ్ భరద్వాజ్ అన్నారు.
ఆప్ ఎమ్మెల్యేలపై వేటుకు కారణమిదే..
2015 జవనరిలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా.. బీజేపీని ఢీకొడుతూ కేజ్రీవాల్ పార్టీ ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నిబంధనల ప్రకారం ఏడుగురికి మాత్రమే మంత్రి పదవులిచ్చిన కేజ్రీవాల్, మరో 20 మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. 20 ఎమ్మెల్యేలు లాభదాయక పదవులు పొందారాని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ 2017 సెప్టెంబర్ 28న మొదటి సారి, నవంబర్ 2న రెండోసారి కేంద్ర ఎన్నికల సంఘకం ఆప్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈసీ నోటీసులకు బదులివ్వకుండా, ఏకంగా కేసు విచారణనే నిలిపేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. సరిగ్గా ఈ సాంకేతిక అంశమే ఈసీ కఠిన నిర్ణయానికి దోహదపడింది.
నోటీసులకు ఓసారి సమాధానం ఇచ్చినా అందుకు ఈసీ సంతృప్తి చెందలేదు. ఆప్ నేతలు ఏకంగా ఈసీని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా వారు రెండు సార్లూ అవకాశాలను వదులుకున్నారు. ముందు మాకు చెప్పాల్సింది చెప్పి, వారు కోరేది అడగొచ్చు. కానీ అలా జరగలేదు. అసలు విచారణే వద్దని వాదించడం సమంజసం కాదు కదా! అంటూ ఈసీ గత జనవరిలో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. ఆ 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ ఏకే చావ్లా బెంచ్ ఆప్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను విచారించిన అనంతరం వారికి ఊరట కల్పిస్తూ తీర్పిచ్చింది. ఆప్ ఎమ్మెల్యేలపై వేటు నిర్ణయాన్ని పున:సమీక్షించాలని కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment