
జూన్ 1 నాటికి 16వ లోక్‌సభ
అమెరికా సదస్సులో సీఈసీ సంపత్ వెల్లడి
ఇప్పటికే కసరత్తులో తలమునకలైన ఎన్నికల సంఘం
మార్చి మధ్యలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
వాషింగ్టన్: లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని ఎన్నికల ప్రధానాధికారి వీఎస్ సంపత్ తెలిపారు. వచ్చే జూన్ 1 నాటికి కొత్త లోక్‌సభ కొలువు తీరుతుందన్నారు. న్యాయం, నిష్పక్షపాతం, చట్టాల కఠిన అమలు.. 2014 లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో ఈ మూడింటినీ కీలకంగా భావిస్తామన్నారు. ఇక్కడి బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. 543 స్థానాలకు గానూ 8 లక్షల పోలింగ్ బూత్‌లలో 5, 6, లేక 7 దశల్లో సాధారణ ఎన్నికలు జరగొచ్చని, సుమారు 78 కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశముందని సంపత్ తెలిపారు. ఎన్నికల్లో 11.8 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఉపయోగిస్తామని వివరించారు.
ఎన్నికల ప్రక్రియ వచ్చే సంవత్సరం మార్చి మూడో వారంలో ప్రారంభం కావొచ్చన్నారు. మొదటి దశ పోలింగ్ తేదీకి ఆరు వారాల ముందు ఎన్నికల నిర్వహణ ప్రకటనను, మూడు వారాల ముందు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. ప్రకటన విడుదల అయిన తేదీ నుంచే నియమావళి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించేముందు అన్ని రాజకీయ పార్టీలను, వాతావరణ శాఖను, ఎన్నికల అధికారులను సంప్రదిస్తామన్నారు. పరీక్షల తేదీలు, పండుగలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
యువ ఓటర్ల వల్లనే..!
తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడానికి యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరగడమే కారణమని సంపత్ పేర్కొన్నారు. యువతను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యలను చేయడం కోసం ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేసిందన్నారు. ‘యువతను ఓటర్లుగా నమోదు చేసే కార్యక్రమం బాగా నిర్లక్ష్యానికి గురైందన్న విషయాన్ని మూడేళ్ల క్రితం గుర్తించాము. జనాభా లెక్కలనూ పరిశీలించాం. యువతలో కేవలం 20 శాతం మాత్రమే ఓటర్లుగా నమోదై ఉన్నట్లు గుర్తించాం. దాంతో విసృ్తతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం. ఈసీ కృషి ఫలితంగా 80 శాతం యువజనం ఓటర్లుగా నమోదయ్యారు’ అని ఆయన వివరించారు. అమెరికా తరహాలో ముందస్తు ఓటింగ్ విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల చట్టాలు అంగీకరించవన్నారు. చాలా దేశాల్లో ఆ విధానం విజయవంతమైనప్పటికీ, భారత్ పరిస్థితులకు అది అనువు కాదన్నారు.