ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన
రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నా, విభజనకు సంబంధించిన ప్రకటనలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్ 'సాక్షి'తో అన్నారు. మే 16న ఫలితాలు వచ్చినా పాత అసెంబ్లీ కాలం సమయం పూర్తయిన తర్వాత కొత్త అసెంబ్లీ నోటిఫై అవుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే తాము రాష్ట్రంలోని నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి పెడతామని సంపత్ తెలిపారు. నేరచరితులను, నల్లధనాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించామని, ఎన్నికల కమిషన్ సిబ్బంది సహాయంతో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు స్వయంగా ఓటర్ స్లిప్ ఇస్తుందని ఆయన వివరించారు. కొత్త ఓటర్ల నమోదుకు మార్చి 9వరకు గడువుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ తెలిపారు.