
సార్వత్రిక సైరన్ మోగెన్
నోటిఫికేషన్ విడుదల : ఏప్రిల్ 12న
నామినేషన్ల దాఖలుకు గడువు: ఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్ 21న
నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 23 వరకు
ఎన్నికలు: మే 7న
ఫలితాలు: మే 16న ప్రకటిస్తారు.
సాక్షి, గుంటూరు: 16వ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) విఎస్ సంపత్ బుధవారం ఢిల్లీలో షెడ్యూల్ ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. సీమాంధ్రకు సంబంధించి రెండో విడతలో మే 7న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ రోజు జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికల కోసం జనవరి 31న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో 35,39,011 మంది ఓటర్లున్నారు. మార్చి 9 వరకు కొత్త ఓటు నమోదుకు అవకాశం వుంది. దీంతో మరో పదివేల మంది ఓటర్లు పెరిగే అవకాశాలు వున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ రచనలో నిమగ్నమై ఉండగా,
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడటంతో తమ వ్యూహాలకు మరింత పదును పెట్టే పనిలో ఉన్నాయి. జిల్లా యంత్రాంగం ఈ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంతా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు అప్పగించగా, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యతల్ని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్న అధికారగణం కలెక్టరేట్‌లో ఓ టోల్ ఫ్రీ నంబరు, ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ప్రారంభించింది. 98499 04013 నంబరును ఏర్పాటు చేశారు. ఈ దఫా ఎన్నికల కమిషన్ తొలిసారిగా ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేయనుంది. ఈ సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్‌ఎస్. సురేశ్‌కుమార్ కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
పల్లె ఓట్లే కీలకం:
= జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు పల్లె ఓట్లే కీలకం కానున్నాయి.
= జిల్లాలోని 12 మునిసిపాలిటీలు, గుంటూరు నగర కార్పొరేషన్ ఓటర్లు మొత్తం కలిపి 11,30,435 ఉంటే, పల్లెల్లో ఓట్లు ఇంతకు రెండింతలు ఉన్నాయి. అంటే దాదాపు 24 లక్షల వరకు పల్లెల్లో ఓటర్లున్నారు.
= పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు సుమారు 50 వేల మందికి పైగా అధికంగా ఉన్నారు.
= జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో 3,739 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి అదనంగా మరికొన్ని ఆగ్జిలరీ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు.
= 1,598 మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.
జిల్లాలో మొదలైన రాజకీయ సందడి
= మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో ఉలిక్కిపడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆశావహ అభ్యర్థుల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది.
= మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రకటించాలనే రాజకీయ పార్టీల డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది.