
ఫిబ్రవరి 7న ఢిల్లీ ఎన్నికలు.. 10న ఫలితాలు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలు ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించి, 10వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ ప్రకటించారు.
ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి..
నోటిఫికేషన్ తేదీ - 14 జనవరి
నామినేషన్ల దాఖలుకు తుది గడువు - 21 జనవరి
నామినేషన్ల పరిశీలన - 22 జనవరి
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు - 24 జనవరి
ఎన్నికలు - 7 ఫిబ్రవరి
కౌంటింగ్ - 10 ఫిబ్రవరి
ఎన్నికల ప్రక్రియ ముగించాల్సిన తేదీ -12 ఫిబ్రవరి
''మొత్తం ఉన్న 70 నియోజవర్గాలలో 12 రిజర్వు అయి ఉంటాయి. అన్ని ఈవీఎంలలోను నోటా తప్పనిసరిగా ఉండాలి. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం అఫిడవిట్లో అన్ని కాలమ్లను అభ్యర్థులు పూర్తిచేయాలి. దేన్నయినా ఖాళీగా వదిలేస్తే.. రిటర్నింగ్ అధికారులు ఓ నోటీసు ద్వారా చెబుతారు. అప్పుడూ స్పందించకపోతే నామినేషన్ తిరస్కరిస్తారు. అన్ని రకాల పరిశీలకులను మోహరించి, ఎన్నికల వ్యయం, ఇతర ఘటనలపై నిఘా ఉంచాలి.
ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మరింత నిఘా ఏర్పాటుచేయాలి. ఫ్లయింగ్ స్క్వాడ్లు, వీడియో సర్వయలెన్స్, ఆదాయపన్ను ఉన్నతాధికారుల మోహరింపు తప్పనిసరి.
గుర్తించిన ప్రాంతాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులంతా అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. వారి ప్రవర్తనను అత్యంత నిశితంగా పరిశీలిస్తాం. ఏదైనా అవకతవకలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. వాతావరణ పరిస్థితులు, విద్యా సంవత్సరం, పండుగలు, శాంతిభద్రతలు.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని షెడ్యూలు నిర్ణయించాం'' అని సంపత్ తెలిపారు.