హస్తిన బరిలో నువ్వా.. నేనా!
ఎన్నికల నగారా మోగింది. దాదాపు ఏడాదిగా రాష్ట్రపతి పాలనలోనే ఉన్న ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ సోమవారం ప్రకటించారు. దాంతో హస్తిన ఎన్నికల రణరంగానికి తెరతీసినట్లయింది.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్జీ రాలేదు.. ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో అధికారాన్ని చేపట్టారు. ఆయన కేవలం 49 రోజులపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో వచ్చిన విభేదాల నేపథ్యంలో రాజీనామా చేయడంతో.. అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఏడాదిగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరి 15తో రాష్ట్రపతి పాలన ముగియనుంది.
వాస్తవానికి ఈసీ ప్రకటన రాక ముందు నుంచే హస్తినలో ఎన్నికల వేడి రగిలింది. ప్రధానమంత్ర నరేంద్రమోదీ రాంలీలా మైదాన్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ను ఆయన అరాచకవాదిగా అభివర్ణించారు. దానికి కేజ్రీవాల్ కూడా దీటుగానే సమాధానమిచ్చారు. ఎటు తిరిగీ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేని పార్టీ ఏదైనా ఉందంటే.. అది కాంగ్రెస్సే కావచ్చని పరిశీలకుల అంచనా. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్, ఇంకోవైపు రాహుల్ గాంధీ.. ముగ్గురూ ముమ్మర ప్రచారం చేయనుండటంతో ఈ ఎన్నికపై జాతి మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.