ఎన్నికల్లో ధన ప్రభావం ఆందోళనకరం: సంపత్
ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్. సంపత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి, రూపు మాపేందుకు వీలైనన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల సందర్భంగా ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేసి, వీడియో ద్వారా కూడా నిఘా ఉంటుందని సంపత్ తెలిపారు. అభ్యర్థులు డబ్బును ఉపయోగించి, ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.