కులమతాల పేరుతో ప్రచారం చేస్తే కఠిన చర్యలు: వీఎస్ సంపత్
సాక్షి, తిరుమల: కులమతాల పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ హెచ్చరిం చారు. ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆదివారమే ఆఖరి అవకాశమని, ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన ఈ వెసులుబాటును అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకు దేశవ్యాప్తంగా 9.3 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్ల జాబితాలో పేరు లేనివారు తమ నివాస ధ్రువీకరణ పత్రాలు, ఫొటో సమర్పించి ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని, వారంలోగా వాటిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శనివారం కుమారుడితో కలసి సంపత్ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. దేశమంతా విద్యార్థులకు పరీక్షలు, వాతావరణం, పండుగలు, భద్రతా పరిస్థితులు, సెలవులు ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకునే ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారమే రాజకీయపార్టీలు, అభ్యర్థులు నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మతం, కులం పేరుతో ఎన్నికల ప్రచారం చేసినా, నగదు పంపిణీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కులాల పేరుతో రాజకీయ పార్టీలు ఏర్పాటైనా ఎన్నికల్లో మాత్రం ఆయా కులాల పేరుతో ఓట్లు అడగకూడదన్నారు. ఒకవేళ అలా ప్రచారం చేశారని తగిన సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం కులాలు, మతాల పేరుతో ఏర్పాటైన పార్టీలకు ఎన్నికల కమిషన్ ఎలాంటి గుర్తింపు, అనుమతులు ఇవ్వట్లేదన్నారు. పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు నగదు తీసుకెళ్తే అందుకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు రశీదులు వెంటే ఉంచుకోవాలని సూచించారు.
స్వామి ఆశీస్సులందుకున్న సంపత్: సాధారణ భక్తుల్లాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా రూ.300 టికెట్ల సుఫథం క్యూ నుంచి ఆలయానికి వచ్చారు. ధ్వజస్తంభానికి మొక్కుకొని, స్వామిని దర్శించుకున్నారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ లడ్డూ ప్రసాదాలు సంపత్‌కు అందజేశారు. అనంతరం పుష్కరిణి జలాన్ని ప్రోక్షణం చేసుకున్నారు. భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా సంపత్ దర్శించుకున్నారు.