ఓట్లు పోటెత్తిస్తాం: వి.ఎస్.సంపత్
ఓటింగ్ శాతం పెంపునకు చర్యలు: వి.ఎస్.సంపత్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు నిష్పాక్షికంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి, ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు, ఆదాయపు పన్ను అధికారులతో ఎన్నికల ఏర్పాట్లను శనివారం సమీక్షించిన అనంతరం జూబ్లీహాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్లు హెచ్.ఎస్.బ్రహ్మ, ఎస్.ఎన్.ఎ. జైది, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఎన్నికల సంఘం సీనియర్ అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు.
ఆయన వెల్లడించిన విషయాల్లో ముఖ్యమైనవి ఇవీ..
మోడల్ బ్యాలెట్ పేపర్లను ప్రచారంలో వినిగించుకుంటామని వివిధ పార్టీలు కోరాయి. ఆయా పార్టీల గుర్తులతో మాత్రమే మోడల్ బ్యాలెట్‌లో ముద్రించి ప్రచారం చేసుకుంటే ఎన్నికల సంఘానికి అభ్యంతరం లేదు. కానీ ఇతర పార్టీల గుర్తులతో కూడిన మోడల్ బ్యాలెట్ వాడటానికి అంగీకరించం.
ర్యాలీలు, సభలు నిర్వహించుకోవడానికి రాజకీయ పార్టీలకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నాం. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తాం. అనుమతులు కోరిన 24 గంటల్లో నిర్ణయం వెల్లడించడానికి తగిన ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించనున్నాం.
ఎన్నికలు నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించడానికి గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 70,171 పోలింగ్ కేంద్రాల్లో 25,390 కేంద్రాలు(36 శాతం) సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఆయా కేంద్రాల్లో భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడతాం. ఓటర్లను భయభ్రాంతులను చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించాం. ఓటర్లకు తగిన భద్రత కల్పించి నిర్భయంగా ఓటేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. పోలింగ్ రోజున ఓటర్లకు అవసరమైన భద్రత కల్పించడానికి మొబైల్ పార్టీలను ఏర్పాటు చేస్తాం.
అక్రమ నగదు ప్రవాహంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 101 శాసనసభ నియోజకవర్గాలను ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉన్నవి(ఎక్స్‌పెండిచర్ సెన్సిటివ్)గా గుర్తించాం. ఎన్నికల్లో ఖర్చు నియంత్రణకు, నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి వీలుగా విజిలెన్స్‌ను కట్టుదిట్టం చేయమని అధికారులను ఆదేశించాం. నగదు, బహుమతులు, ఇతర పద్ధతుల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశాం.
కట్టుదిట్టమైన విజిలెన్స్‌వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 105 కోట్ల నగదు సీజ్ చేశాం. 1,142 కేసులూ నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సీజ్ చేసిన నగదులో 46 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటం గమనార్హం. 3.92 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. 29,280 కేసులు నమోదయ్యాయి.
నగదు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవడానికి వీలుగా జిల్లా స్థాయిలో ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించాం.
పోలింగ్‌కు ఒకరోజు ముందే ఓటర్ల స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తాం. మూడింట రెండు వంతుల పోలింగ్ స్టేషన్లలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం. ఆయా స్టేషన్ల నుంచి వెబ్‌క్యాస్టింగ్ చేస్తాం. అక్రమాల నియంత్రణకు వెబ్‌క్యాస్టింగ్ దోహదం చేస్తుంది.
పోలింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంగా ఎన్నికల సంఘం పనిచేస్తోంది. పోలింగ్ సమయాన్ని గంట పెంచాం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఓటర్లను చైతన్యపరచడానికి ఇప్పటికే పలు చర్యలు చేపట్టాం. నైతిక విలువలకు కట్టుబడి ఓట్లు (ఎథికల్ ఓటింగ్)ను ప్రోత్సహించడానికి పలు కార్యక్రమాలు చేపట్టాం. ఈ విషయంలో మీడియా కూడా సహకారం అందించాలి. ఈ ఎన్నికల్లో ఎథికల్ ఓటింగ్ ఆకాంక్ష వాస్తవ రూపందాలుస్తుందని ఆశిస్తున్నాం.
పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి, ఓటర్లకు కనీస వసతులు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించాం. తాగునీరు, విద్యుత్, క్యూలైన్లలో నిలబడినప్పుడు నీడ కల్పించడం.. తదితర ఏర్పాట్లు చేయాలని సూచించాం.
పోలింగ్ సమయంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగడానికి తగిన చర్యలు తీసుకోమని ట్రాన్‌సకో సీఎండీని ఆదేశించమని సీఎస్‌కు సూచించాం.
సరిగా పనిచేయని(ఫాల్టీ) ఈవీఎంలు ఉన్నట్లు గుర్తిస్తే.. వీలయినంత త్వరగా మార్చి పోలింగ్‌కు ఆటంకం కలగకుండా చర్యలు చేపడతాం. ఏ పార్టీకి ఓటేసినా కాంగ్రెస్‌కే పడిన ఈవీఎం వ్యవహారం ఇటీవల పుణేలో వెలుగులోకి వచ్చిన విషయం వాస్తవమే. ఈవీఎంలకు పార్టీల గురించి తెలియదు. వాటికి నంబర్లు మాత్రమే తెలుసు. ఒక పార్టీకే ఓట్లు వెళ్లడానికి అవకాశం ఉండదు. మొత్తం ఈవీఎంల్లో 0.1 శాతం సరిగా పనిచేయనివి ఉంటాయి.
కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలు, అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని రాజకీయ పార్టీలు ఫిర్యాదుచేశాయి. నిష్పాక్షికంగా వ్యవహరించని పత్రికలు, చానళ్ల విషయంలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. ప్రెస్ కౌన్సిల్, ఎన్‌బీఏ నిబంధనలు మీడియా సంస్థలకు వర్తిస్తాయి.
పాత అసెంబ్లీ రద్దయి, కొత్త అసెంబ్లీ ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలే కొనసాగుతారు. కొత్త అసెంబ్లీ ఏర్పాటయిన తర్వాతే గెలిచినవారు ఎమ్మెల్యేలు అవుతారు. (మే 16కు ఫలితాలు వస్తాయి. జూన్ 2 వరకు కొత్త అసెంబ్లీలు ఏర్పాటు కావు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రానికి చెందిన వారిగానే పరిగణిస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.)రాష్ట్రంలో 6.48 కోట్ల మంది ఓటర్లున్నారు. అందులో 3.26 కోట్ల మంది పురుషులు, 3.22 కోట్ల మంది స్త్రీలు. 18-19 సంవత్సరాల యువత 33 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. రాష్ట్రంలో ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేశాం.