
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణ: సీఈసీ
* హైదరాబాద్ వచ్చిన సంపత్.. నేడు తిరుమలకు
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తేదీల్లో ఎలాంటి మార్పులుండవని జాతీయ ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ స్పష్టం చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉండడంవల్ల సార్వత్రిక ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు.
శనివారం ఉదయం ఇక్కడి నుంచి తిరుపతి బయలుదేరనున్నట్లు ఆయన చెప్పారు. విమానాశ్రయంలో సంపత్‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్వాగతం పలికారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో బస చేసిన సంపత్‌కు రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను భన్వర్‌లాల్ వివరించారు. ఆయన శనివారం ఉదయం బయలుదేరి తిరుమల వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ నేరుగా వెళ్తారు.