None of the above
-
ప్రజాస్వామిక నిరసన.. నోటా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) దశాబ్దం కిందట పురుడుపోసుకున్న ఒక ఆలోచన. ఐదేళ్ల కిందట అమలుకు నోచుకున్న ఒక ఆయుధం. ప్రజాస్వామిక పద్ధతిలో నిరసనకు కల్పించబడిన హక్కు. నిరసనకు జనం చేతిలో ఆయుధం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ నచ్చనప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి తెరమీదకొచ్చిన సరికొత్త మీట. అదే నోటా. నన్ ఆఫ్ ది అబౌ (నోటా). రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న వారితో పాటు స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరికీ ఓటు వేయడం ఇష్టంలేనప్పుడు, పోటీ చేస్తున్న వారెవరూ నచ్చలేదని తెలియజెప్పే ఒక ప్రజాస్వామిక ఆయుధం. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్)కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి కీలకమైన తీర్పు వెల్లడించింది. 27 సెప్టెంబర్ 2013 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం 11 అక్టోబర్ 2013 నుంచి నోటాను ప్రవేశపెట్టింది. నోటా అమలు చేస్తున్న వాటిల్లో మనది 14 వ దేశం. నోటాకూ ఒక గుర్తు ఓటర్లలో అక్షరాస్యత తక్కువగా ఉండటం, ఓటర్లలో అవగాహన లేకపోవడం వంటి కారణంగా ఆయా రాజకీయ పార్టీలకు కేటాయించినట్టే నోటాకూ ఒక గుర్తు ఉండాలని ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వచ్చింది. దాంతో నోటాకూ ఒక గుర్తు కేటాయించాలని 2015 లో ఎన్నికల సంఘం తీర్మానించింది. అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి) రూపొందించిన గుర్తును నోటాగా కేటాయిస్తూ ఎన్నికల సంఘం 18 సెప్టెంబర్ 2015 న ఆదేశాలు జారీ చేసింది. . ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, వాటిపక్కన గుర్తు లు ఉన్నట్టుగా చూపించే చిత్రంపై ఇంటూ మార్క్ తో అడ్డంగా కొట్టివేసినట్టుగా చూపించేదే నోటా గుర్తు. ఈ ప్రజాస్వామిక నిరసన హక్కు ఓటర్లకు ఆయుధంగా ఉపయోగపడుతుందా? ఓటర్లు ఆశించిన లక్ష్యం నెరవేరుతుందా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులకన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రజల ప్రజాస్వామిక నిరసన ఫలిస్తుందా? అంటే అలా జరగదు. నోటాకు అత్యధికంగా ఓట్లు నమోదైనప్పటికీ ఆ తర్వాత క్రమంలో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అయితే, నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అలాంటి సందర్భాలు ఎదురుకాలేదు. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న డిమాండ్‌పైన చర్చకు ఆస్కారం కలుగుతుంది. నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి కొందరు దానికి ఓటు వేయడం గమనించాం. ఇప్పుడు కొందరు నోటాకు ఓటు వేయాలంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఎన్నికల్లో అదీ ఒక గుర్తే... దానికి ప్రచారం చేయొచ్చా? చేయరాదా ? అన్నింటిలాగే నోటాకూ ప్రచారం చేయొచ్చు. అలా చేస్తున్న వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది కూడా. తొలిసారి ఇవే రాష్ట్రాల్లో 2013లో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి నోటా ఉపయోగించారు. (ఢిల్లీ శాసనసభకు ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి), అప్పట్లో ఈ రాష్ట్రాల్లో 1.85 శాతం ఓట్లు నోటాకు నమోదయ్యాయి. సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఆ నాలుగు రాష్ట్రాలకు మళ్లీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇకపోతే, 2014 సాధారణ ఎన్నికల్లో 1.1 శాతం ఓట్లు నోటాకు నమోదయ్యాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో తీరులో ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2014 లో కొన్ని రాష్ట్రాలు హర్యానా, జార్ఘండ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నోటాకు (2.02 శాతం) పడిన ఓట్లు పెరిగాయి. 2015 లో ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో 0.40 శాతం నోటాకు పోలైతే బీహార్‌లో మాత్రం 2.49 శాతం నమోదయ్యాయి. 2016లో అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు ఎన్నికల్లో మొత్తంగా 1.6 శాతం ఓట్లు నోటాకు మీటపై పడ్డాయి. అక్టోబర్ 2013 నుంచి మే 2016 మధ్య కాలంలో దేశంలో జరిగిన ఎన్నికల ఓటింగ్ సరళిని విశ్లేషించినప్పుడు... గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనే నోటాకు ఎక్కువ ఓట్లు నమోదుకావడం గమనార్హం. ప్రత్యేకించి ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన గరిమా గోయల్ తన పరిశోధనా పత్రంలో ఈ విషయం వెల్లడించినట్టు ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ పేర్కొంది. గిరిజనులు ప్రత్యేకంగా ఎక్కడయితే తమ కమ్యూనిటికి ప్రాతినిథ్యం ఉండటం లేదో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నోటాకు నమోదవుతున్నట్టు వెల్లడైంది. అలాగే, వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. గడ్చిరోలీ, జార్గ్రామ్, కల్యాణ్ (రూరల్), జగన్నాథ్‌పూర్, చాత్ర, ఉమర్కోట్, ఛత్తర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా నోటాకు ఓట్లు నమోదయ్యాయి. లోక్‌సభ నియోజకవర్గాల విషయానికొస్తే 2014 ఎన్నికల్లో బస్తర్, నీల్గిరీస్, నబరంగ్‌పూర్ నియోజకవర్గాల్లో ఎక్కువగా వచ్చాయి. ఈ ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే, ఎక్కడైతే ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ముఖాముఖి పోటీ ఉందో ఆ ప్రాంతాల్లో కూడా నోటాకు వచ్చిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కొన్ని గణాంకాలు సూచిస్తున్నాయి. అందుకు కారణంగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన ఈరెండు పార్టీలకు వ్యతిరేకంగా ఇవి నమోదవుతున్నాయన్న వాదన వినిపిస్తున్న వారూ ఉన్నారు. మొత్తంమీద ఏ నియోజకవర్గంలో చూసిన 1 నుంచి 3 శాతంకు మించి నోటాకు ఓట్లు పడలేదు. నోటా ప్రవేశపెట్టిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు నోటాకొస్తాయని అంచనా వేశారు. పైగా పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది. పైగా రాజకీయాల్లో నేర చరిత కలిగిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పడుతాయని అంచనాకు రావొచ్చు. కానీ అందరి అంచనాలకు పట్టణ ప్రాంతాలకన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే నోటాకు ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం గమనార్హం. నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫలితాల సరళిని బట్టి ‘‘పై వారెవరికీ ఓటు వేయదలచుకోలేదని’’ (నోటాకు వేస్తున్న) చెప్పే వారి సంఖ్య అంతగా ఉండటం లేని కారణంగా నోటా పెద్ద చర్చనీయాంశం కాలేదు. ఈ రకమైన ప్రజాస్వామిక నిరసన ఒక సాధనంగా మాత్రమే మిగిలిపోతోంది. అందుకే ‘‘నన్ ఆఫ్ ది అబో’’ (నోటా) తరహాలో యాంత్రికమైన సాధనంగా కాకుండా ‘‘ రైట్ టు రిజెక్ట్ ’’ (తిరస్కరించే హక్కు) ఉండాలని కోరుతున్నవాళ్లూ ఉన్నారు. నోటా స్థానంలో అభ్యర్థిని పూర్తిగా తిరస్కరించే హక్కు (రైట్ టు రిజెక్ట్) కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. తెలంగాణలో నోటా తీరు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో (ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి) తెలంగాణలోని 119 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1,51,731 ఓట్లు నోటాకు పడ్డాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో సగటున 1275 ఓట్లు నోటాకు నమోదయ్యాయన్నమాట. రెండు వేలు ఆ పైన నోటాకు ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు 11 ఉన్నాయి. అలాగే వెయ్యి నుంచి రెండు వేల మధ్యన నోటాకు పోలైన నియోజకవర్గాలు 67 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అత్యధికంగా నోటా ఓట్లు పోలయ్యాయి. ఇకపోతే, పోస్టల్ బ్యాలెట్ల తీరు పరిశీలించినప్పుడు 19 నియోజకవర్గాల్లో నోటాకు ఒక్క ఓటు కూడా పడలేదు. పది అంతకన్నా ఎక్కువ ఓట్లు నోటాకు పోలైన నియోజకవర్గాలు 13 ఉన్నాయి. అత్యధికంగా తాండూరులో పోలైన పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికంగా 25 మంది నోటాకు ఓటు వేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా, అత్యల్పంగా నోటాకు ఓట్లు నమోదైన పది నియోజకవర్గాలు -
ఈ నేతలు మాకొద్దు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)ను జిల్లాలో ఓటర్లు పెద్ద సంఖ్యలోనే వినియోగించుకున్నారు. 14 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాల్లో మొత్తం 330మంది అభ్యర్థులు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చని పక్షంలో నోటాకు ఓటేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. ఓటింగ్ శాతం పెంచాలనే సంకల్పంతో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని కూడా ప్రచారం చేసింది. అయితే జిల్లాలో ఓటింగ్ శాతం పెరగనప్పటికీ నోటాకు మాత్రం భారీగానే ఓట్లు పడ్డాయి. జిల్లావ్యాప్తంగా 34,576 మంది ఓటర్లు నోటాకు జై కొట్టారు. ఇందులో అసెంబ్లీకి పోటీచేసిన 285మంది అభ్యర్థులను వ్యతిరేకించిన వారు 17,888 మంది ఓటర్లు కాగా, పార్లమెంటుకు పోటీచేసిన 45మంది అభ్యర్థులను తిరస్కరించిన వారు 16,688మంది ఓటర్లు ఉన్నారు. మెజార్టీని మించిన ‘నోటా..’ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మెజార్టీ ఓట్లకంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కేఎస్ రత్నంపై కేవలం 1,153 ఓట్లతో విజయం సాధించారు. అయితే ఈ నియోజకవర్గంలో నోటాకు 1,226 ఓట్లు పడ్డాయి. -
ఓటు కాదు.. ‘నోటా’ నొక్కుతాం
ఓటరు చేతికి నిరసనాస్త్రం.. ఈ ఎన్నికల్లో ప్రభావం ఎక్కువే! కె. సతీష్‌కుమార్: మాటలు మరచే నేతలు కొందరు, మాటలు మార్చేవారు మరికొందరు. ప్రజలను ఏమార్చేవారే దాదాపు అందరూ... రాజకీయ నేతలపై అలిగిన ఓటర్లు అందరి‘నోటా’ ఇప్పుడు వినిపిస్తున్నది అదే మాట... ‘నోటా’. బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే, వారందరినీ తిరస్కరిస్తూ ఓటు వేసే హక్కు ఇప్పుడు ఓటర్లకు అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులెవరూ తగిన వారు కాదనుకుంటే, ఈవీఎంలలో ఉండే ‘నన్ ఆఫ్ ది అబౌ’ (నోటా) బటన్ నొక్కవచ్చు. ఇదివరకు అలాంటి అవకాశమే ఉండేది కాదు. పోటీలో ఉన్న వారందరూ కళంకితులే అయినా, వారిలోనే ఎవరో ఒకరికి ఓటేయాల్సిన అగత్యం ఉండేది. అదీ ఇష్టం లేకుంటే, పోలింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చేది. ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది. దీనివల్ల పోలింగ్ శాతం పెరుగుతుందని అభిప్రాయపడింది. ఫలితంగా గత ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘నోటా’ తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. చాలా చోట్ల ఓటర్లు కసితీరా ‘నోటా’ మీటను నొక్కి అభ్యర్థులపై తమ ఆగ్రహాన్ని చాటుకున్నారు. అయితే, ‘నోటా’ వల్ల నిజానికి ఒరిగేదేమీ ఉండదు. ఒకవేళ బరిలో ఉన్న అభ్యర్థులందరి కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు వచ్చినా, ఫలితాల్లో మార్పేమీ ఉండదు. ఎక్కువ ఓట్లు దక్కిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ‘నోటా’కు, తిరస్కరణ హక్కుకు (రైట్ టు రిజెక్ట్-ఆర్టీఆర్) తేడా ఉంది. తిరస్కరణ హక్కు మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ‘నోటా’ను తిరస్కరణ హక్కుగా చాలామంది పొరబడితే, అది తిరస్కరణ హక్కు కాదంటూ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖురేషీ స్పష్టం చేశారు. ‘నోటా’కు పడ్డ ఓట్లను చెల్లని ఓట్లుగానే పరిగణిస్తామని ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇచ్చింది. అయితే, ‘నోటా’కు ఇప్పటి వరకు ఎలాంటి గుర్తునూ కేటాయించలేదు. అక్షరాస్యులకు ఎలాంటి సమస్య లేకపోయినా, నిరక్షరాస్యులకు ఇది ఇబ్బందికరమని, ‘నోటా’కు గుర్తు కేటాయించాలని ప్రముఖ రచయిత సౌదా హైకోర్టులో ‘పిల్’ దాఖలు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు, ‘నోటా’కు గుర్తు కేటాయించాలని, వీలైతే ఈ ఎన్నికల్లోనే కేటాయించాలని ఎన్నికల కమిషన్‌కు సూచించింది. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తికావడమే కాకుండా, ఎన్నికల కమిషన్ ఈవీఎంలను ముందుగానే సిద్ధం చేసినందున ‘నోటా’కు గుర్తు ఈ ఎన్నికల్లో కేటాయించే అవకాశాలు దాదాపు లేనట్లే. ఇదీ ప్రభావం... ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘నోటా’ ప్రభావం బాగానే కనిపిస్తోంది. చాలా చోట్ల పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఓటర్లు ఈసారి ‘నోటా’కు ఓటు వేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. కొన్ని చోట్ల గ్రామాలు, కాలనీల వద్ద ‘నోటా’ బోర్డులు, బ్యానర్లు సైతం పెడుతున్నారు. పలు రాష్ట్రాల్లో ‘నోటా’ ప్రచార కమిటీలూ పుట్టుకొచ్చాయి. ఓటు హక్కును తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే ‘నోటా’కు ఓటు వేయాలని ఈ కమిటీలు ప్రచారం చేస్తున్నాయి. ఒడిశాలోని కొంధొమాల్ గిరిజనులు, కోల్‌కతాలో సెక్స్‌వర్కర్లు ‘నోటా’కే ఓటు వేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. తమను పట్టించుకోని రాజకీయ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్న పలు వర్గాలు, ‘నోటా’కే ఓటు వేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇదీ నేపథ్యం... అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, రష్యా, బంగ్లాదేశ్, కొలంబియా, స్పెయిన్, స్వీడన్ తదితర దేశాల్లో ‘నోటా’ పద్ధతి అమలులో ఉంది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కౌంటీ ఎన్నికల్లో 1976లో తొలిసారిగా ‘నోటా’ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిజానికి అభ్యర్థులెవరూ నచ్చకుంటే తిరస్కార ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49 (ఓ) సెక్షన్ కింద ఓటర్లు ఈ హక్కును ఉపయోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి, దీనికోసం 17-ఏ ఫారం తీసుకుని, ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు. ఇది రహస్య బ్యాలెట్ విధానానికి విరుద్ధమైనదని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది మంచి పద్ధతి కాదని విమర్శలు వచ్చాయి. అయితే, అప్పట్లో చాలామంది ఓటర్లకు దీనిపై అవగాహన ఉండేది కాదు. ఈవీఎంలు వాడుకలోకి రావడంతో ఎన్నికల కమిషన్ చొరవ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘నోటా’ అందుబాటులోకి వచ్చింది. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో గత ఏడాది ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఓటర్లు ‘నోటా’కు ఓటు వేశారు. కొన్నిచోట్ల గెలుపొందిన అభ్యర్థికి, ఓటమి పాలైన సమీప ప్రత్యర్థికి నడుమనున్న ఓట్ల వ్యత్యాసం కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లో ‘నోటా’కు అత్యధికంగా 3.1 శాతం ఓట్లు పడ్డాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 2 శాతం, ఢిల్లీలో 1 శాతం ఓట్లు ‘నోటా’కు పడ్డాయి. ‘నోటా’ పార్టీలు ‘నోటా’ కోసం కొన్ని దేశాల్లో ఏకంగా రాజకీయ పార్టీలే పుట్టుకొచ్చాయి. కొందరు అభ్యర్థులు ‘నోటా’గా పేరు మార్చుకుని మరీ బరిలోకి దిగిన సందర్భాలు ఉన్నాయి. బ్రిటన్ ఎన్నికల కమిషన్ వద్ద 2009లో ‘నోటా’ పేరిట ఒక రాజకీయ పార్టీ నమోదైంది. అయితే, కేవలం నిరసన ఓట్ల నమోదు కోసమే ఈ పార్టీ పుట్టింది. బ్రిటన్‌లోనే 2000లో ‘నో కేండిడేట్ డిజర్వ్స్ మై ఓట్’ పార్టీ నమోదైంది. ‘నన్ ఆఫ్ ది అబౌ జీరో’ అనే అభ్యర్థి 2010లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశాడు. - సెర్బియాలో 2010లో ‘నోటా’ పార్టీ ప్రారంభమైంది. ఈ పార్టీ 2012లో జరిగిన సెర్బియా పార్లమెంటు ఎన్నికల్లో ఓట సీటు కూడా గెలుచుకుంది. - ఆస్ట్రేలియాలో 2007లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జెఫ్ రిచర్డ్సన్ అనే వ్యక్తి తన పేరును ‘ఆఫ్ ది అబౌ నన్’గా మార్చుకుని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. - ఉక్రేనియా అధ్యక్ష పదవికి 2010లో జరిగిన ఎన్నికల్లో వాసిలీ హుమేనియుక్ అనే వ్యక్తి, తన పేరును ‘వాసిలీ అగెనైస్ట్ ఆల్’గా మార్చుకుని పోటీ చేశాడు. నోటాకే మా ఓటు ‘ఏంటీ.. వీరంతా ఇళ్ల వుుందు ‘నోటా’ బోర్డు పెట్టుకున్నారు..’ అని ఆశ్చర్యపోతున్నారా..? దశాబ్దాల తరబడి నేతలు తవు సవుస్యలను పరిష్కరించందుకు వీరంతా ఇలా నిరసన వ్యక్తంచేస్తున్నారు! ఈసారి ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయుబోవుని, ‘నోటా’ మీట నొక్కి నేతలకు బుద్ధి చెబుతావుని అంటున్నారు చెన్నైలోని వ్యాసార్పాడికి చెందిన ఓటర్లు. తవు ప్రాంతానికి ప్రచారం కోసం రావొద్దంటూ తెలుపుతూ ‘అభ్యర్థుల్లారా టాటా.. మా ఓటు నోటా’ అంటూ బోర్డులు పెట్టేశారు. ఇక్కడ నివసించే పేదల్లో ఏ ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ఎలాంటి వలిక సదుపాయూలు కల్పించలేదు. నీటి కోసం తిప్పలు పడుతున్నారు. జిల్లా కలెక్టర్‌కు సైతం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. శ్రీలంకలోని తమిళుల సమస్యలకు తెగ బాధపడిపోయే నేతలకు చెన్నైలోనే ఉంటున్న మా సమస్యలు తెలియవా అంటూ ఫ్లెక్సీలో వీరు ప్రశ్నలు సంధించారు. - సి.నందగోపాల్ (సాక్షి, చెన్నై) -
ఈవీ‘ఏం చేస్తాయో’!
సాక్షి, సంగారెడ్డి: నచ్చిన అభ్యర్థికి ఓటేయడమే కాదు..బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ‘నోటా’ మీటను నొక్కి అందరినీ తిరస్కరించే హక్కు ఈ సారి ఓటర్లకు సంక్రమించనుంది. ఇదొక్కటే కాదు..తమ ఓటు సరిగ్గా నమోదైందా లేదా తెలుసుకునేలా ప్రతి ఓటరు చేతికీ ఓ రసీదు సైతం అందనుంది. నోటా(నన్ ఆఫ్ దీ ఎబవ్), వీవీ పాట్(ఓటర్ వెరిఫైయబుల్ ప్రింట్ ఆడిట్ ట్రయల్) పేర్లతో ఈ సార్వత్రిక ఎన్నికల ద్వారా ఓటర్లకు పరిచయమవుతున్న ఈ రెండు కొత్త వెసుబాట్లపై ఎంత మంది అవగాహన కలిగి ఉంటారు?... ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టడం కష్టమే. ఎందుకంటే..ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం) బ్యాలెట్ యూనిట్‌పై ఉండే ఏదో ఒక మీటను నొక్కి నచ్చిన అభ్యర్థికి ఓటేయడమే ఇప్పటి వరకు ఓటర్లకు తెలుసు. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలతో తొలిసారిగా అమలవుతున్న తిరస్కరణ ఓటు, ఓటు రసీదుపై ఓటర్లకు విస్తృతంగా ప్రచారం కల్పించడానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామ, మండల స్థాయి సంగతి ఏమో కానీ..కనీసం జిల్లా కేంద్రంలో సైతం ఓటర్లకు అవగాహన కల్పించిన దాఖలాల్లేవు. ప్రధానంగా పల్లె ఓటర్లకు అవగాహన కల్పించకపోతే పోలింగ్ రోజు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఓటు రసీదు..ఇస్తారో లేదో.. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,407 పోలింగ్ బూత్‌లుంటే..6,700 బ్యాలెట్ యూనిట్లు, 6,500 కంట్రోల్ యూనిట్లను కేటాయించారు. ఇప్పటివరకు 5,500 బ్యాలెట్ యూనిట్లు, 5,500 కంట్రోల్ యూనిట్లు జిల్లాకు చేరాయి. ప్రతి ఈవీఎంలో బ్యాలెట్, కంట్రో ల్ యూనిట్ల పేరుతో రెండు విడి భాగాలుంటాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన ఈ సరికొత్త ఈవీఎంల పనితీరును బీహెచ్ఈఎల్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు గత రెండు వారాలుగా పరిశీలించి చూస్తున్నారు. వీటిపై ఉండే ‘నోటా’ మీటను నొక్కి అభ్యర్థులందరినీ తిరస్కరించే వెసులుబాటు ఓటర్లకు ఈ కొత్త యంత్రాలు కల్పించనున్నాయి. అదే విధంగా ఓటేసిన తర్వాత చేతికి రసీదును సైతం అందించాల్సి ఉంటుంది. ఏ అభ్యర్థికి ఓటేశారో ఈ రసీదులో ఉండనుంది. జిల్లా ఓటర్లకు మాత్రం ఈ ఎన్నికల్లో ‘వీవీ పాట్’ను పరిచయం చేయడం లేదని..దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం జిల్లాకు చేరలేదని ఓ అధికారి తెలిపారు. ‘మాక్’ తెల్వదే ! ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై గతంలో పలు రాజకీయ పక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈవీఎంలను టాంపర్ చేసి ఫలితాలను తారుమారు చేయవచ్చని నిపుణులు రుజువు చేసి చూపించారు కూడా. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో వినియోగించనున్న ఈవీఎంల పనితీరుపై అఖిలపక్ష పార్టీలకు అవగాహన కల్పించడానికి ఎన్నికల యంత్రాంగం మాక్ పోలింగ్ నిర్వహించి అంతా సరిగ్గానే ఉందని చూపించాల్సి ఉంటుంది. ఈ మాక్ పోలింగ్ తతంగం ఎప్పుడో పూర్తైదని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో), ఈవీఎంల నోడల్ అధికారి దయానంద్ ‘సాక్షి’కి తెలిపారు. అఖిలపక్ష పార్టీల నేతలను సైతం ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నప్పటికీ.. ఈ విషయాన్ని అఖిల పక్ష పార్టీలన్నీ ఖండిస్తున్నాయి. మాక్‌పోలింగ్ జరిపినట్లు తమకు సమాచారమే లేదని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల జిల్లా అధ్యక్షులు ఆర్. సత్యనారాయణ, కాసాల బుచ్చిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
30న మున్సిపల్ ఎన్నికలు
* 10వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ * ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ * ఏప్రిల్ 2వ తేదీన కౌంటింగ్.. ఫలితాలు * ఏప్రిల్ 7న పరోక్ష పద్ధతిలో మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక * ప్రస్తుతం 146 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలోనే ఎన్నికలు * 95,35,824 మంది ఓటర్లకు 9,015 పోలింగ్ కేంద్రాలు * ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ప్రకటించిన రమాకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల భేరి మోగింది. పోలింగ్, ఫలితాలు, పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక షెడ్యూల్‌తో పాటు రాష్ట్రస్థాయి నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రిటర్నింగ్ అధికారులు మార్చి 10న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారని కమిషనర్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ రెండో తేదీన జరుగుతుందని, అదేరోజు ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఏప్రిల్ 7న చైర్పర్సన్లు, మేయర్లను ఎన్నుకుంటారని తెలిపారు. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికకు ఈనెల 20వ తేదీన వేరుగా నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. ఏప్రిల్ ఏడో తేదీతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. కౌన్సిలర్లకు గరిష్టంగా లక్ష రూపాయలు, కార్పొరేటర్లకు గరిష్టంగా లక్షన్నర రూపాయల ఎన్నికల వ్యయ పరిమితిని నిర్ణయించినట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో డిపాజిట్ ఎస్సీ/ఎస్టీ/బీసీలకు రూ.1,250, ఇతరులకు రూ.2,500గా, కార్పొరేషన్లలో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5,000గా నిర్ణయించామన్నారు. 11 వేల ఈవీఎంల వినియోగం ప్రస్తుతం 146 మున్సిపాలిటీ ల్లోని 3,990 వార్డులకు, పది కార్పొరేషన్లలోని 513 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. గ్రామాల విలీనం సమస్యలు, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 13 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. మొత్తం 95,35,824 మంది 9,015 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. ఇందుకోసం 11 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) వినియోగిస్తున్నామన్నారు. ఈవీఎంలలో ‘నోటా’ (నన్ ఆఫ్ ది అబౌవ్) ఆప్షన్‌ను పొందుపరిచేందు కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. 49,583 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారని తెలిపారు. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తాను పలుమార్లు సీఎంలకు వివరించానని రమాకాంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని ఫిబ్రవరి 26వ తేదీన సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేని విధంగా సెలవు రోజున పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 7న వస్తుందని భావిస్తున్నామని, అప్పటికి ఈ ఎన్నికలు పూర్తవుతాయని, అవసరమైతే మేయర్, చైర్పర్సన్ల ఎన్నికలు ఒకటీ రెండురోజులు ముందుకు జరుపుతామని చెప్పారు. ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ కూడా విలేకరుల భేటీలో పాల్గొన్నారు. తక్షణం అమల్లోకి నియమావళి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ జారీతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని రమాకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రత్యేకంగా ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియమావళి అమలులో ఉంటుం దన్నారు. ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారి బదిలీలు పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందు బదిలీలు చేసినా, అమలుకాని పక్షంలో వాటిని ఇప్పుడు అమలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తప్పనిసరిగా బదిలీలు చేయాలనుకుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి ప్రారంభోత్సవాలూ చేయడానికి వీల్లేదన్నారు. -
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమర భేరీ మోగింది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 11, 19న రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 25, రాజస్థాన్‌లో డిసెంబర్ 1, ఢిల్లీ, మిజోరాంలో డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ) వీఎస్ సంపత్ తెలిపారు. డిసెంబర్ 8న ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పునకు అనుగుణంగా నచ్చని అభ్యర్థులను తిరస్కరించే హక్కును మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల్లో ఓటరుకు కల్పించనున్నారు. ఈవీఎం మిషన్లలో ‘పైవారు ఎవరూ కాదు’ అన్న మీటను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 630కిపైగా నియోజకవర్గాల్లో సుమారు 11 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వీఎస్ సంపత్ వివరించారు. ఇందుకు 1.30 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి అనర్హతకు గురైన ఎంపీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఆయా స్థానాలను నోటిఫై చేసిన తర్వాతే తాము ఖాళీలను ప్రకటిస్తామని చెప్పారు. విజయంపై కాంగ్రెస్, బీజేపీ ధీమా ఐదు రాష్ట్రాల్లో తామే విజయం సాధిస్తామని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ధీమా వ్యక్తంచేశాయి. తమ విధానాలు, పథకాలే విజయాన్ని కట్టబెడతాయని కాంగ్రెస్ పేర్కొనగా.. ఎన్నికల్లో మోడీ ప్రభంజనం ఖాయమని బీజేపీ ఉద్ఘాటించింది. ‘‘సెమీ ఫైనల్, క్వార్టర్ ఫైనల్ ఏమీ ఉండవు. మాకు ఏ ఎన్నికలైనా ఫైనలే. మా పథకాలు, విధానాలతో ప్రజల్లోకి వెళ్తాం. వారే తీర్పు చెబుతారు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ పేర్కొన్నారు. నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినందున ఈ ఎన్నికలను 2014 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుగా చూస్తారా అని ప్రశ్నించగా.. ‘‘మేం ఏ ఒక్కరినో దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు వెళ్లం..’’ అని ఆయన బదులిచ్చారు. ఐదు రాష్ట్రాల్లో తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌కు చెందిన మరో నేత రషీద్ అల్వీ అన్నారు. నరేంద్రమోడీ అంశం ఈ ఎన్నికల్లో తమకు తప్పకుండా కలిసి వస్తుందని బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేది చెప్పారు. ‘‘ఈ దేశంలో మోడీయే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని అనేక సర్వేల్లో తేలింది. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాల అంశాల ఆధారంగా జరుగుతాయి. అయినా జాతీయ పరిణామాలు కూడా తమ వంతు పాత్ర వహిస్తాయి’’ అని త్రివేదీ వివరించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తమ ప్రభుత్వ సుపరిపాలన మళ్లీ పార్టీకి అధికారాన్ని అందిస్తుందని, ఇక రాజస్థాన్, ఢిల్లీలో కాంగ్రెస్ వ్యతిరేకత లాభిస్తుందని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, మిజోరాంలో గట్టి పోటీ ఇస్తామని చెప్పారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఢిల్లీ, రాజస్థాన్, మిజోరాంలలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అధికారంలో ఉంది. మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలి: మోడీ ఐదు రాష్ట్రాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్వాగతించారు. ‘‘మన ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అంటే పండుగ లాంటివి. ఈ ఎన్నికలు స్ఫూర్తిదాయకమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నా’’ అని ట్విట్టర్లో ఆయన వ్యాఖ్యానించారు. -
మినీ మహా సమరం!
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అనదగ్గ అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో కొత్త సభలను కొలువుతీర్చే పనికి ఎన్నికల సంఘం శుక్రవారం శ్రీకారం చుట్టింది. నవంబర్ 11న జరిగే ఛత్తీస్‌గఢ్ ఎన్నికలతో మొదలై...డిసెంబర్ 4న నిర్వహించే ఢిల్లీ, మిజోరం ఎన్నికలతో ఈ మినీ మహా సమరం ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడవుతాయి. ఢిల్లీ, రాజస్థాన్, మిజోరంలలో కాంగ్రెస్...మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఇప్పుడు పాలకపక్షాలుగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈమధ్య ఇచ్చిన రెండు తీర్పుల ప్రభావం ఈ ఎన్నికల్లో కనబడబోతున్నది. మొదటిది-పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ‘ఎవరూ నచ్చలేద’ని చెప్పేందుకు ఓటర్లకు తొలిసారి అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లలో అదనపు మీటను ఏర్పాటుచేయబోతున్నారు. అలాగే, నేరచరితులుగా తేలి రెండేళ్లకు మించి శిక్షపడే సందర్భంలో ప్రజాప్రతినిధుల సభ్యత్వం వెనువెంటనే రద్దవుతుందని ఇచ్చిన తీర్పు కూడా అన్ని పార్టీలనూ భయపెట్టేదే. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నపక్షంలో అలాంటివారికి టిక్కెట్ ఇచ్చేందుకు ఈసారి పార్టీలు ఉత్సాహం చూపించే అవకాశం లేదు. ఈ అయిదేళ్లలోనూ ఎప్పుడైనా తీర్పు వెలువడి, అందులో శిక్షకు గురైతే వెంటనే వారి సభ్యత్వం ఎగిరిపోతుందన్న భయం అన్ని పార్టీలకూ ఉంటుంది. ఎన్నికలనేసరికి పాలకపక్షాలుగా ఉన్న పార్టీలకు వణుకు సహజం. అయిదేళ్ల తమ పాలన తీసుకొచ్చిన మార్పులూ, అందులోని గుణదోషాలూ విస్తృతంగా చర్చకొచ్చే సమయం గనుక వాటిని సమర్ధించుకోవాల్సిరావడం ఇబ్బందే. ఆ రకంగా చూస్తే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలూ కే ంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తున్న కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షలాంటివి. ఇప్పుడేలుతున్న రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలమనిగానీ, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈసారి సునాయాసంగా పాగా వేయగలమనిగానీ ఆ పార్టీకి నిండైన విశ్వాసం లేదు. కేంద్రంలో కుంభకోణాల పరంపర, అధిక ధరలు, అస్తవ్యస్థ పరిపాలన మాత్రమే కాదు...ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ పాలకపక్షంగా లేదా ప్రతిపక్షంగా విఫలమైన తీరే అందుకు కారణం. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓటర్లు వరసగా మూడుసార్లు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. మూడుసార్లూ షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో అక్కడున్న 70 స్థానాల్లో కాంగ్రెస్‌కు 41 వచ్చాయి. బీజేపీ 24 స్థానాలతో సరిపెట్టుకుంది. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఢిల్లీ పౌరుల్లో నెలకొన్న అభద్రతాభావం ఆమెకు ఈసారి ఆమెకు శాపమే. శాంతిభద్రతలు సక్రమంగా లేవని, మరీ ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన నిర్భయ ఉదంతం ప్రజల మనసుల్లో ఇంకా సజీవంగా ఉంది. ఇదికాక తరచుగా పెరిగిన విద్యుత్ చార్జీలు, నీటి బిల్లులు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలిగించాయి. నిత్యావసర సరుకులు...మరీ ముఖ్యంగా ఉల్లిగడ్డ ధర ఆకాశాన్నంటడం మధ్యతరగతి, దిగువతరగతి ప్రజలను బాగా కుంగదీసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడుగా విభజించాక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మూడుచోట్లా విపక్ష బీజేపీ విజయఢంకా మోగించింది. అయితే, ఈసారి కొత్తగా బరిలోకి దిగబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందేమోనన్న భయం అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌నూ వెన్నాడుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం రాజస్థాన్. అక్కడకూడా కాంగ్రెస్ పరిస్థితి ఆశావహంగా లేదు. శాంతిభద్రతల క్షీణత, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, విద్యుత్‌చార్జీల పెంపు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి గుదిబండలు. ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటను నిలుపుకోలేదని గుజ్జర్లు ఆగ్రహంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ది అత్తెసరు మెజారిటీయే. 200 స్థానాలున్న సభలో అప్పుడు కాంగ్రెస్ గెలుచుకున్నవి 96 స్థానాలు మాత్రమే. అప్పట్లో ఆరుగురు సభ్యులున్న బీఎస్పీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. గత ఎన్నికల్లో 78 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఇప్పుడు సునాయాసంగా గెలవగలనన్న విశ్వాసంతో ఉంది. ఇప్పుడు పరిపాలిస్తున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మళ్లీ తమకే దక్కుతాయని బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రజాదరణపొందిన వివిధ పథకాలవల్లా, అభివృద్ధి కార్యక్రమాలవల్లా వరసగా మూడోసారి కూడా సునాయాసంగా విజయం సాధించగలనని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. చౌహాన్ సన్నిహితులపై ఐటీ శాఖ దాడులు, కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపబోవని పార్టీ భావిస్తోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలోని 230 స్థానాల్లో బీజేపీకి ఇప్పుడు 153 స్థానాలుండగా కాంగ్రెస్ 66 స్థానాలు గెల్చుకుంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 90 స్థానాల్లో బీజేపీ గత ఎన్నికల్లో 49 సాధించగా, కాంగ్రెస్ 39 స్థానాలు గెల్చుకుంది. ఆమధ్య కాంగ్రెస్ కాన్వాయ్‌పై నక్సలైట్లు దాడిచేసి ముఖ్య నాయకులను హతమార్చిన ఘటన తర్వాత తమపై సానుభూతి వెల్లువెత్తుతోందన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో ఉంది. కానీ, పాలనలోనూ...మరీ ముఖ్యంగా ప్రజాపంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దడంలో సమర్ధతను కనబరిచిన రమణ్‌సింగ్ సర్కారును సవాల్ చేయడం అంత సులభమేమీ కాదు. మొత్తమ్మీద ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్ సంగతలా ఉంచి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్రమోడీ దీక్షాదక్షతలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష. ఇందులో ఘనవిజయం సాధిస్తేనే తన పార్టీలో మోడీ తిరుగులేని నేతగా ఎదుగుతారు... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశలు ఈడేరతాయి.