ఓటు కాదు.. ‘నోటా’ నొక్కుతాం | we donot vote, only NOTA | Sakshi
Sakshi News home page

ఓటు కాదు.. ‘నోటా’ నొక్కుతాం

Published Wed, Apr 9 2014 2:07 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

ఓటు కాదు.. ‘నోటా’ నొక్కుతాం - Sakshi

ఓటు కాదు.. ‘నోటా’ నొక్కుతాం

ఓటరు చేతికి నిరసనాస్త్రం.. ఈ ఎన్నికల్లో ప్రభావం ఎక్కువే!
కె. సతీష్‌కుమార్: మాటలు మరచే నేతలు కొందరు, మాటలు మార్చేవారు మరికొందరు. ప్రజలను ఏమార్చేవారే దాదాపు అందరూ... రాజకీయ నేతలపై అలిగిన ఓటర్లు అందరి‘నోటా’ ఇప్పుడు వినిపిస్తున్నది అదే మాట... ‘నోటా’. బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే, వారందరినీ తిరస్కరిస్తూ ఓటు వేసే హక్కు ఇప్పుడు ఓటర్లకు అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులెవరూ తగిన వారు కాదనుకుంటే, ఈవీఎంలలో ఉండే ‘నన్ ఆఫ్ ది అబౌ’ (నోటా) బటన్ నొక్కవచ్చు. ఇదివరకు అలాంటి అవకాశమే ఉండేది కాదు. పోటీలో ఉన్న వారందరూ కళంకితులే అయినా, వారిలోనే ఎవరో ఒకరికి ఓటేయాల్సిన అగత్యం ఉండేది.
 
 అదీ ఇష్టం లేకుంటే, పోలింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చేది. ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది.
 
 దీనివల్ల పోలింగ్ శాతం పెరుగుతుందని అభిప్రాయపడింది. ఫలితంగా గత ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘నోటా’ తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. చాలా చోట్ల ఓటర్లు కసితీరా ‘నోటా’ మీటను నొక్కి అభ్యర్థులపై తమ ఆగ్రహాన్ని చాటుకున్నారు. అయితే, ‘నోటా’ వల్ల నిజానికి ఒరిగేదేమీ ఉండదు. ఒకవేళ బరిలో ఉన్న అభ్యర్థులందరి కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు వచ్చినా, ఫలితాల్లో మార్పేమీ ఉండదు. ఎక్కువ ఓట్లు దక్కిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ‘నోటా’కు, తిరస్కరణ హక్కుకు (రైట్ టు రిజెక్ట్-ఆర్టీఆర్) తేడా ఉంది. తిరస్కరణ హక్కు మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ‘నోటా’ను తిరస్కరణ హక్కుగా చాలామంది పొరబడితే, అది తిరస్కరణ హక్కు కాదంటూ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖురేషీ స్పష్టం చేశారు. ‘నోటా’కు పడ్డ ఓట్లను చెల్లని ఓట్లుగానే పరిగణిస్తామని ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇచ్చింది. అయితే, ‘నోటా’కు ఇప్పటి వరకు ఎలాంటి గుర్తునూ కేటాయించలేదు.
 
 అక్షరాస్యులకు ఎలాంటి సమస్య లేకపోయినా, నిరక్షరాస్యులకు ఇది ఇబ్బందికరమని, ‘నోటా’కు గుర్తు కేటాయించాలని ప్రముఖ రచయిత సౌదా హైకోర్టులో ‘పిల్’ దాఖలు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు, ‘నోటా’కు గుర్తు కేటాయించాలని, వీలైతే ఈ ఎన్నికల్లోనే కేటాయించాలని ఎన్నికల కమిషన్‌కు సూచించింది. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తికావడమే కాకుండా, ఎన్నికల కమిషన్ ఈవీఎంలను ముందుగానే సిద్ధం చేసినందున ‘నోటా’కు గుర్తు ఈ ఎన్నికల్లో కేటాయించే అవకాశాలు దాదాపు లేనట్లే.
 
 ఇదీ ప్రభావం...
 ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘నోటా’ ప్రభావం బాగానే కనిపిస్తోంది. చాలా చోట్ల పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఓటర్లు ఈసారి ‘నోటా’కు ఓటు వేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. కొన్ని చోట్ల గ్రామాలు, కాలనీల వద్ద ‘నోటా’ బోర్డులు, బ్యానర్లు సైతం పెడుతున్నారు. పలు రాష్ట్రాల్లో ‘నోటా’ ప్రచార కమిటీలూ పుట్టుకొచ్చాయి. ఓటు హక్కును తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే ‘నోటా’కు ఓటు వేయాలని ఈ కమిటీలు ప్రచారం చేస్తున్నాయి. ఒడిశాలోని కొంధొమాల్ గిరిజనులు, కోల్‌కతాలో సెక్స్‌వర్కర్లు ‘నోటా’కే ఓటు వేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. తమను పట్టించుకోని రాజకీయ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్న పలు వర్గాలు, ‘నోటా’కే ఓటు వేస్తామని హెచ్చరిస్తున్నాయి.

 ఇదీ నేపథ్యం...
 అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, రష్యా, బంగ్లాదేశ్, కొలంబియా, స్పెయిన్, స్వీడన్ తదితర దేశాల్లో ‘నోటా’ పద్ధతి అమలులో ఉంది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కౌంటీ ఎన్నికల్లో 1976లో తొలిసారిగా ‘నోటా’ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిజానికి అభ్యర్థులెవరూ నచ్చకుంటే తిరస్కార ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49 (ఓ) సెక్షన్ కింద ఓటర్లు ఈ హక్కును ఉపయోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి, దీనికోసం 17-ఏ ఫారం తీసుకుని, ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు.
 
 ఇది రహస్య బ్యాలెట్ విధానానికి విరుద్ధమైనదని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది మంచి పద్ధతి కాదని విమర్శలు వచ్చాయి. అయితే, అప్పట్లో చాలామంది ఓటర్లకు దీనిపై అవగాహన ఉండేది కాదు. ఈవీఎంలు వాడుకలోకి రావడంతో ఎన్నికల కమిషన్ చొరవ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘నోటా’ అందుబాటులోకి వచ్చింది. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో గత ఏడాది ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఓటర్లు ‘నోటా’కు ఓటు వేశారు. కొన్నిచోట్ల గెలుపొందిన అభ్యర్థికి, ఓటమి పాలైన సమీప ప్రత్యర్థికి నడుమనున్న ఓట్ల వ్యత్యాసం కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లో ‘నోటా’కు అత్యధికంగా 3.1 శాతం ఓట్లు పడ్డాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 2 శాతం, ఢిల్లీలో 1 శాతం ఓట్లు ‘నోటా’కు పడ్డాయి.
 
 ‘నోటా’ పార్టీలు
     ‘నోటా’ కోసం కొన్ని దేశాల్లో ఏకంగా రాజకీయ పార్టీలే పుట్టుకొచ్చాయి. కొందరు అభ్యర్థులు ‘నోటా’గా పేరు మార్చుకుని మరీ బరిలోకి దిగిన సందర్భాలు ఉన్నాయి. బ్రిటన్ ఎన్నికల కమిషన్ వద్ద 2009లో ‘నోటా’ పేరిట ఒక రాజకీయ పార్టీ నమోదైంది. అయితే, కేవలం నిరసన ఓట్ల నమోదు కోసమే ఈ పార్టీ పుట్టింది. బ్రిటన్‌లోనే 2000లో ‘నో కేండిడేట్ డిజర్వ్‌స్ మై ఓట్’ పార్టీ నమోదైంది. ‘నన్ ఆఫ్ ది అబౌ జీరో’ అనే అభ్యర్థి 2010లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశాడు.
-     సెర్బియాలో 2010లో ‘నోటా’ పార్టీ ప్రారంభమైంది. ఈ పార్టీ 2012లో జరిగిన సెర్బియా పార్లమెంటు ఎన్నికల్లో ఓట సీటు కూడా గెలుచుకుంది.
-     ఆస్ట్రేలియాలో 2007లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జెఫ్ రిచర్డ్‌సన్ అనే వ్యక్తి తన పేరును ‘ఆఫ్ ది అబౌ నన్’గా మార్చుకుని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు.
-     ఉక్రేనియా అధ్యక్ష పదవికి 2010లో జరిగిన ఎన్నికల్లో వాసిలీ హుమేనియుక్ అనే వ్యక్తి, తన పేరును ‘వాసిలీ అగెనైస్ట్ ఆల్’గా మార్చుకుని పోటీ చేశాడు.
 
 నోటాకే మా ఓటు
 ‘ఏంటీ.. వీరంతా ఇళ్ల వుుందు ‘నోటా’ బోర్డు పెట్టుకున్నారు..’ అని ఆశ్చర్యపోతున్నారా..? దశాబ్దాల తరబడి నేతలు తవు సవుస్యలను పరిష్కరించందుకు వీరంతా ఇలా నిరసన వ్యక్తంచేస్తున్నారు! ఈసారి ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయుబోవుని, ‘నోటా’ మీట నొక్కి నేతలకు బుద్ధి చెబుతావుని అంటున్నారు చెన్నైలోని వ్యాసార్పాడికి చెందిన ఓటర్లు.
 
 తవు ప్రాంతానికి ప్రచారం కోసం రావొద్దంటూ తెలుపుతూ  ‘అభ్యర్థుల్లారా టాటా.. మా ఓటు నోటా’ అంటూ బోర్డులు పెట్టేశారు. ఇక్కడ నివసించే పేదల్లో ఏ ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ఎలాంటి వలిక సదుపాయూలు కల్పించలేదు. నీటి కోసం తిప్పలు పడుతున్నారు. జిల్లా కలెక్టర్‌కు సైతం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. శ్రీలంకలోని తమిళుల సమస్యలకు తెగ బాధపడిపోయే నేతలకు చెన్నైలోనే ఉంటున్న మా సమస్యలు తెలియవా అంటూ ఫ్లెక్సీలో వీరు ప్రశ్నలు సంధించారు.
 - సి.నందగోపాల్ (సాక్షి, చెన్నై)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement