పెద్దపీట.. ఉత్తమాట!
తమిళనాడులో మహిళలను విస్మరించిన పార్టీలు
ఒక్క మహిళకూ టికెట్టివ్వని బీజేపీ
మూడు సీట్లతో సరిపెట్టిన కాంగ్రెస్
సి.నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘‘మహిళాభ్యుదయం.. ఆకాశంలో సగం.. మహిళా సాధికారత...’’ అంటూ ఓట్ల కోసం ఉపన్యాసాలు దంచేసే రాజకీయ నేతలకు టికెట్ల ద గ్గరికి వచ్చే సరికి మాత్రం ఆ మహిళలు కనిపించడం లేదు! మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామంటూ తమిళనాట నానా హంగామా చేసే పార్టీలన్నీ మహిళలకు మొండిచేయి చూపాయి. రాష్ట్రంలో పదికిపైగా ఉన్న పార్టీలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తమ్మీద 12 మంది మహిళలకు మాత్రమే టికెట్లిచ్చాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీ అయితే కనీసం ఒక్క మహిళనైనా బరిలోకి దించలేదు. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే తదితర పార్టీలతో పొత్తుపెట్టుకుని కూటమిని ఏర్పరచుకున్న బీజేపీ... ఈ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీచేస్తోంది.
బీజేపీతోపాటు ఈ కూటమిలోని ఏ పార్టీ కూడా మహిళలకు టికెట్ ఇవ్వలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గట్టి మద్దతుదారైన సుష్మాస్వరాజ్ పార్టీలోనే మహిళకు ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. ఇక మిగిలిన పార్టీల విషయానికి వస్తే అన్నాడీఎంకే 4, కాంగ్రె స్ 3, డీఎంకే 2, సీపీఎం 2, సీపీఐ ఒకరికి చొప్పున మహిళలకు అవకాశం కల్పించాయి. జయలలిత నేతృత్వంలోని అధికార అన్నాడీఎంకే సైతం మహిళలకు కేవలం నాలుగు సీట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. తమిళనాడులో 39, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 లోక్‌సభ స్థానాలున్నాయి.
పార్టీల వారీగా మహిళా అభ్యర్థులు...
4.అన్నాడీఎంకే: మరగతం కుమారవేల్ (కాంచీ పురం), వనరోజా (తిరువన్నామలై), సత్యభామ (తిరుపూర్), వాసంతి మురుగేశన్ (దక్షిణ కాశీ)
3. కాంగ్రెస్: చారుబాల తొండైమాన్ (తిరుచ్చీ), రాణీ (విళుపురం), జ్యోతిమణి (కరూర్)
3. వామపక్షాలు: వాసుకి (ఉత్తర చెన్నై) సీపీఎం,
తమిళ్‌సెల్వి (తంజావూరు) సీపీఎం, మహేశ్వరీ (రామనాధపురం) సీపీఐ
2. డీఎంకే: ఉమా రమణి (సేలం), పవిత్ర వల్లి (ఈరోడ్)
0 బీజేపీ