ఓటెలా వెయ్యాలంటే..
సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 18-19 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు 15 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరందరికీ ఓటు వేయడం కొత్త అనుభవం. అసలు ఓటు ఎలా వేయాలి? పోలింగ్ కేంద్రంలో ఆ క్రమం ఎలా ఉంటుంది? ఏయే తనిఖీలు ఉంటాయి? ఇలా.. ఎన్నో అనుమానాలు వారిని వేధిస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకుందాం. పోలింగ్ ప్రక్రియ క్రమాన్ని ఓసారి పరికిద్దాం. గర్భిణులు, పసిపిల్లల తల్లులు, వికలాంగులు తప్ప మిగతా వారందరూ ఓటింగ్‌కు క్యూలోనే వెళ్లాలి. క్యూలో నుంచున్న ఓటరు బూత్‌లోకి వెశ్లాక పరిస్థితి ఇలా ఉంటుంది.
ధ్రువీకరణ పత్రాన్ని చూపించాలి
పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించగానే మొదట అక్కడున్న పోలింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లాలి. అతని వద్ద ఆ బూత్‌కు సంబంధించిన ఓటర్ల జాబితా ఉంటుంది. ఓటర్ స్లిప్ కానీ, మీ గుర్తింపును తెలిపే రేషన్ కార్డు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు లాంటి ధ్రువీకరణ పత్రాన్ని అతనికి చూపించాలి. అప్పుడు ఆ అధికారి ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో చూస్తారు. అలాగే మీరు చూపిన ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలిస్తారు. తర్వాత ఆ పోలింగ్ అధికారి మీ పేరును, ఓటర్ల జాబితాలో సీరియల్ నంబరును పక్కనున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లకు వినిపించేలా బిగ్గరగా చదువుతారు. అప్పుడు పోలింగ్ ఏజెంట్ల నుంచి మీ ఓటింగ్‌కు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే మీరు రెండో పోలింగ్ అధికారి వద్దకు వెళతారు.
సిరా గుర్తు...
రెండో పోలింగ్ అధికారి మొదట మీ వేలిపై సిరా గుర్తు వేస్తారు. తర్వాత తన వద్ద ఉన్న రిజిస్టర్‌లో మీ పేపరు, ఓటర్ల జాబితాలో ఉన్న సీరియల్ నంబరు, బూత్‌లో ఓటరుగా మీ సీరియల్ నంబరు నమోదు చేస్తారు. తర్వాత ఆ రిజిస్టర్‌లో మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. సంతకం చేయలేని వారు వేలిముద్ర వేయాలి. తర్వాత ఆ అధికారి సంతకం చేసిన ఓటర్ స్లిప్ మీకు ఇస్తారు.
ఈవీఎం వద్దకు...
రెండో అధికారి ఇచ్చిన స్లిప్ తీసుకు ని మూడోఅధికారి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఆయన ఓటర్ స్లిప్ తీసుకుని ఈవీఎం కంట్రోల్ యూనిట్‌లో ఉండే బ్యాలెట్ బటన్‌ను నొక్కి, ఈవీఎం ఉండే చోటికి మిమ్మల్ని పంపుతారు. ఇప్పుడు మీరు వేసే ఓటు నమోదు చేసేందుకు ఈవీఎం సిద్ధంగా ఉందన్న మాట.
మీట నొక్కుడే...
ఈవీఎంలో వరుస క్రమంలో అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. ప్రతి గుర్తు పక్కనా ఒక్కో నీలంరంగు బటన్ ఉంటుంది. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటే ఆ అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా ఉన్న బ్లూ బటన్‌ను నొక్కాలి. అది నొక్కగానే అభ్యర్థి పేరు, గుర్తుకు మరో వైపు ఉన్న ఎర్ర బల్బు వెలుగుతుంది. ఒక ‘బీప్’ శబ్దం కూడా వస్తుం ది. అంటే మీ ఓటు నమోదయిందని అర్థం. ఆ వెంటనే పక్కనే ఉన్న మరో ఈవీఎంలో కూడా ఇలాగే చేసి లోక్‌సభ అభ్యర్థికి ఓటువేస్తే మీ ఓటు ప్రక్రియ ముగిసినట్టే.