30న మున్సిపల్ ఎన్నికలు
* 10వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ
* ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
* ఏప్రిల్ 2వ తేదీన కౌంటింగ్.. ఫలితాలు
* ఏప్రిల్ 7న పరోక్ష పద్ధతిలో మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక
* ప్రస్తుతం 146 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలోనే ఎన్నికలు
* 95,35,824 మంది ఓటర్లకు 9,015 పోలింగ్ కేంద్రాలు
* ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ప్రకటించిన రమాకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల భేరి మోగింది. పోలింగ్, ఫలితాలు, పరోక్ష పద్ధతిలో చైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నిక షెడ్యూల్‌తో పాటు రాష్ట్రస్థాయి నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రిటర్నింగ్ అధికారులు మార్చి 10న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారని కమిషనర్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ రెండో తేదీన జరుగుతుందని, అదేరోజు ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఏప్రిల్ 7న చైర్‌పర్సన్లు, మేయర్లను ఎన్నుకుంటారని తెలిపారు. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికకు ఈనెల 20వ తేదీన వేరుగా నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. ఏప్రిల్ ఏడో తేదీతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.
కౌన్సిలర్లకు గరిష్టంగా లక్ష రూపాయలు, కార్పొరేటర్లకు గరిష్టంగా లక్షన్నర రూపాయల ఎన్నికల వ్యయ పరిమితిని నిర్ణయించినట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో డిపాజిట్ ఎస్సీ/ఎస్టీ/బీసీలకు రూ.1,250, ఇతరులకు రూ.2,500గా, కార్పొరేషన్లలో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5,000గా నిర్ణయించామన్నారు.
11 వేల ఈవీఎంల వినియోగం
ప్రస్తుతం 146 మున్సిపాలిటీ ల్లోని 3,990 వార్డులకు, పది కార్పొరేషన్లలోని 513 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. గ్రామాల విలీనం సమస్యలు, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 13 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. మొత్తం 95,35,824 మంది 9,015 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. ఇందుకోసం 11 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) వినియోగిస్తున్నామన్నారు.
ఈవీఎంలలో ‘నోటా’ (నన్ ఆఫ్ ది అబౌవ్) ఆప్షన్‌ను పొందుపరిచేందు కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. 49,583 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారని తెలిపారు. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తాను పలుమార్లు సీఎంలకు వివరించానని రమాకాంత్‌రెడ్డి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని ఫిబ్రవరి 26వ తేదీన సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేని విధంగా సెలవు రోజున పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 7న వస్తుందని భావిస్తున్నామని, అప్పటికి ఈ ఎన్నికలు పూర్తవుతాయని, అవసరమైతే మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నికలు ఒకటీ రెండురోజులు ముందుకు జరుపుతామని చెప్పారు. ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ కూడా విలేకరుల భేటీలో పాల్గొన్నారు.
తక్షణం అమల్లోకి నియమావళి
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ జారీతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని రమాకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రత్యేకంగా ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియమావళి అమలులో ఉంటుం దన్నారు. ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారి బదిలీలు పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందు బదిలీలు చేసినా, అమలుకాని పక్షంలో వాటిని ఇప్పుడు అమలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తప్పనిసరిగా బదిలీలు చేయాలనుకుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి ప్రారంభోత్సవాలూ చేయడానికి వీల్లేదన్నారు.