మినీ మహా సమరం!
Published Sat, Oct 5 2013 12:19 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అనదగ్గ అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో కొత్త సభలను కొలువుతీర్చే పనికి ఎన్నికల సంఘం శుక్రవారం శ్రీకారం చుట్టింది. నవంబర్ 11న జరిగే ఛత్తీస్‌గఢ్ ఎన్నికలతో మొదలై...డిసెంబర్ 4న నిర్వహించే ఢిల్లీ, మిజోరం ఎన్నికలతో ఈ మినీ మహా సమరం ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడవుతాయి. ఢిల్లీ, రాజస్థాన్, మిజోరంలలో కాంగ్రెస్...మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఇప్పుడు పాలకపక్షాలుగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈమధ్య ఇచ్చిన రెండు తీర్పుల ప్రభావం ఈ ఎన్నికల్లో కనబడబోతున్నది.
మొదటిది-పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ‘ఎవరూ నచ్చలేద’ని చెప్పేందుకు ఓటర్లకు తొలిసారి అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లలో అదనపు మీటను ఏర్పాటుచేయబోతున్నారు. అలాగే, నేరచరితులుగా తేలి రెండేళ్లకు మించి శిక్షపడే సందర్భంలో ప్రజాప్రతినిధుల సభ్యత్వం వెనువెంటనే రద్దవుతుందని ఇచ్చిన తీర్పు కూడా అన్ని పార్టీలనూ భయపెట్టేదే. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నపక్షంలో అలాంటివారికి టిక్కెట్ ఇచ్చేందుకు ఈసారి పార్టీలు ఉత్సాహం చూపించే అవకాశం లేదు. ఈ అయిదేళ్లలోనూ ఎప్పుడైనా తీర్పు వెలువడి, అందులో శిక్షకు గురైతే వెంటనే వారి సభ్యత్వం ఎగిరిపోతుందన్న భయం అన్ని పార్టీలకూ ఉంటుంది.
ఎన్నికలనేసరికి పాలకపక్షాలుగా ఉన్న పార్టీలకు వణుకు సహజం. అయిదేళ్ల తమ పాలన తీసుకొచ్చిన మార్పులూ, అందులోని గుణదోషాలూ విస్తృతంగా చర్చకొచ్చే సమయం గనుక వాటిని సమర్ధించుకోవాల్సిరావడం ఇబ్బందే. ఆ రకంగా చూస్తే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలూ కే ంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తున్న కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షలాంటివి. ఇప్పుడేలుతున్న రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలమనిగానీ, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈసారి సునాయాసంగా పాగా వేయగలమనిగానీ ఆ పార్టీకి నిండైన విశ్వాసం లేదు. కేంద్రంలో కుంభకోణాల పరంపర, అధిక ధరలు, అస్తవ్యస్థ పరిపాలన మాత్రమే కాదు...ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ పాలకపక్షంగా లేదా ప్రతిపక్షంగా విఫలమైన తీరే అందుకు కారణం.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓటర్లు వరసగా మూడుసార్లు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. మూడుసార్లూ షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో అక్కడున్న 70 స్థానాల్లో కాంగ్రెస్‌కు 41 వచ్చాయి. బీజేపీ 24 స్థానాలతో సరిపెట్టుకుంది. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఢిల్లీ పౌరుల్లో నెలకొన్న అభద్రతాభావం ఆమెకు ఈసారి ఆమెకు శాపమే. శాంతిభద్రతలు సక్రమంగా లేవని, మరీ ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన నిర్భయ ఉదంతం ప్రజల మనసుల్లో ఇంకా సజీవంగా ఉంది. ఇదికాక తరచుగా పెరిగిన విద్యుత్ చార్జీలు, నీటి బిల్లులు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలిగించాయి. నిత్యావసర సరుకులు...మరీ ముఖ్యంగా ఉల్లిగడ్డ ధర ఆకాశాన్నంటడం మధ్యతరగతి, దిగువతరగతి ప్రజలను బాగా కుంగదీసింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడుగా విభజించాక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మూడుచోట్లా విపక్ష బీజేపీ విజయఢంకా మోగించింది. అయితే, ఈసారి కొత్తగా బరిలోకి దిగబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందేమోనన్న భయం అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌నూ వెన్నాడుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం రాజస్థాన్. అక్కడకూడా కాంగ్రెస్ పరిస్థితి ఆశావహంగా లేదు. శాంతిభద్రతల క్షీణత, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, విద్యుత్‌చార్జీల పెంపు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి గుదిబండలు. ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటను నిలుపుకోలేదని గుజ్జర్లు ఆగ్రహంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ది అత్తెసరు మెజారిటీయే. 200 స్థానాలున్న సభలో అప్పుడు కాంగ్రెస్ గెలుచుకున్నవి 96 స్థానాలు మాత్రమే. అప్పట్లో ఆరుగురు సభ్యులున్న బీఎస్‌పీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. గత ఎన్నికల్లో 78 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఇప్పుడు సునాయాసంగా గెలవగలనన్న విశ్వాసంతో ఉంది.
ఇప్పుడు పరిపాలిస్తున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మళ్లీ తమకే దక్కుతాయని బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రజాదరణపొందిన వివిధ పథకాలవల్లా, అభివృద్ధి కార్యక్రమాలవల్లా వరసగా మూడోసారి కూడా సునాయాసంగా విజయం సాధించగలనని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. చౌహాన్ సన్నిహితులపై ఐటీ శాఖ దాడులు, కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపబోవని పార్టీ భావిస్తోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలోని 230 స్థానాల్లో బీజేపీకి ఇప్పుడు 153 స్థానాలుండగా కాంగ్రెస్ 66 స్థానాలు గెల్చుకుంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 90 స్థానాల్లో బీజేపీ గత ఎన్నికల్లో 49 సాధించగా, కాంగ్రెస్ 39 స్థానాలు గెల్చుకుంది.
ఆమధ్య కాంగ్రెస్ కాన్వాయ్‌పై నక్సలైట్లు దాడిచేసి ముఖ్య నాయకులను హతమార్చిన ఘటన తర్వాత తమపై సానుభూతి వెల్లువెత్తుతోందన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో ఉంది. కానీ, పాలనలోనూ...మరీ ముఖ్యంగా ప్రజాపంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దడంలో సమర్ధతను కనబరిచిన రమణ్‌సింగ్ సర్కారును సవాల్ చేయడం అంత సులభమేమీ కాదు. మొత్తమ్మీద ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్ సంగతలా ఉంచి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్రమోడీ దీక్షాదక్షతలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష. ఇందులో ఘనవిజయం సాధిస్తేనే తన పార్టీలో మోడీ తిరుగులేని నేతగా ఎదుగుతారు... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశలు ఈడేరతాయి.
Advertisement
Advertisement