ఈ నేతలు మాకొద్దు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)ను జిల్లాలో ఓటర్లు పెద్ద సంఖ్యలోనే వినియోగించుకున్నారు. 14 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాల్లో మొత్తం 330మంది అభ్యర్థులు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చని పక్షంలో నోటాకు ఓటేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. ఓటింగ్ శాతం పెంచాలనే సంకల్పంతో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని కూడా ప్రచారం చేసింది. అయితే జిల్లాలో ఓటింగ్ శాతం పెరగనప్పటికీ నోటాకు మాత్రం భారీగానే ఓట్లు పడ్డాయి. జిల్లావ్యాప్తంగా 34,576 మంది ఓటర్లు నోటాకు జై కొట్టారు. ఇందులో అసెంబ్లీకి పోటీచేసిన 285మంది అభ్యర్థులను వ్యతిరేకించిన వారు 17,888 మంది ఓటర్లు కాగా, పార్లమెంటుకు పోటీచేసిన 45మంది అభ్యర్థులను తిరస్కరించిన వారు 16,688మంది ఓటర్లు ఉన్నారు.
మెజార్టీని మించిన ‘నోటా..’
జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మెజార్టీ ఓట్లకంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి కేఎస్ రత్నంపై కేవలం 1,153 ఓట్లతో విజయం సాధించారు. అయితే ఈ నియోజకవర్గంలో నోటాకు 1,226 ఓట్లు పడ్డాయి.