Per cent of the voting
-
ఈ నేతలు మాకొద్దు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)ను జిల్లాలో ఓటర్లు పెద్ద సంఖ్యలోనే వినియోగించుకున్నారు. 14 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాల్లో మొత్తం 330మంది అభ్యర్థులు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చని పక్షంలో నోటాకు ఓటేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. ఓటింగ్ శాతం పెంచాలనే సంకల్పంతో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని కూడా ప్రచారం చేసింది. అయితే జిల్లాలో ఓటింగ్ శాతం పెరగనప్పటికీ నోటాకు మాత్రం భారీగానే ఓట్లు పడ్డాయి. జిల్లావ్యాప్తంగా 34,576 మంది ఓటర్లు నోటాకు జై కొట్టారు. ఇందులో అసెంబ్లీకి పోటీచేసిన 285మంది అభ్యర్థులను వ్యతిరేకించిన వారు 17,888 మంది ఓటర్లు కాగా, పార్లమెంటుకు పోటీచేసిన 45మంది అభ్యర్థులను తిరస్కరించిన వారు 16,688మంది ఓటర్లు ఉన్నారు. మెజార్టీని మించిన ‘నోటా..’ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మెజార్టీ ఓట్లకంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కేఎస్ రత్నంపై కేవలం 1,153 ఓట్లతో విజయం సాధించారు. అయితే ఈ నియోజకవర్గంలో నోటాకు 1,226 ఓట్లు పడ్డాయి. -
అత్యంత ఖరీదైన ఎన్నికలివీ!
రూ. 3,426 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. ఈ ఎన్నికలకోసం ప్రభుత్వం రూ.3,426 కోట్లు వెచ్చించింది. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈ వ్యయం 131 శాతం అధికం. ఐదేళ్ల క్రితం జరిగిన ఆ లోక్‌సభ ఎన్నికలకోసం ప్రభుత్వం చేసిన వ్యయం రూ.1,483 కోట్లు మాత్రమే. ప్రస్తుతం తొమ్మిది దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో అటు ప్రభుత్వం చేసిన వ్యయంతోపాటు ఇటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పెట్టిన ఖర్చు రూ.30 వేల కోట్ల పైమాటే. ఈసారి ఎన్నికల వ్యయం పెరగడానికి పలు అంశాలు కారణమయ్యాయి. ఓటింగ్ శాతం పెరగడానికి వీలుగా ఎన్నికల సంఘం.. ఓటర్లను చైతన్యం చేసేందుకు చేపట్టిన ప్రచారం, ఓటర్ స్లిప్‌ల పంపిణీ చేపట్టడం తదితర చర్యలు ప్రభుత్వపరంగా ఎన్నికల వ్యయం పెరగడానికి దారితీసిన అంశాల్లో కొన్ని. -
లెక్కలతో కుస్తీ
ఎన్నికలు ముగిశాయి.. ఇక ఫలితాలే తేలాల్సి ఉంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసే వరకు ఎంతో ఉత్కంఠను అనుభవించిన ఆయా పార్టీల అభ్యర్థులు, గురువారం పూర్తిగా లెక్కల్లో మునిగితేలారు. అభ్యర్థుల తరఫున ఎన్నికల్లో అన్నీతామై వ్యవహరించిన వారి ప్రతినిధులు సైతం విశ్లేషణలతో బిజీగా గడిపారు. ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం కల్లా ఏ అభ్యర్థి భవితవ్యం ఏమిటో తేలిపోనుంది. అప్పటి దాకా ఎవరికి ఇష్టమున్న రీతిలో అంచనాలు.. సమీకరణలు.. రకరకాల ఊహాగానాలతో వార్తలు షికారు చేయనున్నాయి..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ: మునుపెన్నడూ లేనంతగా 80.17శాతం ఓటింగ్ నమోదు కావడంతో పెరిగిన ఓట్లశాతం ఎవరిని ముంచనుంది, ఎవరిని తేల్చనుందన్న అంశానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ, బహుముఖ పోటీ నెలకొంది. పోరులో నిలబడిన పార్టీల సంఖ్యా పెరిగింది. ఫలితంగా వీరందరి మధ్యా ఓట్లు భారీగా చీలిపోవడానికి అవకాశం ఏర్పడింది. ఈసారి ఎన్నికల్లో మరో పరిణామం కూడా ఆసక్తికరంగా మారింది. నాలుగు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇన్ని కారణాల వల్ల విజయం ఎవరిని వరిస్తుందో తేల్చడం కొంత కష్టంగా మారగా, ఆయా పార్టీల అభ్యర్థులు, వారి అనుచరగణం మాత్రం తామెలా బయటపడతామో వివరిస్తూ లెక్కలతో కుస్తీలు పడుతున్నారు. గత ఎన్నికల నాటి ఓట్ల సంఖ్య, ఓటింగ్ శాతం క ంటే, ఈసారి ఓట్ల సంఖ్య, ఓటింగ్ శాతం పెరిగింది. గతం కంటే ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 5.75శాతం ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం పెరుగుదల అన్ని నియోజకవర్గాల్లో నమోదైంది. ఈ కారణంగానే పెరిగిన పోలింగ్ శాతం తమనంటే తమనే గట్టున పడేస్తుందన్న ధీమాను దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఉత్కంఠ రేపిన... హుజూర్నగర్ నాగార్జునసాగర్ ప్రధానంగా హుజూర్నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల పోలింగ్ సరళి తీవ్ర ఉత్కంఠ రేపింది. సాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పోటీలో ఉండడం, ఆయన ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి సీపీఎం మాజీ నేత నోముల నర్సింహయ్య బరిలో ఉండడంతో మొదటి నుంచీ ఈ నియోజకవర్గం ఆసక్తి రేపుతూనే ఉంది. మరోవైపు హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీలో ఉండడం, ఆయన ప్రత్యర్థులుగా వైఎస్సార్‌కాంగ్రెస్ నుంచి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మలు బరిలో ఉండడంతో నామినేషన్ల ఘట్టం నుంచే ఈ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న ప్రచారం జోరందుకోవడం చర్చనీయాంశమైంది. ఈ రెండు చోట్లా టీడీపీకి పడాల్సిన ఓట్లు అసెంబ్లీ అభ్యర్థులకు క్రాస్ అయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక వైపు టీడీపీ ఎంపీ అభ్యర్థికి, మరోవైపు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి పోటీదారులకు టీడీపీ ఓటు క్రాస్ అయ్యిందన్న విశ్లేషణలూ బయటకు వ చ్చాయి. ఈ పరిస్థితి నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా ఎవరికి వారు గెలుపుపై ధీమాతోనే ఉన్నారు. కాగా, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు తమకు ఎన్ని ఓట్లు పోల్ అయి ఉంటాయి..? ఎంత మెజారిటీతో బయటపడే అవకాశం ఉంది..? అన్న సమీకరణాలపై లెక్కలతో కుస్తీలు పడుతున్నారు. గురువారం జిల్లాలో ఇదే పెద్దచర్చగా మారింది. నియోజకవర్గంలోని మండలాలు.., ఆ మండలాల పరిధిలోని గ్రామాలు.., ఆ గ్రామాల్లో ఎవరికి ఎంత పట్టుంది..? పోలైన ఓట్లెన్ని..? అందులో తమకు పడే ఓట్లెన్ని..? అన్నీ కలిపితే, తమకు మొత్తంగా పడే ఓట్లు ఎన్ని, ప్య్రతర్థులకు ఎన్ని పోలై ఉంటాయి..? వీటిని తీసేస్తే, తమకు వచ్చే మెజారిటీ ఎంత అని.. ఇలా లెక్కల్లో మునిగి తేలారు. తమకు పట్టున్న గ్రామాల్లో ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందో ముందు నుంచే ఓ అంచనాతో ఉన్న అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగానే ఉన్నారు. కాగా, సెలైంట్ ఓటింగ్ నడవడం, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య పార్టీల మధ్య భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఎవరు మునుగుతారో, ఎవరు తేలుతారో అర్థం కాక అయోమయానికి గురవుతున్న వారూ ఉన్నారు. ఈనెల 16వ తేదీన ఫలితాలు వెలువడే దాకా ఫలితాల అంచనాల చర్చకు ఫుల్స్టాప్ పడేలా లేదని పలువురు వ్యాఖ్యానించారు. -
‘వీకెండ్’ వణుకు
సాక్షి, ముంబై: వరుసగా వస్తున్న సెలవుల వల్ల అత్యధిక శాతం మంది ఓటర్లు పర్యాటక ప్రాంతాలు, స్వగ్రామాలకు వెళుతున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు, వారికి అండగా నిలిచిన రాజకీయ నాయకులకు దిగులు పట్టుకుంది. ఈ నెల 20న జరిగే పోలింగ్‌లో ఓటింగ్ శాతం తగ్గి ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉండటంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. స్వగ్రామాలకు వెళుతున్న ముంబైకర్లను అడ్డుకోలేక ఏమీ చేయలేని దీనస్థితిలో ఉన్నారు. ఈ సంఖ్య వందల్లో, వేలల్లో కాదు ఏకంగా 10 లక్షల వరకు ఉండే అవకాశముంది. ఇప్పటికే కొందరు ఓటర్లు వెళ్లిపోయారు కూడా. రాష్ట్రంలో మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓ దశ పూర్తయింది. మిగిలిన రెండు దశల ఎన్నికలకు ప్రధాన పార్టీలతోపాటు చిన్నాచితక పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆదివారంతో పాటు వచ్చే ఆదివారం కూడా వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే వేసవి సెలవుల కారణంగా అనేకమంది స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. వారాంతాలలో మూడు రోజులు సెలవులు కలిసి రావడంతో వివిధ ప్యాకేజీలకు ఆకర్షితులైన ఉద్యోగులు కూడా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇప్పటికే కొందరు వెళ్లిపోయారు. దీనికితోడు పెళ్లిల సీజన్ కూడా మొదలైంది. సెలవులు కలిసిరావడంతో దీన్ని అదునుగా చేసుకున్న ఉద్యోగులు శుభ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో అభ్యర్థులు ఆందోళనకు చెందుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ చేపట్టే ప్రచార కార్యక్రమాలకు కూడా వెంటరావడానికి తగిన మందిమార్బలం దొరకడం లేదు. కాగా, ఈశాన్య రాష్ట్రాల దిశగా ప్రతీరోజు సుమారు 25 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ముంబై నుంచి బయలుదేరుతాయి. ఉత్తర, దక్షిణ భారత దిశగా కూడా అనేక రైళ్లు వెళుతున్నాయి. వీటికి తోడు వేసవి ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతున్నారు. ఈ రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రతీరోజు దాదాపు లక్ష మందికిపైగా ముంబై నుంచి స్వగ్రామాలకు తరలిపోతున్నారని తెలుస్తోంది. ఏటా వే సవి సెలవుల్లో రైళ్లలో ఆరు నుంచి ఏడు లక్షల మంది, ఆర్టీసీ బస్సుల్లో రెండు లక్షలకుపైగా, ప్రైవేటు వాహనాల్లో రెండు నుంచి రెండున్నర లక్షల మంది నగరం నుంచి బయటి ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలా ఎన్నికల సమయంలో ఓటర్లు నగరం నుంచి బయటపడడం రాజకీయ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటర్లపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల అంచనాలు తారుమారయ్యే ప్రమాదం ఏర్పడింది.