సాక్షి, ముంబై: వరుసగా వస్తున్న సెలవుల వల్ల అత్యధిక శాతం మంది ఓటర్లు పర్యాటక ప్రాంతాలు, స్వగ్రామాలకు వెళుతున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు, వారికి అండగా నిలిచిన రాజకీయ నాయకులకు దిగులు పట్టుకుంది. ఈ నెల 20న జరిగే పోలింగ్‌లో ఓటింగ్ శాతం తగ్గి ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉండటంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. స్వగ్రామాలకు వెళుతున్న ముంబైకర్లను అడ్డుకోలేక ఏమీ చేయలేని దీనస్థితిలో ఉన్నారు. ఈ సంఖ్య వందల్లో, వేలల్లో కాదు ఏకంగా 10 లక్షల వరకు ఉండే అవకాశముంది. ఇప్పటికే కొందరు ఓటర్లు వెళ్లిపోయారు కూడా.
రాష్ట్రంలో మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓ దశ పూర్తయింది. మిగిలిన రెండు దశల ఎన్నికలకు ప్రధాన పార్టీలతోపాటు చిన్నాచితక పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆదివారంతో పాటు వచ్చే ఆదివారం కూడా వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే వేసవి సెలవుల కారణంగా అనేకమంది స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు.
వారాంతాలలో మూడు రోజులు సెలవులు కలిసి రావడంతో వివిధ ప్యాకేజీలకు ఆకర్షితులైన ఉద్యోగులు కూడా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇప్పటికే కొందరు వెళ్లిపోయారు. దీనికితోడు పెళ్లిల సీజన్ కూడా మొదలైంది. సెలవులు కలిసిరావడంతో దీన్ని అదునుగా చేసుకున్న ఉద్యోగులు శుభ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో అభ్యర్థులు ఆందోళనకు చెందుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ చేపట్టే ప్రచార కార్యక్రమాలకు కూడా వెంటరావడానికి తగిన మందిమార్బలం దొరకడం లేదు. కాగా, ఈశాన్య రాష్ట్రాల దిశగా ప్రతీరోజు సుమారు 25 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ముంబై నుంచి బయలుదేరుతాయి.
ఉత్తర, దక్షిణ భారత దిశగా కూడా అనేక రైళ్లు వెళుతున్నాయి. వీటికి తోడు వేసవి ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతున్నారు. ఈ రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రతీరోజు దాదాపు లక్ష మందికిపైగా ముంబై నుంచి స్వగ్రామాలకు తరలిపోతున్నారని తెలుస్తోంది. ఏటా వే సవి సెలవుల్లో రైళ్లలో ఆరు నుంచి ఏడు లక్షల మంది, ఆర్టీసీ బస్సుల్లో రెండు లక్షలకుపైగా, ప్రైవేటు వాహనాల్లో రెండు నుంచి రెండున్నర లక్షల మంది నగరం నుంచి బయటి ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలా ఎన్నికల సమయంలో ఓటర్లు నగరం నుంచి బయటపడడం రాజకీయ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటర్లపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల అంచనాలు తారుమారయ్యే ప్రమాదం ఏర్పడింది.
‘వీకెండ్’ వణుకు
Published Mon, Apr 14 2014 10:18 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement