లెక్కలతో కుస్తీ
ఎన్నికలు ముగిశాయి.. ఇక ఫలితాలే తేలాల్సి ఉంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసే వరకు ఎంతో ఉత్కంఠను అనుభవించిన ఆయా పార్టీల అభ్యర్థులు, గురువారం పూర్తిగా లెక్కల్లో మునిగితేలారు. అభ్యర్థుల తరఫున ఎన్నికల్లో అన్నీతామై వ్యవహరించిన వారి ప్రతినిధులు సైతం విశ్లేషణలతో బిజీగా గడిపారు. ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం కల్లా ఏ అభ్యర్థి భవితవ్యం ఏమిటో తేలిపోనుంది. అప్పటి దాకా ఎవరికి ఇష్టమున్న రీతిలో అంచనాలు.. సమీకరణలు.. రకరకాల ఊహాగానాలతో వార్తలు షికారు చేయనున్నాయి..!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: మునుపెన్నడూ లేనంతగా 80.17శాతం ఓటింగ్ నమోదు కావడంతో పెరిగిన ఓట్లశాతం ఎవరిని ముంచనుంది, ఎవరిని తేల్చనుందన్న అంశానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ, బహుముఖ పోటీ నెలకొంది. పోరులో నిలబడిన పార్టీల సంఖ్యా పెరిగింది. ఫలితంగా వీరందరి మధ్యా ఓట్లు భారీగా చీలిపోవడానికి అవకాశం ఏర్పడింది. ఈసారి ఎన్నికల్లో మరో పరిణామం కూడా ఆసక్తికరంగా మారింది. నాలుగు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడ్డారు.
ఇన్ని కారణాల వల్ల విజయం ఎవరిని వరిస్తుందో తేల్చడం కొంత కష్టంగా మారగా, ఆయా పార్టీల అభ్యర్థులు, వారి అనుచరగణం మాత్రం తామెలా బయటపడతామో వివరిస్తూ లెక్కలతో కుస్తీలు పడుతున్నారు. గత ఎన్నికల నాటి ఓట్ల సంఖ్య, ఓటింగ్ శాతం క ంటే, ఈసారి ఓట్ల సంఖ్య, ఓటింగ్ శాతం పెరిగింది. గతం కంటే ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 5.75శాతం ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం పెరుగుదల అన్ని నియోజకవర్గాల్లో నమోదైంది. ఈ కారణంగానే పెరిగిన పోలింగ్ శాతం తమనంటే తమనే గట్టున పడేస్తుందన్న ధీమాను దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు.
ఉత్కంఠ రేపిన... హుజూర్‌నగర్
నాగార్జునసాగర్ ప్రధానంగా హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల పోలింగ్ సరళి తీవ్ర ఉత్కంఠ రేపింది. సాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పోటీలో ఉండడం, ఆయన ప్రత్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి సీపీఎం మాజీ నేత నోముల నర్సింహయ్య బరిలో ఉండడంతో మొదటి నుంచీ ఈ నియోజకవర్గం ఆసక్తి రేపుతూనే ఉంది. మరోవైపు హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీలో ఉండడం, ఆయన ప్రత్యర్థులుగా వైఎస్సార్‌కాంగ్రెస్ నుంచి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మలు బరిలో ఉండడంతో నామినేషన్ల ఘట్టం నుంచే ఈ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న ప్రచారం జోరందుకోవడం చర్చనీయాంశమైంది. ఈ రెండు చోట్లా టీడీపీకి పడాల్సిన ఓట్లు అసెంబ్లీ అభ్యర్థులకు క్రాస్ అయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక వైపు టీడీపీ ఎంపీ అభ్యర్థికి, మరోవైపు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి పోటీదారులకు టీడీపీ ఓటు క్రాస్ అయ్యిందన్న విశ్లేషణలూ బయటకు వ చ్చాయి. ఈ పరిస్థితి నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా ఎవరికి వారు గెలుపుపై ధీమాతోనే ఉన్నారు. కాగా, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు తమకు ఎన్ని ఓట్లు పోల్ అయి ఉంటాయి..? ఎంత మెజారిటీతో బయటపడే అవకాశం ఉంది..? అన్న సమీకరణాలపై లెక్కలతో కుస్తీలు పడుతున్నారు. గురువారం జిల్లాలో ఇదే పెద్దచర్చగా మారింది. నియోజకవర్గంలోని మండలాలు.., ఆ మండలాల పరిధిలోని గ్రామాలు.., ఆ గ్రామాల్లో ఎవరికి ఎంత పట్టుంది..? పోలైన ఓట్లెన్ని..? అందులో తమకు పడే ఓట్లెన్ని..? అన్నీ కలిపితే, తమకు మొత్తంగా పడే ఓట్లు ఎన్ని, ప్య్రతర్థులకు ఎన్ని పోలై ఉంటాయి..? వీటిని తీసేస్తే, తమకు వచ్చే మెజారిటీ ఎంత అని.. ఇలా లెక్కల్లో మునిగి తేలారు. తమకు పట్టున్న గ్రామాల్లో ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందో ముందు నుంచే ఓ అంచనాతో ఉన్న అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగానే ఉన్నారు. కాగా, సెలైంట్ ఓటింగ్ నడవడం, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య పార్టీల మధ్య భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఎవరు మునుగుతారో, ఎవరు తేలుతారో అర్థం కాక అయోమయానికి గురవుతున్న వారూ ఉన్నారు. ఈనెల 16వ తేదీన ఫలితాలు వెలువడే దాకా ఫలితాల అంచనాల చర్చకు ఫుల్‌స్టాప్ పడేలా లేదని పలువురు వ్యాఖ్యానించారు.