సాక్షి, సంగారెడ్డి: నచ్చిన అభ్యర్థికి ఓటేయడమే కాదు..బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ‘నోటా’ మీటను నొక్కి అందరినీ తిరస్కరించే హక్కు ఈ సారి ఓటర్లకు సంక్రమించనుంది. ఇదొక్కటే కాదు..తమ ఓటు సరిగ్గా నమోదైందా లేదా తెలుసుకునేలా ప్రతి ఓటరు చేతికీ ఓ రసీదు సైతం అందనుంది. నోటా(నన్ ఆఫ్ దీ ఎబవ్), వీవీ పాట్(ఓటర్ వెరిఫైయబుల్ ప్రింట్ ఆడిట్ ట్రయల్) పేర్లతో ఈ సార్వత్రిక ఎన్నికల ద్వారా ఓటర్లకు పరిచయమవుతున్న ఈ రెండు కొత్త వెసుబాట్లపై ఎంత మంది అవగాహన కలిగి ఉంటారు?... ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టడం కష్టమే.
ఎందుకంటే..ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం) బ్యాలెట్ యూనిట్‌పై ఉండే ఏదో ఒక మీటను నొక్కి నచ్చిన అభ్యర్థికి ఓటేయడమే ఇప్పటి వరకు ఓటర్లకు తెలుసు. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలతో తొలిసారిగా అమలవుతున్న తిరస్కరణ ఓటు, ఓటు రసీదుపై ఓటర్లకు విస్తృతంగా ప్రచారం కల్పించడానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామ, మండల స్థాయి సంగతి ఏమో కానీ..కనీసం జిల్లా కేంద్రంలో సైతం ఓటర్లకు అవగాహన కల్పించిన దాఖలాల్లేవు. ప్రధానంగా పల్లె ఓటర్లకు అవగాహన కల్పించకపోతే పోలింగ్ రోజు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
ఓటు రసీదు..ఇస్తారో లేదో..
జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,407 పోలింగ్ బూత్‌లుంటే..6,700 బ్యాలెట్ యూనిట్లు, 6,500 కంట్రోల్ యూనిట్లను కేటాయించారు. ఇప్పటివరకు 5,500 బ్యాలెట్ యూనిట్లు, 5,500 కంట్రోల్ యూనిట్‌లు జిల్లాకు చేరాయి. ప్రతి ఈవీఎంలో బ్యాలెట్, కంట్రో ల్ యూనిట్ల పేరుతో రెండు విడి భాగాలుంటాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన ఈ సరికొత్త ఈవీఎంల పనితీరును బీహెచ్‌ఈఎల్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు గత రెండు వారాలుగా పరిశీలించి చూస్తున్నారు. వీటిపై ఉండే ‘నోటా’ మీటను నొక్కి అభ్యర్థులందరినీ తిరస్కరించే వెసులుబాటు ఓటర్లకు ఈ కొత్త యంత్రాలు కల్పించనున్నాయి.
అదే విధంగా ఓటేసిన తర్వాత చేతికి రసీదును సైతం అందించాల్సి ఉంటుంది. ఏ అభ్యర్థికి ఓటేశారో ఈ రసీదులో ఉండనుంది. జిల్లా ఓటర్లకు మాత్రం ఈ ఎన్నికల్లో ‘వీవీ పాట్’ను పరిచయం చేయడం లేదని..దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం జిల్లాకు చేరలేదని ఓ అధికారి తెలిపారు.
‘మాక్’ తెల్వదే !
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై గతంలో పలు రాజకీయ పక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి.
ఈవీఎంలను టాంపర్ చేసి ఫలితాలను తారుమారు చేయవచ్చని నిపుణులు రుజువు చేసి చూపించారు కూడా. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో వినియోగించనున్న ఈవీఎంల పనితీరుపై అఖిలపక్ష పార్టీలకు అవగాహన కల్పించడానికి ఎన్నికల యంత్రాంగం మాక్ పోలింగ్ నిర్వహించి అంతా సరిగ్గానే ఉందని చూపించాల్సి ఉంటుంది. ఈ మాక్ పోలింగ్ తతంగం ఎప్పుడో పూర్తైదని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో), ఈవీఎంల నోడల్ అధికారి దయానంద్ ‘సాక్షి’కి తెలిపారు.
అఖిలపక్ష పార్టీల నేతలను సైతం ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నప్పటికీ.. ఈ విషయాన్ని అఖిల పక్ష పార్టీలన్నీ ఖండిస్తున్నాయి. మాక్‌పోలింగ్ జరిపినట్లు తమకు సమాచారమే లేదని బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల జిల్లా అధ్యక్షులు ఆర్. సత్యనారాయణ, కాసాల బుచ్చిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
ఈవీ‘ఏం చేస్తాయో’!
Published Thu, Mar 27 2014 12:17 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement