
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ విషయంలో అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జరుగుతోంది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 30,518 పోలింగ్ కేంద్రాలున్నాయి.
తాజాగా దాదాపు 1,686 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా వచ్చే సాధారణ ఎన్నికలకు 32,204 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఓ పోలింగ్ బూత్ ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 1,200 ఉండనుంది. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 1,500 మందికి ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
85 వేల ఈవీఎంలు: సాధారణ ఎన్నికలకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సేకరణను రాష్ట్ర ఎన్నికల కార్యాలయం చేపడుతోంది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే 85 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. షెడ్యూ ల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 4న ఓటర్ల తుది జాబితా సిద్ధం కానుంది.