పాల్వంచరూరల్: ప్రస్తుతం శాసనసభ ముందస్తు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్‌ను నిర్వహించనున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందకు జరిగే ఈ ప్రక్రియలో ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే..వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఎన్నికల నిబంధనలకు లోబడే అంతా నడుచుకోవాల్సి ఉంటుంది. నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు కఠినంగా వ్యవహరిస్తారు. ఎవరు అతిక్రమించినా చట్టం తనపని తాను చేస్తుంది. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువగా కేసులు నమోదు చేస్తుంటారు. 67 సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన (రిప్రజంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్) 1951 ప్రకారం చట్టంలో అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ ఎక్కువగా ఎన్నికల సమయంలో కొన్నింటిని అతిక్రమించిన పార్టీలు, వ్యక్తులపైన ప్రయోగిస్తుంటారు. ఆ శిక్షలేంటో తెలుసుకుందాం.
రెచ్చగొడితే జైలుకే..
మతం, జాతి, కులం, సంఘం లేదా భాషా ప్రాతిపాదికపై వర్గాల, పౌరుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టినా, çశత్రుత్వాన్ని పెంపొందించినా నేరమే. 123 ఆర్‌పీ యాక్ట్ ప్రకారం అందుకు శిక్ష పడుతుంది. 125 ఆర్‌పీ యాక్ట్ మేరకు ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే..మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. అలాగే..తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలుకు అర్హులు. ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగంగా సభలు నిర్వహించినా శిక్ష అర్హులే. అందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 127 ఆర్‌పీ యాక్ట్ ప్రకారం..ఎన్నికల సమావేశం సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరిపినా యూఎస్ 42 సీఆర్‌పీసీ ప్రకారం ఆ వ్యక్తులను అరెస్ట్ చేయొచ్చు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండువేల జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు.
పోస్టర్‌పై పేరు ఉండాల్సిందే..
ఎవరైనా తన పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు ముద్రిస్తే ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. లేదా రెండు వేల రూపాయల జరి మానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 128 ఆర్‌పీ యాక్ట్ ప్ర కారం..బహిరంగంగా ఓటేస్తే 3 నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలుకు అవకాశం. 29 ఆర్‌పీ యాక్ట్ ఎన్నికలకు సంబంధించిన అధికారులు లేదా పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించినా లేదా ప్రభావం కలిగించినా శిక్షార్హులు. అందుకు మూడు నెలల జైలు లేదా జరిమానా పడుతుంది. 130 ఆర్‌పీ యాక్ట్ ప్రకారం..పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయకూడదు. ఒక వేళ ప్రచారం చేస్తే రూ.250 జరిమానా విధిస్తారు.
పోలింగ్ రోజు జరభద్రం..
పోలింగ్ స్టేషన్‌కు దగ్గరలో నియమాలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేసినా ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా పడుతుంది. పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు అక్రమంగా వాహనాలు సమకూర్చడం కూడా నేరమే. ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే శిక్షార్హులే. అందుకు రూ.500 వరకు జరిమానా. 134అ ఆర్‌పీ యాక్ట్ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంట్‌గా గానీ, పోలింగ్ ఏజెంట్‌గా గానీ లేదా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్‌గా వ్యవహరించినా శిక్షకు అర్హులు. అందుకు మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. పోలింగ్ స్టేషన్ పరిసరాలకు మారణాయుధాలు కలిగి వెల్లడం నిషేధం. ఈవీఎం అపహరిస్తే..శిక్ష పడుతుంది. సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ అమలు చేయొ చ్చు. పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు మద్యం అమ్మడం, అందించడం నేరం. అందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment