సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న వేళ ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) రజత్ కుమార్ పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎన్నికల ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలిస్తున్నారు. సోమవారం ఎన్నికల ఏర్పాట్లు, విదివిధానాలపై మీడియా సమావేశంలో చర్చించారు. జిల్లాలలోని ఎన్నికల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లను తేలికగా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు పద్దతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, గిరిజన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తానని తెలిపారు.
రోహ్యింగాల ఓట్లు తొలగించాం
పరకాల ఉప ఎన్నికల నుంచి బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల ఫోటోలు పెట్టే పద్దతిని ప్రవేశ పెట్టామని గుర్తుచేశారు. రాజకీయ నాయకులకు హెలిప్యాడ్ ఏర్పాట్లతో సీఈఓకు సంబంధంలేదని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఒక ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా కారణాల దృష్ట్యా పోలింగ్ కేంద్రాలు పెంచడం లేదన్నారు. 179 మంది రోహ్యింగాల ఓట్లు తొలిగించామన్నారు. హైదరాబాద్‌తో సహా కొన్ని ఎంపికచేసిన ప్రాంతాలలో అభ్యర్ధుల పేర్లు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటాయని, మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగులో మాత్రమే అభ్యర్థుల పేర్లు ఉంటాయని తెలిపారు..
అలవెన్స్‌లు పెంచాలని కేంద్రాన్ని కోరాం
రాష్ట్ర ఎన్నికల సిబ్బందికి అలవెన్స్ పెంపు తమ పరిధిలోనే ఉంటుందని, కేంద్ర ఉద్యోగులకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా అలవెన్స్ చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల అలవెన్స్‌కు సంబంధించి ఆర్థిక శాఖకు నివేదిక పంపిచామన్నారు. ఇద్దరు అదనపు ఎన్నికల అధికారుల నియమకాలపై కేంద్రం ఇంకా ఏమి చెప్పలేదన్నారు. ఎన్నికల బందోబస్త్‌కు ఏపీ పోలీసుల సహాయం కోరడంలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment