సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు శుక్రవారం జరగనున్న తొలి సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ సాగేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్ కుమార్ నేతృత్వంలో పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. సీసీటీవీలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది.
మల్కాజిగిరిలో 42 మంది.. బాన్సువాడలో ఆరుగురే
ఈ ఎన్నికల్లో 1,39,05,811 మంది మహిళా ఓటర్లు, 1,41,56,182 మంది పురుష ఓటర్లు, 2,691 మంది ఇతర ఓటర్లు కలిపి మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర శాసనసభ పరిధిలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడు స్థానాలు సహా మొత్తం 119 నియోజకవర్గాల పరిధిలో 1,681 మంది పురుష, 139 మంది మహిళలు కలిపి మొత్తం 1,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి 119, కాంగ్రెస్ నుంచి 99, బీజేపీ నుంచి 118, సీపీఐ నుంచి 03, ఎన్‌సీపీ నుంచి 22, బీఎస్పీ నుంచి 107, టీడీసీ నుంచి 13, ఎంఐఎం నుంచి 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారికి అదనంగా రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల నుంచి 631 మంది, 674 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 25 స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండగా మిగిలిన చోట్లలో ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్, విపక్షాల ప్రజాకూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి అతితక్కువగా ఆరుగురు మాత్రం బరిలో నిలిచారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత 13 శాసనసభ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈసీ పోలింగ్ నిర్వహించనుంది.
55,329 ఈవీఎంలు సిద్ధం...
పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 55,329 ఈవీఎంలు, 39,763 కంట్రోల్ యూనిట్లు, 42,751 వీవీప్యాట్లను ఏర్పాటు చేసింది. 1,50,023 మంది పోలింగ్ అధికారులను నియమించింది. దీంతోపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించింది. 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 18,860 మంది పొరుగు రాష్ట్రాల పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. 32,574 పాత పోలింగ్ కేంద్రాలు, 241 అనుబంధ పోలింగ్ కేంద్రాలు కలిపి మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 3,478 పోలింగ్ కేంద్రాల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించనుంది. మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ట్యాబ్స్, ల్యాప్‌టాప్‌లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. రికార్డు చేసిన డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగించనున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి ఓటేసేందుకు లైనులో నిలబడి ఉండే ఓటర్లందరికీ ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే లైన్లలో నిలబడి ఉండే వ్యక్తులకు పోలింగ్ అధికారులు టోకెన్లు ఇవ్వనున్నారు. పోలింగ్ సమయం ముగిశాక పోలింగ్ కేంద్రానికి చేరుకునే వ్యక్తులకు ఓటేసేందుకు అవకాశముండదు. ఈ నెల 11న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనుండగా మొత్తం ఎన్నికల ప్రక్రియ 13వ తేదీతో ముగియనుంది.
పటిష్ట బందోబస్తు, నిఘా ఏర్పాట్లు...
పోలింగ్ రోజు ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకలను పంపిణీ చేసి ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్రంలో 446 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 448 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, 126 సహాయ వ్యయ పరిశీలకులు, 224 వీడియో నిఘా బృందాలు, 133 వీడియో పరిశీలక బృందాలు, 123 అకౌంటింగ్ బృందాలు నిరంతరం పని చేయనున్నా యి. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన 68 మం ది సాధారణ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు.
దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు
శాసనసభ ఎన్నికల్లో 4,57,809 మంది దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు హక్కు విని యోగించుకునేలా ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 60,012 మంది అంధ ఓటర్ల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో ఓట రు గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పులను జారీ చేసింది. 2,52,790 మంది ఇతర వికలాంగుల ను ఇళ్ల నుంచి పోలింగ్ కేంద్రాలను తరలించడానికి ఆటోలను వినియోగిస్తోంది. పోలింగ్ కేం ద్రాల వద్ద ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచడంతోపాటు పోలింగ్ కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద ర్యాంపులను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment