సాక్షి, హైదరాబాద్: కుల, మత, వర్గాలవారీగా ఎన్నికల ప్రచార సమావేశాలు నిర్వహించి ఓట్లను అడిగి గెలిచినా పదవి కోల్పోయే ప్రమాదముందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్ హెచ్చరించారు. కుల, మత, వర్గాల వారీగా ఓట్లను అభ్యర్థించడం ప్రజాప్రాతినిధ్యం చట్టం కింద నేర మని స్పష్టం చేశారు. ఇలా చేస్తే 1995లో సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును ఉల్లంఘించినట్లే అన్నా రు. ఫలితాల ప్రకటన తర్వాత 45 రోజుల వ్యవధిలో ఎవరైనా కోర్టులో పిటిషన్ వేసి కుల, మత, వర్గాల పేరుతో ఓట్లను అడిగినట్లు రుజువు చేస్తే గెలిచిన అభ్యర్థి పదవి కోల్పోయే అవకాశముందన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ కెమెరాతో వీడియో తీసి సాక్ష్యం గా కోర్టులో సమర్పించవచ్చన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కుల, మతాల పేరుతో సమావేశాలు నిర్వహించి ఓట్లను అభ్యర్థించారని పలువురు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలపై ఫిర్యా దులొస్తే సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశామన్నారు. వివరణ సంతృప్తికరంగా లేకుంటే తదుç ³రి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు. కుల, మతాలవారీగా ఓట్లను అభ్యర్థించరాదని హెచ్చరిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు అడ్వైజరీ జారీ చేశామన్నారు. ఇలాంటి ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సైతం ఆదేశాలు ఇచ్చామన్నారు. ఫలానాసామాజిక వర్గానికి ఇది చేస్తామని మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించవచ్చని అన్నారు.
ఉల్లంఘిస్తే పదవికే ప్రమాదం
ఎన్నికల వ్యయ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే ఎన్నికల్లో గెలిచినా పదవిలో కొనసాగకుండా నిలుపుదల చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. గత ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించని 48 మంది స్వతం త్ర అభ్యర్థులను మళ్లీ పోటీ చేయకుండా నిషేధించామన్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలనకు ప్రతి రెండు, మూడు నియోజకవర్గాలకు ఒకరు చొప్పున వ్యయ పరిశీలకులు, ప్రతి నియోజకవర్గానికి సహాయక వ్యయ పరిశీలకులు, వీడియో నిఘా, వీడియో వీక్షణ, అకౌంటింగ్ బృందాలను నియమించామన్నారు.
అభ్యర్థి రోజుకు గరిష్టంగా రూ.10 వేలను మాత్రమే నగదు రూపంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని, అంతకు మించి ఖర్చు చేయాల్సి వస్తే చెక్కుల రూపంలో చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు గిఫ్టులు పంపిణీ చేస్తే అభ్యర్థులతోపాటు సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. ట్వీట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో ఎన్నికల ప్రచార సరళిని పసిగట్టేందుకు ‘ఆబ్జెక్ట్ వన్’అనే కన్సల్టెన్సీ సేవలను వినియోగిస్తున్నామని, మంచి ఫలితాలొస్తున్నాయన్నారు. పేదల వైద్య సహాయం కోసం సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల్ని ఆస్పత్రులకు పంపించేందుకు అనుమతించామన్నారు.
అధికారులపై ఈసీ నిర్ణయం
సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ఎం.హన్మంతరావుపై విపక్షాల చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని రజత్‌కుమార్ చెప్పారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలు, రాజకీయ పార్టీల విశ్వసనీయతను కాపాడటానికి అవసరమైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా తాత్కాలిక లేదా శాశ్వత నిషేధం విధిస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా అధికారులతో సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్ సర్వేలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని, ఈ విషయంలో ఆమె వివరణ కోరుతామన్నారు. ఇంటె ల్ కంపెనీతో జరిగిన ఓ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో కలసి పాల్గొన్న ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌కు సైతం నోటీసులు ఇస్తున్నామన్నా రు. తెలంగాణ ఉద్యమకారులపై రైల్వే కోర్టుల్లో ఉన్న కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసి ఆ వెంటనే నిలుపుదల చేయడంపై సీఈవో స్పందించారు. టీడీపీ నేతలను దూషిస్తూ మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర టీఆర్‌ఎస్ నేతలపై ఫిర్యాదు అందడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శికి సంజాయిషీ నోటీసులు జారీ చేశామన్నారు.
19న రెండో అనుబంధం
రాష్ట్రంలో తాజాగా ఓటర్ల సంఖ్య 2,77,28,226కు పెరిగిందని రజత్ కుమార్ చెప్పారు. 19న ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని ప్రచురిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో పునరావృతమైన 1.16లక్షల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం లేదన్నారు. అయితే, అదనంగా చేరిన పేర్లను అబ్సెంటీ షిఫ్టెడ్ డిలీటెడ్(ఏఎస్‌డీ) జాబితాలో చేర్చి సదరు ఓటర్లు ఒకేసారి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ఆదేశించామన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులతో పాటు పోలింగ్ రోజు సిబ్బందికి భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీకే సైకిల్ గుర్తును కేటాయిస్తామని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీకి ఇతర గుర్తుల్లో ఏదో ఒకటి ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment