సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల్లో ధనప్రవాహం పెరుగుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో రూ.76 కోట్లు సీజ్ చేయగా, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే రూ.112 కోట్లు పట్టుబడ్డాయి. డబ్బు ప్రవాహాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నా ఆగడంలేదు, ప్రజల్లో మార్పు వస్తేనే అడ్డుకట్ట సాధ్యమవుతుంది’అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ అన్నారు. ‘ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు శ్రమిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియను పక్కాగా నిర్వహించడంతోపాటు ప్రచారక్రమంలో రాజకీయపార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాం. సీ–విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను క్షణాల్లో పరిష్కరిస్తున్నాం. ఇప్పటివరకు 6,858 కేసులు నమోదుకాగా 4,967 కేసులు పరిష్కరించాం’అని వివరించారు. సోమవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. మీడియాసభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు ముందస్తుగా రావడంతో ఏర్పాట్లు వేగవంతంగా చేస్తున్నామని, సాధారణంగా ఎన్నికల ఏర్పాట్లు ఏడాది ముందు నుంచే మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు.
మేనిఫెస్టోలపై డిక్లరేషన్ తీసుకున్నాం...
ఓటర్లజాబితా, ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం జోడించి ఎన్నికల ఏర్పాట్లు వంటివి చేపట్టినట్లు రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు విపరీతంగా పెరుగుతోందని, అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీల ఖర్చుపై పరిమితి లేదన్నారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలపై అఫిడవిట్ కోరామని, డిక్లరేషన్ సైతం తీసుకున్నామని చెప్పారు. మేనిఫెస్టోలోని హామీల అమలుపై చాలెంజ్ చేయొచ్చన్నారు. ఓటరు జాబితాలో 4.32 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, 3.8 లక్షల ఓటర్లు చనిపోవడంతో వారి ఓట్లను తొలగించామని ఆయన తెలిపారు. అసెంబ్లీ రద్దు తరువాత ఆర్నెళ్లలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, దీంతో పార్టీలు, అభ్యర్థుల అఫిడవిట్లు తదితర అంశాలపై ఎన్నికల కమిషన్ లోతైన విశ్లేషణ చేసే అవకాశం ఉండదన్నారు. ఎన్నికలు, ఫలితాలపై ఇప్పట్నుంచే బెట్టింగ్ జరుగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ అంశం ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదని, పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో 38 అసెంబ్లీ నియోజకవర్గాలు సున్నితమైనవిగా గుర్తించామని, కొడంగల్‌లో శాంతిభద్రతలను కాపాడాలని పోలీసులను ఆదేశించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,306 కేసులను పెయిడ్ న్యూస్ కింద బుక్ చేశామని, విచారణలో నిజమని తేలితే ఆ ఖర్చును అభ్యర్థుల ఖాతాలో వేస్తామన్నారు.
ఎన్నికల సంఘం ఎవరిపక్షం కాదు...
ఎన్నికల సంఘం ఎవరిపక్షం కాదని, తటస్థంగా వ్యవహరిస్తుందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఈవీఎంలతోపాటు కొత్తగా వీవీ ప్యాట్‌లను అందుబాటులోకి తెచ్చామని, ఓటు ఎవరికి వేశామనేది వీవీప్యాట్‌లో స్పష్టమవుతుందని, ఎవరైనా చాలెంజ్ చేసినప్పుడు దీని ఆధారంగా నిర్ధారిస్తామన్నారు. ప్రచారపర్వంలో నిబంధనల ఉల్లంఘనలు తదితర అంశాలపై సి విజిల్ ద్వారా నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో 2.80 కోట్ల మంది ఓటర్లున్నారని, ఇందులో 1.41 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, 2,691 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 5.70 లక్షలు, అతి తక్కువగా భద్రాద్రి నియోజకవర్గంలో 1.37 లక్షల ఓట్లు ఉన్నాయన్నారు. భద్రాద్రిలోని పలు గ్రామాలు ఏపీలో విలీనం కావడంతో ఓట్లు తగ్గినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో 4.57 లక్షల మంది దివ్యాంగులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారని, వారి కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, అధికంగా మల్కాజ్‌గిరిలో 42 మంది, తక్కువగా బాన్సువాడలో ఆరుగురు పోటీలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 32,700 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈసారి 36.5 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఏడోతేదీ సాయంత్రం 5.30 గంటల తర్వాత విడుదల చేయొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment