ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. అభ్యర్థుల వెంటే నీడలా దృష్టి సారించింది. ఈసారి కట్టుదిట్టంగా నిబంధనలు అమలు చేస్తోంది. ప్రచార ఖర్చుపై ఎప్పటికప్పుడు పక్కాగా లెక్కలు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించింది. లెక్కలు చూపని డబ్బులు స్వాధీనం చేసుకొని, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఏం మాట్లాడుతున్నారో సునిశితంగా వీడియో సైతం తీస్తున్నారు. దీంతో అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ ఏం మాట్లాడితే .. ఏం ముంచుకొస్తుందోనని, దేనికి ఎంత ఖర్చు చేస్తే నోటీసులు అందుకోవాల్సి వస్తుందోనన్న జంకు వారిని వెంటాడుతోంది.
జోగిపేట(అందోల్): వెంటే ఉంటున్నారు...ఎప్పటికప్పుడు డేగ కళ్లుతో కనిపెడుతున్నారు. సభలు నిర్వహించినా, ర్యాలీల్లో పాల్గొన్నా..వెంబడిస్తున్నారు. వీడియో తీసుకుంటూ లెక్క పక్కాగా ఉండేలా చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ప్రత్యేకించి బృందాలను ఏర్పాటు చేసి అన్ని వివరాలను తెలుసుకొంటోంది. వీరిని గమనిస్తున్న అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా నోటీసులు అందుతాయని జవాబు చెప్పాల్సి ఉంటుందని ముందస్తుగా జాగ్రత్త వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికల్లో చాలా కట్టుదిట్టంగా నిబంధనలు అమలు చేస్తోంది. ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది.
ఇప్పటికే ప్లయింగ్ స్క్వాడ్‌లు, ఎస్‌ఎస్‌టీలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. లెక్కలు చూపని డబ్బులు స్వాధీనం చేసుకొని ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై కేసులు పెడుతున్నాయి. తాజాగా అభ్యర్థుల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. వారు సమావేశాలు ఏర్పాటు చేసిన వెంటనే ఇద్దరు వీడియో గ్రాఫర్లను తీసుకువెళ్లి చిత్రీకరిస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ర సమితి అధినేత కేసీఆర్ సభలను పరిశీలించి వీడియో తీసాయి.
ప్రతీది లెక్కింపు..
సభా వేధికపై ఎందరు కూర్చుంటారు. కుర్చీలు ఎన్ని తెప్పిస్తున్నారు. హజరయ్యే వారి సంఖ్య ఎంత..ఇలా అన్ని వివరాలను ఎన్నికల అధికారులకు చెప్పి అనుమతి తీసుకోవాలి. ఇదంతా సరిగ్గానే జరుగుతుందా అని పరిశీలించేందుకు ప్రత్యేక స్క్వాడ్‌లు రంగంలోకి దిగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని వీడియోలో చిత్రీకరించి రిటర్నింగ్ అధికారులకు సమర్పిస్తున్నాయి. అధికారులు వీడియో చూసి అభ్యర్థి చెప్పిన లెక్కతో సరిపోతుందా లేదా అని తనిఖీ చేస్తున్నారు. లేదంటే నోటీసులు అందిస్తున్నారు.
పెద్ద సభకు ఉన్నతాధికారులు
చిన్న సభలకు జూనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారి వీడియో గ్రాఫర్‌తో వెళ్తున్నారు. భారీ బహిరంగసభలైతే జిల్లా నోడల్ అధికారి, అసిస్టెంట్ వ్యయ పరిశీలకుడు కలిసి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. సరిపోకపోతే ఫ్లయింగ్ స్క్వాడ్‌లు బృందాలుగా తిరుగుతున్నాయి.
నిఘా బృందాలు ఏం చేస్తాయి?
సభలు, సమావేశాలకు వెళ్లి పరిసరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఖర్చు లెక్కగడతాయి. కుర్చీలు, జనం, వేధిక, టోపీలు, జెండాల సంఖ్యను వీడియో తీసి తర్వాత లెక్కించి సరిచూసుకుంటాయి. ర్యాలీల్లోనూ వెంటే ఉంటాయి. ఉల్లంఘన అని రుజువైతే అభ్యర్థులకు నోటీసులు అందిస్తాయి.
ఉల్లంఘనల పరిశీలన..
ఖర్చులు లెక్కించేది అకౌంట్ టీం. ఖర్చులే కాకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పరిశీలించేందుకు మరో విభాగం ఉంటుంది. ప్రత్యర్థులపై అభ్యంతరకరంగా విమర్శలు చేసినా అది ఉల్లంఘనే అవుతుంది. అందుకే అభ్యర్థులు ఏం మాట్లాడుతున్నారో వీడియో తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment