బలమైన, వ్యూహాత్మకంగా అడుగేసే ప్రతిపక్ష కూటమి బీజేపీని ప్రకంపింప చేస్తుందని, చివరకు ఓడించగలుగుతుందని కూడా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైతును నిర్లక్ష్యం చేస్తే, మీ పతనం తప్పదు. దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంలో చిక్కుకున్న రైతులు తమ సమస్యలను ఏదోమేరకు గుర్తించి, పరిష్కరించిన చోట ప్రభుత్వాలను అందలమెక్కిస్తున్నారు. దీనికి అసలు సిసలు ఉదాహరణ తెలంగాణ. రైతులకు నగదు నేరుగా బదలాయించి ఈ ఎన్నికల్లో వారి మద్దతును కేసీఆర్ ప్రభుత్వం గణనీయంగా సాధించింది.
మూడు హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తర్వాత వచ్చే కొద్ది నెలల్లో రాజకీయ పరిదృశ్యానికి సంబంధించిన రూపురేఖలు పదునెక్కనున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఆరునెలల్లోపే జరుగనుండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ సరళి నుంచి పాలక బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది.
రానున్న కొద్దిరోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర వివరాలతో చర్చలు జరుగుతాయి. విశ్లేషణలు జరుగుతాయి. కానీ ఈ ఎన్నికలు ప్రధానంగా మూడు ముఖ్యమైన విషయాలను రంగంమీదికి తీసుకొచ్చినట్లు స్పష్టమైపోయింది. అవేమిటంటే, గ్రామీణభారతంలో అశాంతి అనేది వాస్తవం. ఓటింగుపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. రెండోది, మతపరమైన విభజన లేదా సమీకరణ అనేది విశ్వాసాలను పటిష్టం చేస్తుందేమో కానీ అది భారీ ఎత్తున ఓట్లను సంపాదించలేదు. ఇక మూడో అంశం.. బలమైన, వ్యూహాత్మకమైన ప్రతి పక్ష కూటమి బీజేíపీని కదిలించివేస్తుంది, ఓడిస్తుంది కూడా.
రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యత
దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. తమ సమస్యలను ఏదోమేరకు గుర్తించి, పరిష్కరించిన చోట వారు ప్రభుత్వాలను అందలమెక్కిస్తున్నారు. దీనికి అసలు సిసలు ఉదాహరణ తెలంగాణ. పాలకపార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి రైతులకు నగదు నేరుగా బదలాయించి ఈ ఎన్నికల్లో వారి మద్దతును గణనీయంగా కొల్లగొట్టింది. తెలంగాణ భావనపట్ల గతంలో ప్రజల్లో ఉన్న తీవ్రమైన అత్యుత్సాహం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అలాగే 2014 ఎన్నికల్లోలాగా ఉప జాతీ యవాదం కూడా ఇప్పుడు అంత బలంగా లేదు. సమస్యల ప్రాతిపదికన స్పందించే చైతన్యం తెలంగాణ ఓటర్లలో పెరిగిందనడానికి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు స్పష్టంగా రుజువు చేశాయి.
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ 2017 జూన్‌లో ఆ రాష్ట్రంలో మండసార్‌లో రైతులపై కాల్పులు జరగడం ఆయన పాలనకు మచ్చగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన వ్యక్తిగత ప్రజాదరణ కొనసాగింది. కానీ గ్రామీణ ఓటర్లలో కొన్ని విభాగాల మద్దతును ఆయన తప్పకుండా పొంది ఉండాల్సింది.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైతును నిర్లక్ష్యం చేస్తే, మీ పతనం తప్పదు. ఈ గుణపాఠంతో రానున్న నెలల్లో రైతులను మరిన్ని ప్రలోభాలకు గురిచేస్తారని ఊహించవచ్చు కానీ ఇది వాస్తవ పరిస్థితిలో మార్పును తీసుకొస్తుందా అనేది చూడాల్సి ఉంది.
విద్వేష రాజకీయాలకు భంగపాటు
చిత్రవధ చేసి చంపడం కరడు గట్టిన హిందుత్వ వాదులను సంతోషపెట్టవచ్చునేమో కానీ, ప్రభుత్వాలపై ఓటరు తీవ్ర ఆగ్రహాన్ని అది ఏమాత్రం మార్చలేదు. రాజస్తాన్‌లో ఇది స్పష్టంగా కనబడింది. ఈ రాష్ట్రం లోని నియోజకవర్గాల్లోని పలు విభాగాల ప్రజలను వసుంధర రాజే పరాయీకరణ పాలు చేశారు. అందుకే ఓటర్లు ఆమెకు తగిన గుణపాఠం నేర్పారు. ఇక యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ విద్వేష ప్రచారం వ్యతిరేక ఫలితాలనే తీసుకువస్తోంది. హైదరాబాద్ పేరు మార్చేస్తానని, నిజాంని పారదోలినట్లే మజ్లిస్ పార్టీ నేతలను రాష్ట్రం నుంచి తరిమేస్తామని యోగి చేసిన వాగ్దానాలను తెలంగాణ ఓటర్లు అసలు పట్టించుకోలేదంటే సందేహపడాల్సిన పనిలేదు. పైగా నిజాం తెలంగాణ నుంచి పారిపోయాడని చెప్పడమే ఒక చారిత్రక అసత్యం. ఇలాంటి విద్వేష ప్రచారాలను తిప్పికొట్టడంలో భాగంగానే కావచ్చు. బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కి మహామహులు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌ను ప్రచారానికి ఎక్కడికి పంపాలి అనే విషయంపై బీజేపీ మళ్లీ ఆలోచించుకోవాల్సి ఉంది.
పరాజయం నేర్పుతున్న గుణపాఠాలు
ఈ పరిణామాలను ప్రతిపక్షాలు తప్పక పరిగణనలోకి తీసుకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ తమ వ్యూహాలను, ఎత్తుగడలను తప్పకుండా మార్చుకోవలసి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు ఢిల్లీలో ప్రతిపక్షాలు తమ ఐక్యతను ప్రదర్శించాయి. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌తో సహా దాదాపు ప్రతిపక్ష నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు కానీ అఖిలేష్ యాదవ్, మాయావతి గైర్హాజర్ కావడం ద్వారా తమ భవిష్యత్ పయనాన్ని సూచించారు.
ఉదాహరణకు మాయావతి ఎక్కడికి వెళతారు? ఆమె మధ్యప్రదేశ్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం పేలవంగా కనబడుతోంది. పైగా వారు ఐక్యంగా ఉంటే మరిన్ని సీట్లను గెలిచి ఉండేవారు. కానీ తన సొంత బలాన్ని పరీక్షించుకోవాలని భావించి ఉండవచ్చు లేదా ఏవైనా ఒత్తిళ్లకు గురయి ఉండవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆమె సమాజ్‌వాదీ పార్టీతో చేతులు కలపవచ్చు, లేదా కాంగ్రెస్‌తోనూ చేతులు కలపవచ్చు. ఇప్పటికే సంకీర్ణంలో ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్‌తో ఇలాంటి ఐక్యత సాధ్యపడితే ఉత్తర భారతదేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రంలో బీజేపీ మరింత నిస్సహాయ స్థితిలో కూరుకుపోక తప్పదు.
బుజ్జగింపులు, ప్రలోభాలు తప్పవా?
ఇక మమతా బెనర్జీ కూడా ప్రతిపక్ష మహాకూటమితో పొత్తు కుదుర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువరిస్తున్నారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఫ్రంట్‌లో ప్రముఖపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మమత తన స్థానాన్ని వదిలేసుకుంటారా? ఇక శరద్ పవార్ ఇప్పటికే మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో లాంఛనప్రాయమైన ఒడంబడికను కూడా చేసుకుంది. జాతీయ కూట మికి ఇది మరింత దన్ను కలిగిస్తుంది. మహారాష్ట్రలో దూకుడుమీదున్న శివసేనతో బీజేపీ తీవ్రంగా తలపడనుంది. ఈ రాష్ట్రంలో వీలైనన్ని స్థానాలు గెల్చుకోవాలంటే శివసేనకు తలొగ్గి దాని డిమాండ్లను కాషాయదళం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
భాగస్వాములతో సర్దుబాట్లు
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో భాగమైన చిన్న పార్టీలు నరేంద్రమోదీ–అమిత్‌షా తరహా పనివిధానంతో, వ్యవహార శైలితో ఉక్కిరిబిక్కిరవుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. వీటిలో రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ లేక రామ్‌దాస్ అతవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ మరెక్కడికైనా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయా? తమ ప్రయోజనాలు ఉత్తమంగా ఎక్కడ నెరవేరుతాయో అక్కడే పనిచేయాలని ఈ పార్టీలు స్పష్టంగా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన భాగస్వామ్య పార్టీలను చేజారకుండా చూసుకోవడానికి ఎన్నో సర్దుబాట్లు, మరెన్నో రాజీలు చేసుకోవలసి ఉంటుంది.
2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఉన్నట్లుండి మరింత ఆసక్తికరంగా మారింది. రాజకీయ బేరసారాలు కూడా దీనికి తగినట్లుగానే పరాకాష్టకు చేరుకోనున్నాయి. ఇతర రాజకీయ పార్టీలను బుజ్జగించడం, ప్రభావితం చేయడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలకు బీజేపీ తలొగ్గుతుందా లేదా అని ఇప్పుడిప్పుడే ఊహించడం కష్టం. అయితే పొత్తు పార్టీలన్నింటినీ కూడదీసుకుని ఎన్నికల యుద్ధంలోకి దిగాలంటే అది తన ఆకర్షణా శక్తిని, ఎత్తుగడల రాజకీయాలను ప్రయోగంచడమే కాకుండా డబ్బు, భుజబలాన్ని కూడా పెద్ద ఎత్తున ఉపయోగించవలసి రావచ్చు.
సంక్షేమ మంత్రంతోటే ఓట్ల సునామీ
రైతు సంక్షేమానికి, విస్తృత ప్రజానీకం ప్రయోజనాలకు కాస్త పట్టం కడితే కోట్లాది జన హృదయాలు ఎలా స్పందిస్తాయో తెలంగాణ రాష్ట్ర పాలకులు యావద్దేశం ముందు ప్రదర్శించి చూపారు. కేసీఆర్ జపించిన సంక్షేమమంత్రానికి పులకరించిన తెలంగాణ పల్లెలు పోలింగ్ బూత్‌లకు వరుకకట్టాయంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు ఆయన మరోసారి సంధించిన ఆత్మగౌరవ నినాదం తెలంగాణ పట్టణాల్లో కూడా పెను ప్రభంజనం సృష్టించింది. ప్రజా సంక్షేమం పట్ల ప్రత్యేకించి గ్రామీణ ప్రజల అభివృద్ధి పట్ల కేసీఆర్ తొలినుంచి ప్రదర్శిస్తూ వచ్చిన నిబద్ధత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సునామీని సృష్టించింది. ప్రజాకూటమిలో భాగమైన పెద్ద చిన్న పార్టీలను సానుకూల ఓట్ల సునామీ తుడిచి పెట్టేసింది. జిల్లాలకు జిల్లాల్లో గులాబీ రథానికి ఎదురు లేకుండా పోయింది. పాజిటివ్ ఓటు ఎంత ప్రభావం వేస్తుందో చెప్పడానికి, చూపడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పథకాలకు, దార్శనికతకు లభించిన ఘనవిజయం ఒక లిట్మస్ టెస్టుగా దేశం ముందు నిలుస్తోంది. రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పథకాలు దేశంపై దండెత్తుతున్న మనకాలంలో ఇకనైనా రైతు సంక్షేమం తప్పనిసరిగా పట్టించుకోవలిసిన ఎజెండాగా రాజకీయ యవనికపై నిలుస్తుందేమో చూడాలి.
వ్యాసకర్త : సిద్ధార్థ్ బాటియా, సీనియర్ పాత్రికేయుడు (ది వైర్ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment