ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు
జైపూర్: ఊహించినట్లే రాజస్తాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ప్రభావం చూపాయి. వసుంధరా రాజే నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా రేసులో ఉన్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ సైతం తమతమ స్థానాల్లో గెలుపొందారు. ఇక సీఎం ఎవరో తేల్చాల్సిన బాధ్యత అధిష్టానంపై పడింది. ఫలితాలు స్పష్టం కావడంతో నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జైపూర్‌లో సమావేశమై తమ నేతను ఎన్నుకోనున్నారు.
నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం
రాజస్తాన్ అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. అల్వార్ జిల్లాలోని రామ్‌గఢ్ నియోజకవర్గం బీఎస్‌పీ అభ్యర్ధి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిలిపివేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 100 కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ 100, బీజేపీ 70 వరకు సీట్లు గెలుచుకున్నాయి. దీంతోపాటు బీఎస్‌పీ మూడు చోట్ల గెలిచి, మరో మూడు చోట్ల ముందంజలో ఉంది. భారతీయ ట్రైబల్ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ మూడు చోట్ల మెజారిటీ దిశగా ఉంది.
సీపీఎం ఒక స్థానం గెలుచుకుని, మరో చోట ముందంజలో ఉంది. దాదాపు 12 చోట్ల స్వతంత్రులు గెలిచే అవకాశా లున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ మంగళవారం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమ మధ్య సయోధ్య ఉందని చూపుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సచిన్ పైలెట్ మాట్లాడుతూ..స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్ధులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ నుంచి రెబెల్స్‌గా బరిలోకి దిగి గెలుపొందిన చాలామంది మా పార్టీకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. నేడు జైపూర్‌లో జరిగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీకి పరిశీలకునిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు’ అని తెలిపారు. ఈ సమావేశం అనంతరం పార్టీ పరిశీలకులు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న పైలెట్, అశోక్ గెహ్లాట్‌లతోపాటు ఎమ్మెల్యేలందరితో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన నివేదికను అందజేస్తారు.
బుధవారం సాయంత్రం జైపూర్‌లో మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. ఆ సమావేశంలోనే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వస్తుంది, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఎన్నికతోపాటు పలు విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అవినాష్ పాండే మీడియాకు తెలిపారు. గెహ్లాట్, పైలెట్ కాకుండా మరెవరైనా సీఎం రేసులో ఉన్నారా అని ప్రశ్నించగా ఆ విషయాన్ని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. ఎమ్యెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయం తీసుకుని ఆ నివేదికను హైకమాండ్‌కు అందజేస్తాను. అంతిమ నిర్ణయం హైకమాండ్ చేతుల్లోనే ఉంది’ అని కేసీ వేణుగోపాల్ వివరించారు.
దేశమంతటా ఇదే ట్రెండ్: సచిన్ పైలెట్
రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దేశమంతటా సాధిస్తుందని సచిన్ పైలెట్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. రాష్ట్రంలో మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. సరిగ్గా ఏడాది క్రితం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇది చరిత్రాత్మక దినం’ అని పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్ధులు సహా భావసారూప్యం కలిగిన అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ముఖ్యమంత్రి ఎవరో ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారు’ అని ఆయన తెలిపారు. ‘ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇతర పార్టీలు, బీజేపీని వదిలి వచ్చే అభ్యర్ధులను కూడా కలుపుకుని పోతాం. మా పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని గెహ్లాట్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment