బ్లాక్‌డే అలర్ట్
* నిఘా కట్టుదిట్టం
* రైల్వే స్టేషన్లలో భద్రత పెంపు
* అటు బాబ్రీ కోసం.. ఇటు రామాలయం కోసం..
* పోటాపోటీనిరసనలకు పిలుపు
సాక్షి, చెన్నై: బాబ్రీ మసీదు కూల్చి వేత దినం బ్లాక్ డేని పురస్కరించుకుని రాష్ట్రంలో భద్రతను పటిష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుది ట్టం చేశారు. రైల్వే స్టేషన్లలో నిఘాను మూడింతలు పెంచారు. కాగా బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం మైనారిటీ సంఘాలు, రామాలయం నిర్మాణం కోసం హిందూ సంఘాలు పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చారుు. బాబ్రీ మసీదు కూల్చి వేసిన రోజు డిసెంబర్ ఆరవ తేదీని బ్లాక్ డేగా అనుసరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా ఈ రోజు వస్తున్నదంటే చాలు టెన్షన్ తప్పదు.
భద్రతను కట్టుదిట్టం చేస్తారు. తనిఖీలు ముమ్మరం చేస్తారు. ఆ రోజు గడిస్తే చాలు పోలీసులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. అయితే, ఈ ఏడాది మునుపెన్నడూలేని రీతిలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు కారణంగా రాష్ట్రంలో ఇటీవల కాలంగా వెలుగు చూస్తున్న సంఘ విద్రోహ శక్తుల కదలికలే. కేంద్రం నుంచి వస్తున్న హెచ్చరికలు, తాజా పరిణామాలు వెరసి రాష్ట్రంలో ఏవైనా విధ్వంసాలకు వ్యూహ రచన జరిగిందా..? అన్న అనుమానాలు బయలు దేరాయి.
తనిఖీలు ముమ్మరం
శనివారం బాబ్రీ డే కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను పెంచారు. ప్రతి ప్రయాణికుడ్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు, ప్రత్యేకంగా తమిళనాడు స్పెషల్ పోలీసు, సాయుధ రిజర్వు పోలీసుల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచారు. అలాగే, జాతీయ, రాష్ట్ర రహదారుల్లో, అన్ని నగరాల్లోని రోడ్లలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. లాడ్జీలు, హోటళ్లలో అనుమానితులెవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో, వినోద కేంద్రాల్లో, మాల్స్‌లలో, సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌లలో, కోయంబేడు బస్టాండులో పోలీసులు అను నిత్యం నిఘాతో వ్యవహరిస్తున్నారు. రైళ్లల్లో, బస్సులలో పార్శిళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
నిరసనలు :
ప్రతి ఏటా బ్లాక్ డే రోజున మైనారిటీ సంఘాలు నిరసనలు చేపట్టడం పరిపాటే. బాబ్రీ మసీదు పునర్నిర్మాణం నినాదంతో, శాంతి స్థాపన పిలుపుతో ఆయా సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాయి. అయితే, ఈ నిరసనలకు అడ్డుకట్ట వేయాలంటూ కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఇందుకు కోర్టు నిరాకరించింది. దీంతో తమ దైన శైలిలో నిరసనలకు మైనారిటీ సంఘాలు సిద్ధమయ్యాయి. ఇక, తాము సైతం అంటూ రామాలయం నిర్మాణం పిలుపుతో నిరసనలకు హిందూ సంఘాలు పిలుపు నిచ్చాయి. తాంబరం, పల్లావరం తదితర ప్రాంతాల్లో పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చారుు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.