నిరసన హోరు
బాబ్రీ మసీదు కూల్చివేత దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో శనివారం నిరసనలు హోరెత్తాయి. బాబ్రీ మసీదు పున ర్నిర్మాణం కాంక్షిస్తూ మైనారిటీ సంఘాలు, రామాలయం నిర్మాణం లక్ష్యంగా హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పోటాపోటీ ఆందోళనలు ఎక్కడ ఉద్రిక్తతను రేపుతాయోనన్న ఉత్కంఠ నడుమ పోలీసులు విధుల్ని నిర్వర్తించి చివరకు ఊపిరి పీల్చుకున్నారు.
సాక్షి, చెన్నై: బాబ్రీ మసీదు కూల్చి వేసిన రోజు అంటే పోలీసులకు హైటెన్షన్. దీంతో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాలు, అన్ని మతాలకు చెందిన ఆలయాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రతతో వ్యవహరించారు. తనిఖీలు ముమ్మరం చేసి అప్రమత్తంగా వ్యవహరించడంతో బ్లాక్ డే కేవలం నిరసనలతో గడిచింది. అయితే, హిందూ సంఘాలు ఈ సారి రామాలయం నిర్మాణం నినాదంతో ఆందోళనలకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. అనుమతులు లేకుండా నిరసనలు తెలియజేసిన హిందూ సంఘాల్ని పలు చోట్ల పోలీసులు అరెస్టు చేయడంతో బ్లాక్ డే ప్రశాంతగా గడిచింది.
నల్లచొక్కాలతో...: బాబ్రీ మసీదు పున ర్నిర్మాణం, జాతీయ సమైక్యతను కాంక్షిస్తూ మైనారిటీ సంఘా లు, పార్టీలు నిరసనలతో హోరెత్తించాయి. తమిళనా డు ముస్లిం మున్నేట్ర కళగం, తమిళనాడు ముస్లిం లీగ్, తమిళనాడు తౌపిక్ జమాత్, మనిదనేయ మక్కల్ కట్చి, ఎస్‌డీపీఐ, ఐఎన్‌టీజే తదితర సం ఘాలు, పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. నల్ల చొక్కాల్ని ధరించి తమ నిరసనల్ని తెలియజేశారు. చెన్నై నగంరలో నాలుగు చోట్ల నిరసనలు సాగాయి. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం నేత అబూబక్కర్ నేతృత్వంలో జరిగిన నిరసనలో శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ నేత పల నెడుమారన్, మనిమారణ్ సైతం పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. ఇదే వేదిక మీద చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
జాతీయ సమైక్యతను, సర్వమత సామరస్యాన్ని చాటే విధంగా వస్త్రాల్ని ధరించి తమ ఐక్యతను చాటుకోవడం విశేషం. తమను ఎవ్వరూ విడదీయలేరని, తాము భారతీయులం, జాతీయ సమైక్యతకు పాటుపడుతామని నినదించారు. చెన్నైలో జరిగిన నిరసనలకు పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు సైతం తరలి వచ్చారు.రామాలయం లక్ష్యం: అయోధ్యలో రామాలయం నిర్మాణమే లక్ష్యంగా పిలుపునిస్తూ హిందూ సంఘా లు ఆందోళనకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, హిందూ మున్నని, విశ్వహిందూ పరిషత్‌ల నేతృత్వంలో నిరసనలు సాగాయి. రామాలయం నిర్మా ణం నినాదంతో ఫ్లకార్డులను చేత బట్టి ఆందోళనల కు దిగారు. పలు చోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా నిరసనలు చేపట్టిన హిందూ సంఘాల్ని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో ఎగ్మూర్, తాంబ రం, మాధవరంలలో ఈ నిరసనలు సాగాయి. ముందస్తు అనుమతులు లేకుండా నిరసనలు చేపట్టినందుకు గాను 200 మంది హిందూ సంఘాల నాయకుల్ని అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు.