బ్లాక్ డే | Black Day | Sakshi
Sakshi News home page

బ్లాక్ డే

Published Fri, Sep 26 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

బ్లాక్ డే

బ్లాక్ డే

సాక్షి, చెన్నై: యుద్ధం పేరుతో శ్రీలంకలో సాగిన మారణ హోమం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను యుద్ధ ద్రోహిగా అంతర్జాతీయ న్యాయ స్థానం బోనులో నిలబెట్టాలన్న కాంక్షతో ప్రపంచంలోని తమిళులు ఎదురు చూస్తున్నారు. ప్రపంచ దేశాల్ని అభ్యర్థిస్తున్నారు. అయితే, తమిళుల్ని మట్టుబెట్టిన రాజపక్సేకు ప్రసంగించే అవకాశం కల్పిస్తూ ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవడం తమిళుల్లో ఆగ్రహాన్ని రేపింది. రాజపక్సే ప్రసంగాన్ని అడ్డుకోవాలంటూ నినదిస్తున్నారు. శుక్రవారం ఐరాసలో ప్రసంగించేందుకు రాజపక్సే ఓ వైపు సిద్ధం అవుతుంటే, మరో వైపు ప్రపంచంలోని తమిళులందరూ ఆగ్రహంతో నిరసనల బాట పట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోను నిరసన జ్వాల ఎగసింది. గురువారం బ్లాక్ డేగా పరిగణించాలని ఈలం తమిళుల మద్దతు సంఘం (టెసో) పిలుపు నిచ్చింది. దీంతో బ్లాక్ డేను ప్రశాంత పూరిత వాతావరణంలో డీఎంకే, ఆ కూటమి మిత్రులు పాటించారు.
 
 నలుపుమయం: డీఎంకే నేతృత్వంలో రాష్ట్రంలోని గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న ఆ పార్టీ కార్యాలయాల్లో ఉదయాన్నే నల్ల జెండాల్ని ఎగుర వేశారు. డీఎంకే నాయకులు, కార్యకర్తల ఇళ్లల్లోను నల్ల జెండాలు  ఎగుర వేసి నిరసన తెలియజేశారు. నాయకులు, కార్యకర్తలు నల్ల చొక్కాల్ని ధరించి ర్యాలీలు నిర్వహించారు. చెన్నైలోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాళయం, పరిసరాల్లో నల్లజెండాల్ని ఎగుర వేశారు. అధినేత ఎం కరుణానిధి నివాసం ఉండే గోపాల పురం ఇంటి వద్ద, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ ఇళ్లలోను నల్ల జెండాలు ఎగిరాయి.
 
 కరుణానిధి నల్ల చొక్క ధరించగా, స్టాలిన్ నల్ల ప్యాంటు, నల్ల షర్టు ధరించారు. పార్టీ నాయకులు దాదాపుగా గురువారం నల్ల చొక్కాలతోనే ప్రత్యక్షం అయ్యారు. అన్నా అరివాళయం వద్ద కాసేపు రాజపక్సేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పుదియ తమిళగం నేత కృష్ణ స్వామి, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, వీసీకే నేత తిరుమావళవన్‌ల నేతృత్వంలోను పలు చోట్ల నిరసనలు జరిగారుు. వారి ఇళ్లలోను నల్ల జెండాలు ఎగిరాయి. నల్ల చొక్కాలతో నాయకులు నిరసనలకు తరలి వచ్చారు. నినాదాల హోరు: రాజపక్సేకు వ్యతిరేకంగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఖండిస్తూ బ్లాక్‌డేలో నినాదాలు హోరెత్తాయి. సీమాన్ నేతృత్వంలో వళ్లువర్‌కోట్టం వద్ద నిరసన జరిగింది. దిండుగల్‌లో, విల్లుపురం, పెరంబలూరు, అరియలూరు, కడలూరు, కరూర్, తిరునల్వేలి, కన్యాకుమారి, మదురై, తిరుచ్చిల్లో డీఎంకే నేతృత్వంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. తంజావూరులో మాత్రం అనుమతి లేదన్న సాకుతో డీఎంకే వర్గాల్ని పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.
 
 ఈ బ్లాక్ డే విజయవంతంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లను విస్మరించినా, తమిళులు మాత్రం విస్మరించ లేదన్నారు. రాజపక్సేను అడ్డుకుందామని కేంద్రానికి పిలుపునిచ్చామని, అయితే, వారి నుంచి స్పందన రానప్పటికీ, బ్లాక్ డేకు మాత్రం విశేష స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు కళ్లు తెరవాలని, తమిళుల మనో భావాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. రాజపక్సే ప్రసంగాన్ని అడ్డుకునే విధంగా ఐరాస సమావేశంలో భారత్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళ ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాల్ని తీసుకోవద్దని, మనో భావాలతో చెలగాటం మాత్రం ఆడొద్దని, గత ప్రభుత్వం వలే కుటిల యత్నాలు చేయొద్దని కేంద్రాన్ని హెచ్చరించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement