అద్వానీకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : బీజేపీ అగ్రనేత ఎల్కె. అద్వానీకి మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసు నుంచి విముక్తిపై న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. అద్వానీతో పాటుమురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్, ఉమాభారతితో పాటు వీహెచ్పీ నేతలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో న్యాయస్థానం వివరణ కోరింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాగా బాబ్రీ కేసు నుంచి అలహాబాద్ కోర్టు అద్వానీకి విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కేసు నుంచి అద్వానీ సహా 19 మందికి ఉపసమనం కల్పిస్తూ అలహాబాద్ హైకోర్టు వెలువరించిన తీర్పును సిబిఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారన్న కేసు నుంచి అద్వానీ, కల్యాణ్ సింగ్, ఉమాభారతి, వినయ్ కటియార్, మురళీ మనోహర్ జోషి తదితరులకు అలహాబాద్ హైకోర్టు ఉపశమనం కల్పించింది. సతీష్ ప్రధాన్, సిఆర్ బన్సల్, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, సాధ్వీ రితంబర, విహెచ్ దాల్మియా, మహంత్ అవైధ్యనాథ్, ఆర్‌వి వేదాంతి, పరమ్ హాన్స్ రామ్ చంద్రదాస్, జగదీష్ ముని మహారాజ్, బిఎల్ శర్మ, నృత్యగోపాల్ దాస్, ధరమ్‌దాస్, సతీష్ నాగర్, మరేశ్వర్ సావే పేర్లను తొలగించారు. మరణానంతరం బాల్ థాకరే పేరును జాబితాలోంచి తీసివేశారు.