కరాచీ: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై దాయాది దేశం పాకిస్తాన్ తన అక్కసు వెళ్లగక్కింది. బాబ్రీ మసీదు స్థలంలో రామాలయం నిర్మిస్తున్నారని విమర్శలకు దిగింది. ముస్లింలపై భారత్ వివక్ష చూపుతుందనడానికి ఇదే నిదర్శనమంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ బుధవారం రాత్రి వెలురించిన ప్రకటనలో భారత్ అంతర్గత అంశాలను ప్రస్తావించింది. మసీదు స్థానంలో రాముని గుడి నిర్మించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపింది. ప్రపంచం అంతా కోవిడ్‌తో సతమతమవుతోంటే ఆర్ఎస్ఎస్, బీజేపీలు మాత్రం హిందుత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు పోరాడుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. (తాత్కాలిక ఆలయంలోకి రాముని విగ్రహం)
కాగా అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌లో తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లాకు అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును సైతం పాక్ తప్పుపట్టింది. న్యాయం ఓడిపోయిందని వ్యాఖ్యానించింది. బాబ్రీ మసీదు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరసత్వ సవరణ పట్టిక(ఎన్నార్సీ) అంశాలు.. భారత్‌లో ముస్లింలను అణిచివేస్తున్నారనడానికి నిదర్శనంగా మారాయంటూ విషం చిమ్మింది. ఈ అంశాలన్నీ తమ అంతర్గత విషయాలని భారత్ తిప్పి కొట్టింది. (అయోధ్యలో బయటపడ్డ దేవతా విగ్రహాలు)
Comments
Please login to add a commentAdd a comment