
‘బాబ్రీ’ కూల్చివేత నాటి రాష్ట్రపతికి తెలుసు
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదును కూల్చివేత పథకం అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మకు తెలుసునని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ సోమవారం ఢిల్లీలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. అయోధ్యలో 1992 డిసెంబర్ 6న బీజేపీ నేతృత్వంలో కరసేవకులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదును కూల్చివేయాలని బీజేపీ, దాని మద్దతుదారులు నిర్ణయం తీసుకోవడంతో 1992 డిసెంబర్ 4న తమ పార్టీ నాయకులతో కలసి తాను అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మను కలుసుకున్నానని, మసీదు కూల్చివేతను నివారించేందుకు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
ఈ మేరకు ఆయనకు లేఖ ఇచ్చామని, లేఖ అందుకున్న ఆయన దానిని చదివి, కాసేపు ఇటూ అటూ చూసి, మీరు ఎవరికీ చెప్పవద్దు... మసీదు కచ్చితంగా కూలిపోతుందని చెప్పారని తెలిపారు. ఈ అంశంపై అప్పటి ప్రభుత్వంతో మాట్లాడేందుకు తాను ఎంతగా ప్రయత్నించినా, ఎవరూ తన మాట వినిపించుకోలేదని, చివరకు డిసెంబర్ 6న మసీదు కూల్చివేత జరిగిందని అన్నారు. దీనిపై ఒక పుస్తకాన్ని రాయాలని సంకల్పించి, కొన్ని పేజీలు రాశానని, అయితే, పలువురు నాయకుల చరిత్ర బట్టబయలవుతుందని సన్నిహితులు చెప్పడంతో దాన్ని విరమించుకున్నానని చెప్పారు.