తిరిగొచ్చిన కుట్ర కేసు! | Supreme Court Shocks To LK Advani Babri masjid Demolition Case | Sakshi
Sakshi News home page

తిరిగొచ్చిన కుట్ర కేసు!

Published Thu, Apr 20 2017 12:47 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

తిరిగొచ్చిన కుట్ర కేసు!

తిరిగొచ్చిన కుట్ర కేసు!

నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దాదాపు రిటైర్మెంట్‌ జీవితం అనుభవిస్తున్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అడ్వాణి, మురళీమనోహర్‌ జోషిలకు బాబ్రీ మసీదు విధ్వంసం కుట్ర కేసు మళ్లీ మెడకు చుట్టుకుంది. ఆ ఇద్దరితోపాటు కేంద్ర మంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర, వినయ్‌ కటియార్‌ తదితరులు కూడా ఈ కేసు విచారణను ఎదుర్కొనవలసిందేనంటూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చిన ఆదేశాలు ఆ నేతలందరినీ దిగ్భ్రమపరిచి ఉండాలి. ఈ కేసు న్యాయస్థానాల్లో నలుగుతున్న తీరును గమనిస్తే సామాన్యులు కూడా బిత్తర పోవాల్సిందే. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన ఉదంతాలతో ముడిపడి ఉన్న కీలకమైన కేసుకే ఇలాంటి స్థితి ఏర్పడితే సాధారణ కేసుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది.

కేసులో మొత్తం 21మంది నిందితులుంటే అందులో బాల్‌ ఠాక్రే, మహంత్‌ అవైద్యనాథ్, అశోక్‌సింఘాల్‌సహా 8మంది మరణించారు. మరో నింది తుడు, రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌సింగ్‌ రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నందువల్ల ఆయనపై కేసు విచారణ ప్రస్తుతానికి ఉండదు. బాబ్రీ విధ్వంసానికి సంబంధించి రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకటి– గుర్తు తెలియని కరసేవకులపై పెట్టిన కేసు. ఇది లక్నో సెషన్స్‌ కోర్టులో నడుస్తోంది. మరొకటి– అడ్వాణి తదితర నేతలపై పెట్టిన కేసు. ఇది రాయ్‌బరేలీ కోర్టులో కొనసాగుతోంది. భిన్న వర్గాలమధ్య విద్వేషాలు సృష్టించడం, జాతీయ సమగ్రతకు భంగం కలి గించడం, వదంతులు సృష్టించి శాంతికి భంగం కలిగించడం వంటివి నాయకులపై పెట్టిన కేసులో ఉన్నాయి. ఇది విచారణలో ఉండగా సీబీఐ 120–బి కింద కుట్రకు పాల్పడ్డారంటూ అదనపు అభియోగాన్ని మోపింది. ఒకే ఉదంతంపై రెండు కేసులు పెట్టడం, అవి రెండూ వేర్వేరు న్యాయస్థానాల్లో కొనసాగడం విచిత్రం. కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాలేవీ ఈ విషయంలో సీబీఐకి తగిన మార్గ నిర్దేశం చేయలేక పోయాయి. ఈ రెండు కేసులనూ విలీనం చేసి విచారించమని పాతికేళ్ల తర్వాత సుప్రీంకోర్టు చెప్పాల్సివచ్చింది. ఇది సీబీఐకి చెంపపెట్టు.
 
న్యాయస్థానాల్లో సాగిన విచారణల పరంపర సంగతలా ఉంచి వివిధ దశల్లో ఆ తీర్పులకూ, సీబీఐ అప్పీళ్లకూ మధ్య ఉన్న వ్యవధి గమనిస్తే ఆశ్చర్యం కలుగు తుంది. 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును కరసేవకులు ధ్వంసం చేసినప్పుడు, ఈ నేతలంతా అక్కడకు సమీపంలోనే ఉన్నారని... అంతక్రితం వారు చేసిన రెచ్చ గొట్టే ప్రసంగాలే అందుకు కారణమని సీబీఐ ఆరోపించింది. 1993 అక్టోబర్‌లో సీబీఐ ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేయగా మరో ఏడేళ్లకు... అంటే 2001 మే నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. విచారణ కొనసాగుతుండగా కుట్ర కేసు పెట్టడం సరికాదంటూ సాంకేతిక కారణాలను చూపి వారిపై ఈ అభియోగాన్ని తొలగించింది. దీనిపై అప్పీల్‌ చేయడానికి సీబీఐ మూడేళ్ల వ్యవధి తీసుకుని 2004 నవంబర్‌లో ఆ తీర్పుపై అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌లో సీబీఐ అప్పీల్‌ చేసింది. ఈలోగా ఇతర నిందితులపై సీబీఐ అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసింది. 2010లో హైకోర్టు తీర్పు వెలువరిస్తూ కింది కోర్టుతో ఏకీ భవించింది. ఈ తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పర్యవసానంగా తాజా తీర్పు వచ్చింది. కుట్ర అభియోగాన్ని పునరుద్ధరించడంతోపాటు రెండు కేసులనూ కలిపి లక్నో సెషన్స్‌ కోర్టులో విచారణ సాగాలని, రోజువారీ ప్రాతి పదికన విచారణ కొనసాగించి రెండేళ్లలో తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 అయోధ్య అనగానే కోట్లాదిమంది హిందువులకు రాముడు గుర్తుకొస్తాడు. రాముడి గురించి, అయోధ్య గురించి తెలిసినవారికి కూడా విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) రామ జన్మభూమి విముక్తి పేరుతో 80వ దశకంలో ఉద్యమం ప్రారం భించేవరకూ అందుకు సంబంధించిన వివాదం నడుస్తున్నదని తెలియదు. 1528లో నాటి మొగల్‌ చక్రవర్తి బాబర్‌ అయోధ్యలో ఉన్న రామాలయాన్ని కూల్చి మసీదు కట్టించాడన్నది వీహెచ్‌పీ, బీజేపీల వాదన. 1949లో ఆ మసీదు ఆవ రణలో రాముడి విగ్రహాన్ని ఉంచడంతో రాజుకున్న స్థల వివాదం ఫైజాబాద్‌ సివిల్‌ కోర్టులో కొనసాగుతూనే ఉంది. వీహెచ్‌పీ ఉద్యమాన్ని బీజేపీ స్వీకరించాక అది మరింత తీవ్ర రూపం దాల్చింది. అంతవరకూ అంతంతమాత్రంగా ఉన్న బీజేపీ దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడానికి, అధికారంలోకి రావడానికి బాబ్రీ మసీదు వివాదం ఏ స్థాయిలో తోడ్పడిందో అందరికీ తెలుసు. దాంతోపాటే ఆ వివాదం ప్రారంభమయ్యాక దేశంలో ఏర్పడ్డ వైషమ్య భావాలు బాబ్రీ మసీదు కూల్చివేతతో పరాకాష్టకు చేరాయి. దేశవ్యాప్తంగా చెలరేగిన మత కల్లోలాల్లో 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందరో గాయాలపాల య్యారు. వేల కుటుంబాలు నిరాధారమయ్యాయి. అనంతరకాలంలో దేశంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలకు, ఉగ్రవాద ఉదంతాలకు మూలాలు బాబ్రీ విధ్వంసంలోనే ఉన్నాయి.

అడ్వాణి తదితర నేతలపై సీబీఐ పెట్టిన అభియోగాలపై ప్రత్యేక కోర్టులో ఆనాటి ఐపీఎస్‌ అధికారిణి అంజూగుప్తా ఇచ్చిన వాంగ్మూలం కీలకమైనది. కర సేవకులు కూల్చివేత సాగిస్తుండగా సమీపంలోనే ఉన్నారని, నివారించే ప్రయత్నం చేయకపోగా ‘పని’ పూర్తయ్యేవరకూ కదలొద్దని వారిని ఆదేశించారని ఆరోపిం చారు. పైగా విధ్వంసం పూర్తయ్యాక మిఠాయిలు పంచుకున్నారని తెలిపారు. కరసేవకులు అప్పటికప్పుడు ఉద్రేకంలో విధ్వంసానికి పూనుకున్నారని బీజేపీ నేతలు చేసిన వాదనను ఆమె తోసిపుచ్చారు. అయితే అడ్వాణి మాత్రం బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు తన జీవితంలో అత్యంత విషాదకరమైన దినమని అనంతరకాలంలో వ్యాఖ్యానించారు. ఏదేమైనా కేసు ఈ స్థాయికి చేర డానికి పాతికేళ్లు పట్టడం మన దేశంలో నెలకొన్న అవ్యవస్థకు నిదర్శనం. కనీసం దేశాన్ని కుదిపిన కీలకమైన కేసుల్లోనైనా సత్వర విచారణ సాగాలని, దోషులని తేలితే ఎంతటివారికైనా శిక్షలు పడాలని కోరుకోవడం అత్యాశేమీ కాదు. కానీ అది కూడా సాధ్యపడని స్థితి నెలకొని ఉండటం ఎంత విషాదకరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement