
హిందువులు కల్యాణి బిర్యానీ తినాలంటే ఎలా ఉంటుంది?
* మనుషుల కంటే గోవులను రక్షించే ప్రభుత్వం
* ప్రపంచ పర్యటనలకే ప్రధాని మోదీ పరిమితం
* బాబ్రీ మసీదు కూల్చివేత నిరసన సభలో అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ‘ముస్లింలు సహనం ప్రదర్శించేందుకు బహిరంగంగా పంది మాంసం తిని చూపించాలని త్రిపుర గవర్నర్ వ్యాఖానించారని.. తాను హిందువులు సహనం చూపిం చేందుకు కల్యాణి బిర్యానీ తినాల్సి ఉంటుంది‘ అంటే ఎలా ఉంటుందని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాం మైదానంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘గోవు మాసం తింటే మనుషులను చంపుతారా..? మనిషి ప్రాణాల కంటే జంతువుల ప్రాణాలు ముఖ్యమా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రజల ప్రాణాల కంటే గోవులను రక్షించే ప్రభుత్వంగా తయారైందని ఎద్దేవా చేశారు. దేశ సరిహద్దులో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా...నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటుతున్నా.. ఆ ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు.
కేవలం ప్రపంచ పర్యటనలో మోదీ తేలియాడుతున్నారని విమర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బీఫ్ విందు నిర్వహిస్తున్నారని, పప్పుల ధరల కంటే మాంసం ధరలు తక్కువగా ఉన్నప్పుడు నిరుపేదలు తినకుండా ఎలా ఉంటారన్నారు. ప్రజా స్వామ్య దేశంలో ఏ వ్యక్తికైనా ఏదైనా తినే స్వేచ్ఛ ఉందన్నారు. హిందుస్థాన్ హిందువులది, ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని అసోం గవర్నర్ వాఖ్యానించడాన్ని అసద్ తప్పు పట్టారు.
దేశం అందరిదనీ, అలాంటప్పుడు పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్తామని అసదుద్దీన్ ప్రశ్నించారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే ఆర్‌ఎస్‌ఎస్, హిందూ వాహిణీలు ముస్లిం జనాభా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తుయ విమర్శించారు. దమ్ముంటే స్వామీజీలు పెళ్లి చేసుకొని ఒకరిని పుట్టించి చూపించాలని సవాల్ చేశారు.
దేశంలో ప్రస్తుతం సహనం..అసహనం గురించి చర్చ జరుగుతోందని, ప్రముఖ సాహిత్య వేత్తలు కూడా తమ అవార్డులను వెనక్కి ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఐఎస్‌ఎస్‌తో ఇస్లాంకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు ఆముదం తాగిస్తాం
కాంగ్రెస్ పార్టీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆముదం తాగించి తీరుతామని అసద్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను 70 ఏళ్లు మోసం చేసింది చాలక ఇటీవల బెంగళూర్ ఎన్నికల ప్రచారంలో నిజాం దక్కన్‌ను ద్రోహిగా వర్ణించారని ఆరోపించారు. నిజాం చేసిన సేవలు మరిచి తప్పుడు ప్రచారం చేయడం సహించరానిదన్నారు. కాంగ్రెస్‌కు ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరించిందని అసద్ ఆరోపించారు. బీజేపీ తొలి ప్రధాని వాజ్‌పేయి కాదని, పీవీ నర్సింహారావు అని విమర్శించారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగుతామని ప్రకటించారు.