
బాబ్రీ మసీదును పునర్నిర్మించేవరకూ పోరాటం: అసదుద్దీన్
నాందేడ్, న్యూస్‌లైన్: అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్నిర్మించే వరకు ఎంఐఎం పోరాటం చేస్తుందని ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. శుక్రవారం రాత్రి పర్భణీ జిల్లాలోని నూతన్ మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ముస్లింలపై వివక్ష కొనసాగుతోందని, ఉగ్రవాదులుగా పోలీసులు పరిగణిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీలను చిత్తుగా ఓడించి తమ సత్తా చాటుతామన్నారు.
దేశ వ్యవస్థలో మార్పునకు ఎం ఐఎంను నమ్ముకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు సొంత ప్రయోజనాలకే ముస్లింలను వాడుకున్నాయని ఆరోపించారు. పట్టుబడ్డ ఉగ్ర వాదులందరినీ మీడియా ముందుకు తీసుకుచ్చి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ప్రశ్నిస్తే ఎవరు ఉగ్రవాదులో బయటపడుతుందన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే గుజరాత్ తరహాలోనే దేశంలోని ముస్లింలకు భద్రత లేకుండా పోతుందన్నారు. తమ పార్టీని గెలిపిస్తే ముస్లింలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.