
‘బాబ్రీ’ కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్
అడ్వాణీ, జోషిలను మళ్లీ విచారించాలన్న సీబీఐ
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితర నేతలను మళ్లీ విచారించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసులో అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 13 మంది భాజపా నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సిందేనని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు.
సీబీఐ వాదనపై సుప్రీంకోర్టు స్పందిస్తూ చట్టం నుంచి తప్పించుకునేందుకు అనుమతించాలా? న్యాయం జరగకపోవడాన్ని అంగీకరించాలా? అనే ప్రశ్నలు ముఖ్యమైనవని పేర్కొంది. సుమారు 25 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో న్యాయం జరగనట్టేనని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న విశేషాధికారాలను వినియోగించి రాయ్‌బరేలీ కోర్టులో వీవీఐపీలపై ఉన్న కేసును లక్నో కోర్టుకు బదిలీ చేసి, రెండేళ్లలో విచారణ పూర్తయ్యేలా చేయాలని సుప్రీంకోర్టు యోచిస్తోంది.
దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. 1992, డిసెంబర్ 6న జరిగిన వివాదాస్పద కట్టడం కూల్చివేతకు సంబంధించి రెండు కేసులు ఉన్నాయి. మొదటిది గుర్తుతెలియని ‘కరసేవకుల’పై లక్నో కోర్టులో కేసు. రెండోది రాయ్‌బరేలీ కోర్టులో అడ్వాణీ తదితర వీవీఐపీలపై ఉన్న కేసు. లక్నో కోర్టులో కరసేవకులకు వ్యతిరేకంగా ఉన్న కేసులో ఇప్పటివరకు 195 మంది సాక్షులను విచారించగా.. ఇంకా మరో 800 మందిని విచారించాల్సి ఉంది. రాయ్‌బరేలీ కోర్టులో ఇప్పటివరకు 57 మంది సాక్షులను విచారించగా.. మరో 105 మందిని విచారించాల్సి ఉంది.
ఈ కేసులో భాజపా నేతలు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా పలువురు సీనియర్ నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. మసీదు కూల్చివేతకు కుట్ర పన్నినట్లు నమోదైన ఆరోపణలను రాయ్‌బరేలీ కోర్టు తోసిపుచ్చింది. అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి తదితరులకు విముక్తి కల్పించింది. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు 2010 మే 20న ఇచ్చిన తీర్పులో సమర్థించింది. దీంతో ఈ కేసును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.