
అద్వానీ చిక్కుల్లో పడతారా..!
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించిన నేరే పూరిత కుట్రకు సంబంధించిన ఆరోపణల కేసు విచారణలో బీజేపీ నేత ఎల్‌కే అద్వానీని చేర్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు వాదనలు జరిగే అవకాశం ఉంది. 1992లో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించిన విచారణలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతీ, రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ తదితరులను చేర్చగా వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించడంతో వారిని ఈ కేసునుంచి తప్పిస్తూ 2010 మే నెలలో హైకోర్టు వారిని తప్పించింది. దీంతో సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, గత నెల 23న ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు సీబీఐ, బీజేపీ సీనియర్ నాయకులు, హాజీ మహబూబ్ అహ్మద్, ఇతర పిటిషనర్లను ఈ విషయంపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.