
కిం కర్తవ్యం?
బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో బుధవారం నాటి సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. కొందరు సీనియర్ల భవిష్యత్తుపైనా నీలినీడలు కమ్ముకొన్నాయి. ప్రధాని కాలేకపోయినా.. కనీసం రాష్ట్రపతి భవన్‌లోనైనా అడుగుపెట్టాలని ఆశించిన 89 ఏళ్ల బీజేపీ భీష్మపితామహుడు అడ్వాణీని 25 ఏళ్ల కిందటి కేసు వెంటాడుతూనే ఉంది. అగ్రనేత అడ్వాణీ నిందితుడిగా కోర్టులో నిలబడాల్సిన పరిస్థితిని హిందూత్వ శక్తులు ఎలా జీర్ణించుకుంటాయి? హిందూత్వ–అభివృద్ధి సమ్మిళిత నినాదంతో రాజకీయాల్లో కొత్త ప్రయోగం చేస్తున్న మోదీ బృందం ఈ శక్తులకు ఏం సమాధానం చెబుతుంది. విచారణ ముగిసి కేసు వీగిపోతే.. తమ పార్టీ అగ్రనేతలకు సంబంధించినదైనా చట్ట ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేదని, ఇదీ తమ నిబద్ధతని మోదీ ప్రభుత్వం చెప్పుకోగలదు. అలా కాకుండా మరో రకంగా జరిగితే పరిస్థితేంటనేది పార్టీకి అంతుబట్టడం లేదు.
ఆశలు ఆవిరి
రాష్ట్రపతి రేసులో ఎల్‌కే అడ్వాణీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే తాజా పరిణామాలతో.. అడ్వాణీ అభ్యర్థిత్వంపై బీజేపీ, ఆరెస్సెస్‌లు పునరాలోచనలో పడ్డాయి. అత్యున్నత రాజ్యాంగ పదవికి క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తిని పోటీకి నిలిపే సాహసం బీజేపీ, ఆరెస్సెస్ చేయగలవా? ఎన్డీయేలో లేనప్పటికీ అడ్వాణీ పట్ల కొన్ని ప్రాంతీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘సెక్యులర్ ముద్ర’కు భయపడి ఇలాంటి పార్టీలు ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వకపోవచ్చు.
తప్పుకోక... తప్పదా?
కేంద్ర మంత్రి ఉమాభారతి మంత్రి పదవిని వదులుకోవాల్సి రావొచ్చు. వ్యాపం కేసులో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్, లలిత్ మోడీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేల రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టినా కేంద్ర ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. ఎందుకంటే వారిపై ఆరోపణలే గాని అభియోగాలు లేవు. మరి ఉమాభారతిని అలా వెనకేసుకు రాగలదా? క్రిమినల్ అభియోగాలు ఉన్నంత మాత్రాన రాజీనామా చేయాలని నిబంధనల్లో ఎక్కడా లేదు. కానీ.. ఉమాభారతి రాజీనామా నైతిక విలువలతో ముడిపడి ఉన్న అంశం.
జోషి ఆశలు గల్లంతేనా?
బీజేపీ మార్గదర్శక్ మండల్ సభ్యుడు, 83 ఏళ్ల కాన్పూర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి. మోదీ ప్రధాని అభ్యర్థిగా తెరమీదకు వచ్చినపుడు అడ్వాణీతో సమానంగా నొచ్చుకున్నారు. గతనెల్లో ప్రభుత్వం జోషిని పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఆరెస్సెస్ అండతో ఈయన పేరు కూడా రాష్ట్రపతి అభ్యర్థి రేసులో వినపడింది. తాజా పరిణామాలతో అడ్వాణీ లాగే జోషి కూడా ఆశలు వదులుకోవాల్సిందే.
ఇప్పటికి పదవే ‘రక్ష’
బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన 1992 డిసెంబరులో కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నారు. 2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఈయన్ను రాజస్తాన్ గవర్నర్‌గా నియమించింది. అడ్వాణీ, జోషి, ఉమాభారతితో పాటు ఈయన కూడా బాబ్రీ కేసులో నిందితుడే. అయితే గవర్నర్‌గా ఉన్నందువల్ల 85 ఏళ్ల కల్యాణ్‌సింగ్‌పై ప్రస్తుతానికి క్రిమినల్ అభియోగాలు మోపడం వీలుకాదు. అందుకే పదవీకాలం ముగిశాక (సెప్టెంబరు 3, 2019 తర్వాతే) అభియోగాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 361 (2) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ పదవుల్లో ఉన్న వారిపై ఎలాంటి క్రిమినల్ అభియోగాలను మోపడానికి వీల్లేదు.
ఇతరులు
రాయ్‌బరేలీ కోర్టులో నమోదైన ఈ కేసులో మొత్తం 13 మందిని సీబీఐ నిందితులుగా చేర్చింది. వీరిలో బాల్ థాకరే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్‌లు కన్నుమూశారు. వినయ్ కతియార్, సాధ్వి రీతాంబర, విష్ణు హరి దాల్మియాలు అభియోగాలు ఎదుర్కొననున్న ఇతర ప్రముఖులు.