
విఫల మనో‘రథుడు’
జనసంఘ్ నుంచి వేరుపడ్డాక సొంతకుంపటి పెట్టుకుని, 1984 ఎన్నికల్లో రెండంటే రెండే సీట్లు గెలిచింది బీజేపీ. అలాంటి పార్టీని దేశ రాజకీయాల్లో ఒక ప్రబలశక్తిగా మలిచింది నిస్సందేహంగా లాల్ కృష్ణ అడ్వాణీయే. హిందూత్వ ఎజెండాతో ఐదేళ్లలో (1989కి) బీజేపీ బలాన్ని 86కు చేర్చారు. తర్వాత రథయాత్ర చేపట్టి పార్టీని బలోపేతం చేశారు. 1996లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా..13 రోజులు మాత్రమే మనగలిగింది.
తర్వాత బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డా అడ్వాణీ ప్రధాని కాలేకపోయారు. ఆయన ప్రధాని అభ్యర్థిగా ఉన్నపుడు పార్టీ ఎన్నికల్లో బోల్తాపడింది. తప్పక గెలుస్తామనుకున్నపుడు ప్రధాని అభ్యర్థి కాకుండా పోయారు. చివరకు రాష్ట్రపతి అయినా అవుతారనుకుంటే... బుధవారం సుప్రీంతీర్పు ఆ ఆశలపైనా నీళ్లు చల్లినట్లైంది. దేశంలోని రాజ్యాంగబద్ధ పదవుల్లో కీలకమైన రెండు పదవులూ (ప్రధాని, రాష్ట్రపతి) అడ్వాణీకి అందినట్టే అంది దూరమయ్యాయి. ఆ వైనమేమిటో చూద్దాం...
1998-99: 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 182 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 13 నెలలకే అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం పడిపోయింది. 1999 ఎన్నికల్లోనూ బీజేపీ 182 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచి, ఈసారి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసింది. అప్పట్లో ఎన్డీయేలోని మిత్రపక్షాలకు అడ్వాణీ హిందూ అతివాదిగా కనపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా వాజ్‌పేయి 1998, 1999ల్లో ప్రధాని అయ్యారు. అడ్వాణీ, హోం మంత్రిగా, ఉపప్రధానిగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది.
2009: ఎన్నికల్లో ప్రచార సారథి, బీజేపీ ప్రధాని అభ్యర్థి అన్నీ అడ్వాణీయే. కానీ బీజేపీ 116 సీట్లు మాత్రమే సాధించి ఓడిపోయింది.2013: అడ్వాణీ 2005లో పాక్ పర్యటనకు వెళ్లినపుడు మహ్మద్ అలీ జిన్నాను లౌకికవాదిగా అభివర్ణించారు. అప్పటినుంచే ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆయనకు పొరపొచ్చాలు వచ్చాయి. ఇక 2014 ఎన్నికలకు మోదీ ప్రధాని అభ్యర్థి అయ్యారు. దీంతో అడ్వాణీ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 2014లో గాంధీనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
2017: జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. క్రియాశీల రాజకీయాల్లో అడ్వాణీకి ఏమీ మిగల్లేదు. మరోవైపు వయసు మీద పడింది కాబట్టి 89 ఏళ్ల అడ్వాణీని బీజేపీ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తుందనే సంకేతాలొచ్చాయి. కానీ అనూహ్యంగా 25 ఏళ్లుగా సాగుతూ వస్తున్న బాబ్రీ కూల్చివేత కేసు మరోసారి ఆయన మెడకు చుట్టుకుని రాష్ట్రపతి అయ్యే అవకాశాలను దెబ్బతీసింది.