న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటితోపాటు ఆమె కుటుంబంపై సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్ సర్క్యూలర్‌ను (ఎల్‌ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈమేరకు బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
ఈ సందర్భంగా సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ అనవసరమైనదని పేర్కొంది. ‘నిందితుల్లో ఒకరు సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయినందున మీరు ఈ పనికిరాని పిటిషన్ వేశారు. మేము మిమ్మల్నిహెచ్చరిస్తున్నాం. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు( సుశాంత్, రియా) సమాజంలో పేరు కలిగిన వారు.’ అని పేర్కొంది.
ఇదిలా ఉండగా నటుడు సుశాంత్ సింగ్ 2020 జూన్ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అది ఆత్మహత్య కాదని, సుశాంత్ మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ పాట్నాలో అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి విచారణ చేపట్టింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ గతంలో ఎల్‌వోసీ జారీ చేసింది. దీనిపై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ తీర్పు వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment