
సీఎం యోగి అనూహ్య అడుగులు!
- నేడు అయోథ్యలో పర్యటన.. రామమందిరం సందర్శన
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలో పర్యటించబోతున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన మరునాడే ఆయన అయోధ్యలోని రామజన్మభూమిని సందర్శించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేసీ హిందూత్వ అజెండాను మరింత తెరపైకి తెచ్చేందుకు, రామమందిర నిర్మాణానికి మద్దతుగా యోగి ఈ పర్యటన చేపట్టినట్టు భావిస్తున్నారు.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదస్పద ప్రదేశంలో తాత్కాలికంగా నిర్మించిన రామమందిరంలో బుధవారం సీఎం యోగి పూజలు నిర్వహించబోతున్నారు. గడిచిన 15 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, జోషి, ఉమాభారతిపై కుట్ర అభియోగాలను ఖరారు చేసిన సీబీఐ కోర్టు వారికి మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామజన్మభూమి ఆలయాన్ని సీఎం యోగి సందర్శిస్తుండటంతో ఈ అంశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.