వారి సేవలకు సరైన గుర్తింపు
వాజ్‌పేయి, మాలవీయలకు భారతరత్న పురస్కారంపై మోదీ
చాలా సంతోషంగా ఉందని ట్వీటర్‌లో హర్షం
న్యూఢిల్లీ: పండిట్ మదన్ మోహన్ మాలవీయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలకు భారతరత్న పురస్కారం ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని వారికి ప్రకటించడం.. దేశానికి ఆ మహానుభావులు చేసిన సేవలకు లభించిన సరైన గుర్తింపని అభివర్ణించారు. భారతరత్న పురస్కారాల ప్రకటన వెలువడగానే ‘చాలా సంతోషంగా ఉంద’ంటూ మోదీ ట్వీట్ చేశారు. ‘గొప్ప పండితుడిగా, ప్రజల్లో జాతీయ వాదాన్ని రగుగొల్పిన స్వాతంత్య్ర సమరయోధుడిగా మాలవీయ గుర్తుండిపోతారు’ అని మరో ట్వీట్‌లో ప్రశంసించారు. ‘ఒక దార్శనికుడు, స్ఫూర్తిప్రదాత, ప్రముఖుల్లోకెల్లా ప్రముఖుడు, భారత్‌కు ఆయన చేసిన సేవలు అమూల్యం’ అంటూ వాజ్‌పేయిని కొనియాడారు.
వాజ్‌పేయితో నాది అరుదైన స్నేహం: అద్వానీ
వాజ్‌పేయికి భారతరత్న పురస్కారం అందిస్తున్న విషయం తెలియగానే వాజ్‌పేయితో ఐదు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘వాజ్‌పేయి అసామాన్య దేశభక్తుడు. ఎలాంటి కళంకం, వివాదం లేకుండా పాలన సాగించిన ప్రధాని ఆయనొక్కరే’ అన్నారు. ఇద్దరు దేశభక్తులకు భారతరత్న ప్రకటించడాన్ని మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానన్నారు. వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వాల్సిందిగా 2008లోనే అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తాను లేఖ రాశానన్నారు. వాజ్‌పేయితో తన స్నేహం అరుదైందని, కన్నాట్‌ప్లేస్‌లోని చాట్ భండార్ వద్ద తమకిష్టమైన గోల్గప్పవాలా తినేందుకు తన స్కూటర్‌పై ఇద్దరం కలసి వెళ్లేవాళ్లమని గుర్తు చేసుకున్నారు.
వాజ్‌పేయిని గొప్ప ఏకాభిప్రాయ సాధకుడని అద్వానీ ఓ టీవీ చానల్‌తో అన్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన పీడీపీ ముఖ్యనేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్, ప్రముఖ ఆర్థిక వేత్త, భారతరత్న, నోబెల్ పురస్కారాల గ్రహీత అమర్త్యసేన్, జేడీయూ సీనియర్ నేత నితీశ్‌కుమార్‌లు వాజ్‌పేయికి భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. బిహార్ శాసనమండలిలో నితీశ్‌కుమార్ ఈ మేరకు ఒక తీర్మానాన్ని తీసుకువచ్చారు. విదేశాంగమంత్రి సుస్మా స్వరాజ్ స్వయంగా వాజ్‌పేయి నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా హర్షం వ్యక్తం చేసింది. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ‘రాజధర్మం పాటించాలంటూ’ వాజ్‌పేయి మోదీకి చేసిన హితబోధను గుర్తు చేసింది. కాగా, మాలవీయకు భారతరత్న ప్రకటించడాన్ని చరిత్రకారుడు రామచంద్ర గుహ తప్పుబట్టారు. మాలవీయకన్నా అర్హులైన రబీంద్రనాథ్ టాగూర్, ఫూలే, తిలక్, గోఖలే, వివేకానంద, అక్బర్, శివాజీ లాంటి భారతీయులు చాలామంది ఉన్నారని ట్వీటర్‌లో పేర్కొన్నారు.
బాల్ ఠాక్రేకూ ఇవ్వాలి: శివసేన
భారతరత్నను శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకు కూడా ప్రకటించాలని బీజేపీ మిత్రపక్షం శివసేన డిమాండ్ చేసింది. వాజ్‌పేయి, మాలవీయలకు ఈ పురస్కారాలను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూనే.. బాల్ ఠాక్రే కూడా అందుకు అర్హుడేనని పేర్కొంది.
ఇతర స్పందనలు..: ‘పండిట్ మాలవీయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలకు భారతరత్న ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. వారిద్దరినీ నేను అంతర్జాతీయ ప్రముఖులుగా భావిస్తాను. వాజ్‌పేయి రాసిన గీత్ నయా గాతా హూ గీతాన్ని పాడి ఆయనకు అంకితమిస్తున్నాను’
- లతా మంగేష్కర్, ప్రఖ్యాత గాయని, 2001 భారతరత్న గ్రహీత
‘ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. వాజ్‌పేయి అంటే మాకందరికీ ప్రేమ, గౌరవం’
- మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ సీఎం, వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు
చంద్రబాబు, కేసీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్: వాజ్‌పేయి, మాలవీయలకు భారతరత్న ప్రకటించటంపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన మరో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించకపోవడం వెలితిగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. భారతరత్న పొందే అన్ని అర్హతలు పీవీ నరసింహారావుకు ఉన్నట్టు ఆయన వివరించారు. ఇప్పటికైనా పీవీకి భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.