లాల్‌కృష్ణ అడ్వాణీ. 1990ల నుంచి రెండు దశాబ్దాల పాటు దేశమంతటా మారుమోగిపోయిన పేరు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో రాజకీయ రథయాత్రలకు పర్యాయపదంగా మారిన పేరు. ఆయన చేపట్టిన ఆరు యాత్రల్లో అయోధ్య రథయాత్ర దేశ రాజకీయ ముఖచిత్రాన్నే శాశ్వతంగా మార్చేసింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీపై ‘అంటరాని పార్టీ’ ముద్రను చెరిపేసింది.
బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో వాజ్‌పేయితో పాటు అడ్వాణీది కీలకపాత్ర. వాజ్‌పేయిని భారతరత్న వరించిన తొమ్మిదేళ్లకు తాజాగా ఆయనకూ ఆ గౌరవం దక్కింది. బీజేపీకి సుదీర్ఘ కాలం అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా అడ్వాణీదే. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు నేషనల్ డెమొక్రటికల్ అలయన్స్ (ఎన్డీఏ)కు ఊపిరి పోసిందీ ఆయనే.
కరాచీ నుంచి కరాచీ దాకా...
అడ్వాణీ నేటి పాకిస్తాన్‌లోని కరాచీలో 1927 నవంబర్ 8న జన్మించారు. 14 ఏళ్లప్పుడే ఆరెస్సెస్‌లో చేరారు. అనంతరం జనసంఘ్ నేతగా ఎదిగారు. సహచర నేత వాజ్‌పేయితో పాటు దేశవ్యాప్త క్రేజ్ సంపాదించుకున్నారు. హిందూ హృదయ సమ్రాట్‌గా గుర్తింపు పొందారు. వాజ్‌పేయిది మితవాద ఇమేజీ కాగా అడ్వాణీ మాత్రం హిందూత్వకు పోస్టర్ బోయ్‌గా ముద్ర పడ్డారు. ఇద్దరూ కలిసి జోడెద్దులుగా బీజేపీ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు.
1983లో కేవలం రెండు లోక్‌సభ సీట్లకు పరిమితమైన కాలంలో అడ్వాణీ బీజేపీ అధ్యక్ష పగ్గాలను అందుకున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త రామ రథయాత్ర తలపెట్టారు. 1990 సెపె్టంబర్లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి మొదలు పెట్టిన ఈ యాత్రకు బ్రహా్మండమైన స్పందన లభించింది. అరెస్టుతో యాత్ర మధ్యలోనే ఆగినా బీజేపీకి అదెంతగానో కలిసొచి్చంది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పారీ్టగా అవతరించింది.
1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి తోడు 1993 నుంచి అడ్వాణీ చేపట్టిన జనాదేశ్, స్వర్ణజయంతి, భారత్ ఉదయ్, భారత్ సురక్ష వంటి రథయాత్రలు బీజేపీని కేంద్రంలో అధికారానికి చేరువ చేశాయి. చివరికి 1996లో బీజేపీ తొలిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ వాజ్‌పేయి ప్రధాని కావడంతో అడ్వాణీ కల నెరవేరలేదు. దాంతో మితవాద ముద్ర కోసం విఫలయత్నాలు చేశారు.
ఆ క్రమంలో 2005లో కరాచీ వెళ్లి మరీ జిన్నాను లౌకికవాది అంటూ పొగడటం ఆయనకు మరింత చేటు చేయడమే గాక ఆరెస్సెస్ కన్నెర్రకూ కారణమైంది. ఆ దెబ్బకు సంఘ్‌తో అడ్వాణీ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. 2009 ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యరి్థగా నిలిచినా పార్టీ పరాజయం పాలైంది. యూపీఏ ప్రభుత్వ అవినీతిపై 2011లో చివరిసారి చేసిన జనచేతన యాత్రా అడ్వాణీకి అంతగా లాభించలేదు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment