అధికార వ్యవస్థ నియంత్రణ అనే మృతహస్తం నుంచి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక సంస్కరణలతో విముక్తి చేసినందుకు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయానికి మనం కృతజ్ఞులమై ఉండాలి. సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాలను అందించాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
దేశగతిని మార్చిన 1991 నాటి సంస్కరణలు మొదలై 30 ఏళ్లయిన సందర్భంగా అనేక వ్యాఖ్యానాలు, పునఃస్మరణలు వచ్చిపడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ దేశంలోనూ లేనంత కఠిన నిబంధనలతో కూడిన ఆర్థిక వ్యవస్థను కది లించివేసి సరళీకరించిన నాటి సందర్భం ఎప్పటికైనా చర్చనీయాంశమే. అయితే నాటి సంస్కరణలను సరళీకరణ పేరుతో సమర్థకులు ప్రశంసిస్తుండగా, దాన్ని నయా ఉదారవాదం పేరిట విమర్శకులు తూర్పారపడుతున్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నింటిలో పేదల ఆదాయ స్థాయిలు దిగజారిపోతున్న వాతావరణంలో ఈ విమర్శనలను అర్థం చేసుకోవచ్చు. కానీ 1991 సంస్కరణల ఫలితాలపై పునరాలోచన్ని కూడా చేయలేని విధంగా దేశ ఆర్థికం మారింది.
ఆరోజుల్లో ఆర్థిక వ్యవస్థలో నిర్ణాయక అంశాలు ప్రభుత్వ రంగానికే ప్రత్యేకించేవారు. ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టాలంటే కూడా అవకాశం ఉండేది కాదు. ఇతర అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టేవి. అయితే ప్రభుత్వం నుంచి పారిశ్రామిక లైసెన్సులు పొందగలిగే కంపెనీలకే అలాంటి అవకాశం ఉండేది. నేర విచారణ ప్రమాదంలో పడకుండా నాటి లైసెన్స్ రాజ్ అనుమతించిన దాని కంటే మించి ఉత్పత్తిని విస్తరించలేకపోతున్నందున బజాజ్ స్కూటర్‌ను పొందాలంటే బజాజ్ కస్టమర్లు సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఒక చర్చలో రాహుల్ బజాజ్ తన శ్రోతలకు చెప్పిన విషయం నేను గుర్తు చేసుకుంటున్నాను.
నాటి భారతీయ వాణిజ్య విధానం కూడా సమర్థతకు ప్రోత్సాహకాలను నిర్మూలించే క్రమాన్ని వేగిరపర్చేది. వినియోగదారీ సరకుల దిగుమతిని పూర్తిగా నిషేధించారు. పోటీపడే విదేశీ కంపెనీల ఉత్పత్తిదారులను అవహేళన చేసి మరీ వారి సరకులను పక్కనపెట్టేవారు. ఉత్పత్తికి అవసరమైన మూలధన, మధ్యంతర సరకుల దిగుమతిని మాత్రమే దిగుమతి లైసెన్సులతో అనుమతించేవారు. ఈ దిగుమతులు అత్యవసరమా, వీటికి దేశీయంగా ప్రత్యామ్నాయాలు లేవా అని మదింపు చేసిన తర్వాత ఎగుమతి, దిగుమతుల కంట్రోలర్ జనరల్ ఈ అనుమతులను ఇచ్చేవారు. వాణిజ్య పరిస్థితులపై ఎలాంటి ఆచరణాత్మక జ్ఞానం లేని కొద్దిమంది ఉన్నతాధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు.
అయితే బ్యూరోక్రాటిక్ నియంత్రణ మృత హస్తం నుంచి ఆర్థిక వ్యవస్థను విముక్తి చేసినందుకు గాను పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్ ద్వయానికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. అయితే ఈ గొప్ప మార్పు బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం అంత వేగంగా జరగలేదు. క్రమానుగతంగా మార్పు జరిగింది. అంటే ఒక నిర్దిష్టం కాలంలో ఈ సంస్కరణల ప్రయోజనాలు అందుతూ వచ్చాయి. సంస్కరణలు ప్రయోజనాలను అందించాయనడంలో కాసింత సందేహం కూడా లేదు. సంస్కరణల ప్రధాన లక్ష్యం ఆర్థికాభివృద్ధి రేటును పెంచడమే. దీన్ని సాధించాం కూడా. నాటి సంస్కరణలు మొదలై 23 ఏళ్లు గడిచాక యూపీఏ పాలనాకాలం ముగింపు సమయానికి భారత ఆర్థిక వృద్ధి రేటు 7 శాతానికి పెరిగింది. సంస్కరణలకు ముందు 23 ఏళ్లవరకు ఇది 4.2 శాతంగా మాత్రమే ఉండేది. ఆర్థిక వృద్ధి వేగవంతం అయ్యే కొద్దీ, ఆ వృద్ధి ఫలితాలను పేదలకు కూడా అందించడానికి యూపీఏ ప్రభుత్వం సమీకృత వృద్ధి వ్యూహాన్ని చేపట్టింది.
గ్రామీణ పనికి ఆహార పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఆదాయ మద్దతును అందించడం కూడా ఈ వ్యూహంలో భాగమైంది. 2004 నుంచి 2011 సంవత్సరాల మధ్య డేటా లభ్యమైనంత వరకు 14 కోట్ల మంది ప్రజలను దారిద్య్ర రేఖ నుంచి తప్పించడం జరిగింది. అయితే కోవిడ్ మహమ్మారి ప్రతిదాన్నీ మార్చివేసింది. ఈ మధ్యకాలంలో పలు అధ్యయనాలు దారిద్య్రం పెరుగుతూ వచ్చిందని అంచనా వేశాయి. కానీ ఇది మనం విడిగా నిర్వహించవలసిన, చర్చించవలసిన ఒక కొత్త పరిణామం అని గుర్తించాలి.
మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా
వ్యాసకర్త మాజీ డిప్యూటీ చైర్మన్, ప్రణాళికా సంఘం
Comments
Please login to add a commentAdd a comment