Montek Singh Ahluwalia
-
ఆర్థిక వనరులు పెంచుకోవడం ఎలా?
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు అవసరమైన నిధుల సమీకరణ, అలాగే ప్రజలపై భారం పడకుండా ఏవిధంగా ఆర్థిక వనరులు పెంచుకోవాలన్న అంశంపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నామని, అందులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసిందని, మిగులు నిధులు ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టిందని అహ్లూవాలియాకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన సలహాలు, సూచనలు కావాలని కోరా రు. ప్రజలపై ఎలాంటి భారం పడకుండా.. పన్నుల వసూళ్ల గురించి అహ్లూవాలియా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం విక్రమార్కకు వివరించారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన నుంచి సూచనలు తీసుకున్నట్లు తెలిసింది. -
ఎకానమీ ‘యూ’ టర్న్!
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఇంతకన్నా మరింత నష్టానికి గురయ్యే అవకాశాలు లేవని ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. సంఘటిత రంగం 2021 ముగింపుకల్లా కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కూడా ఆయన విశ్లేíÙంచారు. అయితే ఈ రికవరీ ఆయా రంగాలను బట్టి విభిన్నంగా ఉంటుందని అంచనావేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో భారత్ ఆర్థిక వ్యవస్థలో కీలకప్రాత పోషించిన అహ్లూవాలియా తాజాగా ఒక వెర్చువల్ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యంశాలను పరిశీలిస్తే... ► సంఘటిత రంగం తొలత పురోగమిస్తే, దానిని అసంఘటిత రంగం అనుసరిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుంది. ఆయా పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఇది ఎకానమీ పురోగతిలో కీలకం ► వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ అవసరం ఉంది. అయితే దానిని ఎలా నిర్వహించాలన్న అంశం కీలకం. చట్టాల అమలు(కేంద్రం ఇటీవలి మూడు చట్టాల అమలు) విషయంలో రైతుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.పంజాబ్, హర్యానా, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వందలాది మంది రైతులు గత ఏడాది నుంచీ ఢిల్లీ సరిహద్దుల సమీపంలో ఆందోళనలు చేస్తూ, మూడు చట్టాల రద్దును కోరుతున్న సంగతి తెలిసిందే. ఎన్ఎంపీ ప్రయోజనకరమే: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) విధానానికి యూపీఏ ప్రభుత్వంలో ఎకానమీలో కీలక బాధ్యతలు పోషించిన అహ్లూవాలియా మద్దతు పలకడం గమనార్హం. ప్రభుత్వ ఆస్తుల లీజు ద్వారా నిధుల సమీకరణకు సంబంధించి కేంద్రం ఆవిష్కరించిన ఆరు లక్షల కోట్ల రూపాయల నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) విధానం వల్ల విద్యుత్ రంగం నుంచి రోడ్లు, రైల్వేల వరకూ వివిధ రంగాల్లో మౌలిక రంగం ఆస్తుల విలువలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్ఎంపీకి తాను అనుకూలమని ఆయన స్పష్టం చేశారు. ఇది సరిగా అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థకు మంచే జరుగుతుందని వివరించారు. బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ కార్యక్రమం కింద.. కేంద్రం ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌లో లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్’ చేయనుంది. ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంలో లేనివి, పూర్తి స్థాయిలో విలువను అందించలేకపోతున్న బ్రౌన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్ మాత్రమే ఎన్ఎంపీ పరిమితం. ఇందులో యాజమాన్య హక్కులు లేదా స్థలం బదలాయింపు ఉండదు. ప్రైవేట్ రంగం పాలుపంచుకునేందుకు అవకాశం కలి్పంచడం ద్వారా ఆయా ఆస్తుల నుంచి మరింత విలువను రాబట్టడానికి వీలవుతుందని, అలాగే మానిటైజేషన్ ద్వారా వచి్చన నిధులను మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుందని కేంద్రం పేర్కొంది. అయితే 70 యేళ్లపాటు కూడబెట్టిన ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని ఈ విధానాన్ని ఉటంకిస్తూ, రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గతంలో స్పందిస్తూ, ‘‘అసలు ఆయన (రాహుల్ గాం«దీ) మోనిటైజేషన్ అంటే ఏమిటో అర్థం చేసుకున్నారా?’’ అని ఆర్థికమంత్రి ప్రశ్నించారు. ప్రైవేటుకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను మాత్రమే అప్పగిస్తున్నామని, యజమాని ప్రభుత్వమేనని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. -
మరో మార్గం లేదు!
అధికార వ్యవస్థ నియంత్రణ అనే మృతహస్తం నుంచి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక సంస్కరణలతో విముక్తి చేసినందుకు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయానికి మనం కృతజ్ఞులమై ఉండాలి. సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాలను అందించాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దేశగతిని మార్చిన 1991 నాటి సంస్కరణలు మొదలై 30 ఏళ్లయిన సందర్భంగా అనేక వ్యాఖ్యానాలు, పునఃస్మరణలు వచ్చిపడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ దేశంలోనూ లేనంత కఠిన నిబంధనలతో కూడిన ఆర్థిక వ్యవస్థను కది లించివేసి సరళీకరించిన నాటి సందర్భం ఎప్పటికైనా చర్చనీయాంశమే. అయితే నాటి సంస్కరణలను సరళీకరణ పేరుతో సమర్థకులు ప్రశంసిస్తుండగా, దాన్ని నయా ఉదారవాదం పేరిట విమర్శకులు తూర్పారపడుతున్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నింటిలో పేదల ఆదాయ స్థాయిలు దిగజారిపోతున్న వాతావరణంలో ఈ విమర్శనలను అర్థం చేసుకోవచ్చు. కానీ 1991 సంస్కరణల ఫలితాలపై పునరాలోచన్ని కూడా చేయలేని విధంగా దేశ ఆర్థికం మారింది. ఆరోజుల్లో ఆర్థిక వ్యవస్థలో నిర్ణాయక అంశాలు ప్రభుత్వ రంగానికే ప్రత్యేకించేవారు. ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టాలంటే కూడా అవకాశం ఉండేది కాదు. ఇతర అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టేవి. అయితే ప్రభుత్వం నుంచి పారిశ్రామిక లైసెన్సులు పొందగలిగే కంపెనీలకే అలాంటి అవకాశం ఉండేది. నేర విచారణ ప్రమాదంలో పడకుండా నాటి లైసెన్స్ రాజ్ అనుమతించిన దాని కంటే మించి ఉత్పత్తిని విస్తరించలేకపోతున్నందున బజాజ్ స్కూటర్‌ను పొందాలంటే బజాజ్ కస్టమర్లు సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఒక చర్చలో రాహుల్ బజాజ్ తన శ్రోతలకు చెప్పిన విషయం నేను గుర్తు చేసుకుంటున్నాను. నాటి భారతీయ వాణిజ్య విధానం కూడా సమర్థతకు ప్రోత్సాహకాలను నిర్మూలించే క్రమాన్ని వేగిరపర్చేది. వినియోగదారీ సరకుల దిగుమతిని పూర్తిగా నిషేధించారు. పోటీపడే విదేశీ కంపెనీల ఉత్పత్తిదారులను అవహేళన చేసి మరీ వారి సరకులను పక్కనపెట్టేవారు. ఉత్పత్తికి అవసరమైన మూలధన, మధ్యంతర సరకుల దిగుమతిని మాత్రమే దిగుమతి లైసెన్సులతో అనుమతించేవారు. ఈ దిగుమతులు అత్యవసరమా, వీటికి దేశీయంగా ప్రత్యామ్నాయాలు లేవా అని మదింపు చేసిన తర్వాత ఎగుమతి, దిగుమతుల కంట్రోలర్ జనరల్ ఈ అనుమతులను ఇచ్చేవారు. వాణిజ్య పరిస్థితులపై ఎలాంటి ఆచరణాత్మక జ్ఞానం లేని కొద్దిమంది ఉన్నతాధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు. అయితే బ్యూరోక్రాటిక్ నియంత్రణ మృత హస్తం నుంచి ఆర్థిక వ్యవస్థను విముక్తి చేసినందుకు గాను పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ ద్వయానికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. అయితే ఈ గొప్ప మార్పు బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం అంత వేగంగా జరగలేదు. క్రమానుగతంగా మార్పు జరిగింది. అంటే ఒక నిర్దిష్టం కాలంలో ఈ సంస్కరణల ప్రయోజనాలు అందుతూ వచ్చాయి. సంస్కరణలు ప్రయోజనాలను అందించాయనడంలో కాసింత సందేహం కూడా లేదు. సంస్కరణల ప్రధాన లక్ష్యం ఆర్థికాభివృద్ధి రేటును పెంచడమే. దీన్ని సాధించాం కూడా. నాటి సంస్కరణలు మొదలై 23 ఏళ్లు గడిచాక యూపీఏ పాలనాకాలం ముగింపు సమయానికి భారత ఆర్థిక వృద్ధి రేటు 7 శాతానికి పెరిగింది. సంస్కరణలకు ముందు 23 ఏళ్లవరకు ఇది 4.2 శాతంగా మాత్రమే ఉండేది. ఆర్థిక వృద్ధి వేగవంతం అయ్యే కొద్దీ, ఆ వృద్ధి ఫలితాలను పేదలకు కూడా అందించడానికి యూపీఏ ప్రభుత్వం సమీకృత వృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. గ్రామీణ పనికి ఆహార పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఆదాయ మద్దతును అందించడం కూడా ఈ వ్యూహంలో భాగమైంది. 2004 నుంచి 2011 సంవత్సరాల మధ్య డేటా లభ్యమైనంత వరకు 14 కోట్ల మంది ప్రజలను దారిద్య్ర రేఖ నుంచి తప్పించడం జరిగింది. అయితే కోవిడ్ మహమ్మారి ప్రతిదాన్నీ మార్చివేసింది. ఈ మధ్యకాలంలో పలు అధ్యయనాలు దారిద్య్రం పెరుగుతూ వచ్చిందని అంచనా వేశాయి. కానీ ఇది మనం విడిగా నిర్వహించవలసిన, చర్చించవలసిన ఒక కొత్త పరిణామం అని గుర్తించాలి. మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా వ్యాసకర్త మాజీ డిప్యూటీ చైర్మన్, ప్రణాళికా సంఘం -
సికింద్రాబాద్ ఓ మంచి జ్ఞాపకం..
సాక్షి, హైదరాబాద్: తనకు జంటనగరాలతో మరచిపోలేని అనుబంధం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, సంస్కరణల రూపశిల్పుల్లో ఒకరైన మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గుర్తు చేసుకున్నారు. వర్చువల్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 3వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌లో తాను చాలా ఏళ్లపాటు గడిపానన్నారు. సైన్యంలో పనిచేసిన తన తండ్రి ఉద్యోగ రీత్యా.. 1950 నుంచి 1987 మధ్య సికింద్రాబాద్‌లోనే తన బాల్యం గడిచిందన్నారు. కార్ఖానాలోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్లో చదువుకున్నానని, తాము నివసించే చోట మసీదులు, ఆలయాలు పక్కపక్కనే ఉన్నట్లే హిందువులు, ముస్లింలు అంతా కలిసి మెలిసి ఉండేవారన్నారు. సికింద్రాబాద్ ఎంతో ఆహ్లాదంగా కాలుష్య రహితంగా ఉండే ప్లెజెంట్ సిటీ అంటూ ఆయన కొనియాడారు. ఆ తర్వాత చాలాసార్లు సికింద్రాబాద్‌కు రావాలనుకున్నానన్నారు. ఏదేమైనా.. ఇలాగైనా ఈ కార్యక్రమానికి హాజరవడం ఆనందంగా ఉందన్నారు. సగటు వ్యక్తికీ అర్థమయ్యేలా బ్యాక్‌స్టేజ్.. గతేడాది చనిపోయిన తన భార్య.. ప్రతి సాధారణ వ్యక్తి అర్థం చేసుకునేలా ఆర్థికాంశాలతో పుస్తకం రాయమని చెప్పిందన్నారు. ఆమె కోరిక మేరకే కేవలం ఆర్థిక నిపుణులు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా బ్యాక్ స్టేజ్ పుస్తకం రాశానని ఆయన చెప్పారు. అనంతరం దేశ ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో ముఖ్యుడిగా పేరొందిన ఆర్థిక నిపుణుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, మాజీ రాజకీయ నేత పాలసీ అనలిస్ట్ పరకాల ప్రభాకర్‌తో హెచ్ఎల్ఎఫ్లో సంభాషిస్తూ తన బ్యాక్ స్టేజ్ పుస్తకం విశేషాలను సందర్శకులతో పంచుకున్నారు. ‘న్యాయం’ చెప్పిన ఐరన్‌మ్యాన్.. బ్యాంక్ ఉద్యోగిని, ‘వై ఈజ్ మై హెయిర్ కర్లీ’ అనే పుస్తకం రాసిన లక్ష్మీ అయ్యర్ ఫిలడెల్ఫియా నుంచి స్టోరీ టెల్లింగ్ సెషన్లో పాల్గొన్నారు. తన పుస్తకం విశేషాలను ఇదే కార్యక్రమంలో పంచుకున్నారు. రాజకీయ అంశాలు, శాసనాలు, న్యాయవ్యవస్థపై రచనలు సాగించే ఐరన్ మ్యాన్ ట్రైథ్లైట్గా పేరున్న ఆకాష్ సింగ్ రాథోడ్ ఈ కార్యక్రమంలో కాంబోడియా నుంచి పాల్గొన్నారు. తాను రాసిన తాజా పుస్తకం ‘బీఆర్ అంబేడ్కర్ ద క్వెస్ట్ ఫర్ జస్టిస్’ విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సహజ న్యాయ సూత్రాలు, న్యాయ వ్యవస్థలో మార్పు చేర్పులు, రాజకీయ, సామాజిక ప్రభావాలు.. వంటివి ఆయన ప్రస్తావించారు. అలరించిన సిటీ సంగీతం.. సీరియస్‌గా సాగుతున్న ఈ కార్యక్రమంలో 3వ రోజు నగరానికి చెందిన పలు సంగీత బృందాలు పాల్గొని అలరించాయి. సిటీకి చెందిన హైదరాబాద్ హార్పర్స్ బృంద సభ్యులు తమ మౌత్ ఆర్గాన్ సంగీతంతో ఆహ్లాదం పంచగా.. నగరానికి చెందిన తొలి ఉర్దూ ర్యాప్–హిప్ హాప్ గ్రూప్ థగ్స్ యూనిట్ ఉర్రూతలూగించారు. ఈ గ్రూప్‌నకు చెందిన మ్యుజిషియన్స్ ముదాస్సిర్ అహ్మద్, సయ్యద్ ఇర్షాద్ ద్వయంలో ముదాస్సిర్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందర్శకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా థగ్స్ యూనిట్ రూపొందించిన ఆల్బమ్స్ ప్రదర్శించారు. గతేడాది మరణించిన సినీనటుడు, రచయిత సౌమిత్రా ఛటర్జీకి నివాళిగా.. సెలబ్రేటింగ్ సౌమిత్ర పేరిట సాగిన కార్యక్రమంలో బెంగాల్ సినీ ప్రముఖుడు అనిక్ దత్తా, నగరానికి చెందిన సినీ విమర్శకురాలు సంఘమిత్ర మాలిక్ పాల్గొన్నారు. నా జీవితానికి అద్దం.. బ్రాస్ నోట్ బుక్ ఆర్థికాంశాలకు సంబంధించి నిపుణురాలు, మహిళాభ్యుదయ వాది, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మైసూర్‌కి చెందిన దేవకి జైన్.. కిన్నెర మూర్తితో తన ఆటోబయోగ్రఫీగా విడుదల చేసిన ‘ది బ్రాస్ నోట్ బుక్’ విశేషాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలోని పలు కోణాలను స్పర్శించారు. బయోగ్రఫీ అంటే తాను ఈ స్కూల్‌కి వెళ్లా, ఆ కాలేజ్‌కి వెళ్లా, ఆ ఉద్యోగం చేశా వంటి విషయాలు కాకుండా అనేక వ్యక్తిగత అంశాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించానని స్పష్టం చేశారు. తాను చదివిన కొన్ని ప్రముఖుల బయోగ్రఫీల్లా ఉండకూడదని రెండేళ్లు ఆలోచించానన్నారు. ఒక సంప్రదాయ అయ్యంగార్ కుటుంబం నుంచి వచ్చిన తాను తన ప్రేమను, అభిరుచులను నెరవేర్చుకుంటూ సాగిన ప్రయాణాన్ని పొందుపర్చాన్నారు. -
విషాదం: ‘కాన్సర్‌తో పోరాడి ఓడిపోయారు’
న్యూఢిల్లీ: పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ ఇషర్ జడ్జ్ అహ్లువాలియా(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్‌తో పోరాడిన ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. కాగా ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి పవన్, అమన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇషర్ జడ్జ్ అహ్లువాలియా ఐసీఆర్ఐఈఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్) చైర్‌పర్సన్‌గా పనిచేశారు. విద్య, సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి గానూ 2009లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.(చదవండి: కోవిడ్ వ్యాక్సిన్: రూ. 80 వేల కోట్లు ఉన్నాయా?!) కాగా ఇషర్ జడ్జ్ అహ్లువాలియా మరణం పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అహ్లువాలియా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆర్థికవేత్త, తన హయాంలో రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఆమె ఎనలేని కృషి చేశారని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొనియాడారు. ఇక బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా అహ్లువాలియాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఎంతో ప్రతిభావంతురాలైన తన స్నేహితురాలు ఈ లోకాన్ని వీడి వెళ్లారన్నారు. ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాన్సర్‌తో పోరాడి ఓడిన శ్రీమతి అహ్లువాలియా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్, భారత విదేశాంగ మాజీ కార్యదర్శి నిరుపమ్ మీనన్ రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. (కరోనాతో అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్ మృతి) Isher Ahluwalia who just passed away, was one of India’s distinguished economists, a MIT PhD, and author of an influential book ‘Industrial Growth in India’. She built up ICRIER, a fine economic think tank. She had her own distinctive identity apart from being Montek‘s wife. — Jairam Ramesh (@Jairam_Ramesh) September 26, 2020 -
రాజధానికి నిధులపై స్పష్టత ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు నిధులు ఎప్పుడిస్తారు? ఎన్ని నిధులిస్తారన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియాను కోరినట్లు రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించినట్లుగా.. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తితోపాటు అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఆల్ ఇండియా మెడి కల్ ఇనిస్టిట్యూట్, ఐఐటీలు, నూతన విశ్వవిద్యాలయాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం ఇచ్చినట్టు చెప్పారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో దిగ్విజయ్‌తో భేటీ అనంతరం సుబ్బిరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు నిధులతో పాటు పార్టీపరమైన అంశాలపై దిగ్విజయ్‌తో చర్చించానన్నారు. రాజధానికి నిధులిచ్చే అంశంపై మరో రెండు రోజుల్లో దిగ్విజయ్‌తో కలిసి ప్రధానితో చర్చించేందుకు వెళ్లనున్నట్టు చెప్పారు. రెండు రాష్ట్రాలు ఏర్పడనున్న నేపథ్యంలో రెండు పీసీసీలు ఏర్పాటు చేయాలా? ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొత్స కోఆర్డినేటర్‌గా.. రెండు ప్రాంతాల్లో రీజనల్ కమిటీలు వేయాలా? అన్నదానిపై పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనందున త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీకి దిగడం లేదన్నారు. అయితే, ఇప్పటికీ విశాఖ నుంచి పోటీచేస్తే తాను కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
పెళ్లైన తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నట్లు..
న్యూఢిల్లీ: ప్రజలు విభజన గురించి మాట్లాడుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం విలీనం గురించి మాట్లాడుతోందని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు విమర్శించారు. విభజన నుంచి ప్రజలు తేరుకోకముందే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒక్కొ రాజధాని పేరు చెబుతున్నారని మండిపడ్డారు. ఎటువంటి ప్రణాళికలు లేకుండానే రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ విభజన చేపట్టిందన్నారు. కేంద్రం విభజన చేసిన తీరును చూస్తే పెళ్లైన తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నట్లు ఉందని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లువాలియాను వెంకయ్య కలిశారు. సీమాంధ్రకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఆహ్లువాలియాతో చర్చించినట్టు ఆయన తెలిపారు. విభజన బిల్లులో పేర్కొన్న వాటిని పరిశీలించడానికి కమిటీ వేస్తామని ఆహ్లువాలియా చెప్పారని వెల్లడించారు. -
పరిస్థితులు మెరుగుపడతాయ్
దావోస్: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడగలవన్న ఆశాభావంతో ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు శనివారం ముగిసింది. అయిదు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అసమానతలు, మధ్యప్రాచ్య సంక్షోభం, బాధ్యతాయుత పెట్టుబడిదారీ విధానం తదితర అంశాలపై ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు చర్చించారు. భారత్ సహా పలు దేశాల నుంచి మొత్తం 2,500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. భారత నేతలు దేశ వృద్ధిపైన, సంస్కరణల కొనసాగింపుపైన ఇన్వెస్టర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇన్వెస్టర్లు భారత్‌లో త్వరలో ఎన్నికల పరిణామాలపై ఆసక్తి కనపర్చారు. చివరి రోజున సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా భారత్ ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉందని ప్రణాళిక సంఘం డిప్యుటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా స్పష్టం చేశారు. -
స్థానిక కారణాలతోనే జీడీపీ తగ్గింది
దావోస్: స్థానిక కారణాల వల్లే భారత్ వృద్ధి(జీడీపీ) తగ్గిందని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అన్నారు. వృద్ధి రేటు పెరగకపోవడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారత్ సాకుగా చెప్పలేదని వ్యాఖ్యానించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) సదస్సులో ఆసియా మార్కెట్లపై నిర్వహించిన చర్చలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం ముందుగానే ఊహించి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. అవరోధాలు తొలగించాలి: ఐఎంఎఫ్ చీఫ్ గపెట్టుబడులకు ఎదురవుతున్న పలు అవరోధాలను తొలగించి, వాణిజ్య వాతావరణాన్ని మెరుగుపర్చాలని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టిన్ లగార్డే భారత్‌ను కోరారు. డబ్ల్యుఈఎఫ్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె శుక్రవారం ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అవరోధాల తొలగింపునకు ఇండియా ప్రాధాన్యం ఇవ్వాలనీ, ద్రవ్య పటిష్టీకరణపై దృష్టి కేంద్రీకరించాలనీ ఆమె అన్నారు. ద్రవ్యోల్బణం అదుపునకు రిజర్వు బ్యాంకు చేపట్టిన చర్యలతో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. వ్యాపారాన్ని విస్తరిస్తాం: వాల్‌మార్ట్ భారత్‌లో వ్యాపార విస్తరణపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నామని అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ ప్రెసిడెంట్ డౌగ్ మెక్‌మిలన్ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మల్లీబ్రాండ్ రిటైల్ బిజినెస్‌లో ప్రవేశానికి సంబంధించిన నిబంధనలపై మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. పేదరికాన్ని అధిగమిస్తుంది: కామరూన్ పేదరికాన్ని అధిగమించడానికి తగినన్ని వనరులు భారత్, చైనా వంటి దేశాలకు ఉన్నాయని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామరూన్ అన్నారు. కరువు, యుద్ధాల వంటి సమస్యలతో సతమతమవుతున్న దేశాలకు ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. ఈ కారణంగానే ఇండియా, చైనా వంటి దేశాలకు తమ సహాయ బడ్జెట్లో కేటాయింపులు తొలగించామని డబ్ల్యుఈఎఫ్ సదస్సులో తెలిపారు. -
ద్రవ్యోల్బణంపైనే సెంట్రల్ బ్యాంకుల దృష్టి సరికాదు: మాంటెక్
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడే ప్రధాన లక్ష్యంగా సెంట్రల్ బ్యాంకులు పనిచేయడం సరికాదని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా సోమవారం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ బ్యాంకులు పలు అంశాలు లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుందన్నది తన అభిప్రాయమని అన్నారు. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత, ద్రవ్యోల్బణమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ రెండుసార్లు రెపో రేటు పెంచిన నేపథ్యంలో మాంటెక్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి క్షీణదశలో నడుస్తున్న నేపథ్యంలో- జనవరి 28వ తేదీన ఆర్బీఐ తన మూడవ త్రైమాసిక పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది. ఆర్థిక రంగంలో సంస్కరణల ప్రక్రియ కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రూపాయి ప్రస్తుతం (సోమవారం 61.52 వద్ద స్థిరపడింది) తన వాస్తవ విలువ దగ్గరగా ఉందని మాంటెక్ తెలిపారు. -
శక్తివంతులైన సిక్కుల జాబితాలో మన్మోహన్!
ప్రపంచంలో శక్తివంతులైన సిక్కుల జాబితాలో ప్రధాని మన్మోహన్ సింగ్ కు చోటు దక్కింది. సమకాలీన కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తివంతులైన, ప్రభావవంతులైన 100 మంది సిక్కుల జాబితాను లండన్ లో విడుదల చేశారు. ఈ జబితాలో చోటు దక్కించుకున్న మన్మోహన్ ను మేధావిగా, గొప్ప ఆలోచనపరుడిగా పేర్కొన్నారు. ఈ జాబితాలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటి చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు రెండవ స్థానం దక్కింది. శ్రీ అకాల్ తక్త్ సాహిబ్ జాతేందర్ సింగ్ సాహిబ్ గియాని గుర్ బచన్ సింగ్ మూడవ స్థానంలో, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ 4వ స్థానంలో మాస్టర్ కార్డ్ వాల్డ్ వైడ్ సీఈఓ అజయ్ పాల్ సింగ్ బంగా 8 స్థానంలో నిలిచారు. -
ద్వితీయార్థంలో మెరుగైన వృద్ధి: మాంటెక్‌సింగ్
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు కష్టకాలం దాదాపు గడిచిపోయిందని, ఇక ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వృద్ధి మెరుగుపడొచ్చని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. మౌలిక రంగం పనితీరు ఈ దిశగా కొన్ని సంకేతాలు ఇచ్చిందని ఆయన చెప్పారు. అయితే, రికవరీకి సంబంధించి ఇంకా పటిష్టమైన సంకేతాలు రావాల్సి ఉంద ని శివ నాడార్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అహ్లువాలియా చెప్పారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును మరో పావు శాతం పెంచడంపై స్పందిస్తూ.. ఆర్బీఐ పరిస్థితిని సరిగ్గా చక్కబెట్టిందని ఆయన పేర్కొన్నారు. క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మళ్లీ సాధారణ స్థాయికి రావడం చాలా ముఖ్యమని చెప్పారు. ఒకవైపు ద్రవ్యోల్బణం సమస్యాత్మకంగానే ఉన్నప్పటికీ.. ఆర్థిక వృద్ధికి ఊతం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని అహ్లువాలియా తెలిపారు. అటు కిరీట్ పారిఖ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా పెట్రోలియం ధరలను మార్కెట్ రేట్లను అనుసంధానించి, సబ్సిడీలను దశలవారీగా ఎత్తేయాల్సిన అవసరం ఉందని ప్రణాళిక సంఘం భావిస్తున్నట్లు వివరించారు. డీజిల్, కిరోసిన్, వంట గ్యాస్ రేట్లను ఇప్పటికిప్పుడు పెంచలేకపోయినప్పటికీ.. తగిన చర్యలు తక్షణ మే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. -
క్యాడ్ అంచనాల కంటే తగ్గొచ్చు: మాంటెక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) అంచనాల(జీడీపీలో 3.8%)కన్నా తక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీని వెనక్కి తీసుకుంటే ఆ ప్రభావాన్ని తట్టుకోగల స్థాయిలోనే భారత్ ఉందని వివరించారు. దేశంలోకి వచ్చే, దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్య తేడాను క్యాడ్‌గా వ్యవహరిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో క్యాడ్ జీడీపీలో 4.8 శాతం(8820 కోట్ల డాలర్లుగా) నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనిని 3.8 శాతానికి(7,000 కోట్ల డాలర్లు) తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఐఎంఎఫ్ వృద్ధి లెక్కలు పట్టించుకోం: భారత్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.75 శాతంగానే ఉంటుందంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇచ్చిన అంచనాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ తోసిపుచ్చారు. తయారీ రంగం, దేశీయంగా డిమాండ్, ఎగుమతులు అన్నీ మెరుగుపడుతున్న నేపథ్యంలో వృద్ధి రేటు కచ్చితంగా 5 శాతం మించగలదని ఒక ప్రకటనలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రణాళిక శాఖ మంత్రి రాజీవ్ శుక్లా కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే భారత్ సహా పలు వర్ధమాన దేశాలు మళ్లీ 8 శాతం పైగా వృద్ధి సాధించలేకపోవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యుటీ చీఫ్ రూప దత్తగుప్తా తెలిపారు. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ ద్రవ్య లోటు స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 8.5 శాతానికి ఎగియవచ్చని కూడా ఐఎంఎఫ్ తాజాగా అంచనా వేసింది. -
రూపాయికి కష్టకాలం ముగిసినట్లే...
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిరీకరణ దశకు చేరుకున్నట్లేనన్న అభిప్రాయాన్ని మంగళవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా వ్యక్తం చేశారు. డాలర్ మారకంలో రూపాయికి తగిన విలువ 60-65 శ్రేణి అని కూడా ఆయన అన్నారు. గత ఏడాదితో పోల్చితే రూపాయి ఇప్పటికీ బలహీనంగానే ఉన్నప్పటికీ, కరెంట్ అకౌంట్ లోటు తగిన స్థాయి వద్ద కట్టడి చేయడానికి అనుగుణమైన స్థాయిలోనే ఇది ఉందని అని ఒక చానెల్‌కు ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. కరెన్సీ నష్టాల నుంచి కంపెనీలు బయటపడ్డానికి హెడ్జింగ్ విధానం సరైనదేనన్న అభిప్రాయాన్ని మాంటెక్ వ్యక్తం చేశారు. డాలర్ మారకంలో ఆగస్టులో 68.85 స్థాయికి పడిపోయిన రూపాయి తరువాత బలపడుతూ వచ్చింది. మంగళవారంనాడు 61.79 వద్ద నిలిచింది. -
ఐఎంఎఫ్‌ని ఆశ్రయించం: మాంటెక్
న్యూఢిల్లీ: దేశీయ క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధిని (ఐఎంఎఫ్) ఆశ్రయించే ఆలోచన లేదని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా శనివారం స్పష్టం చేశారు. దేశం వెలుపలి వర్గాల నుంచి సాయం తీసుకోవాల్సినంతగా పరిస్థితులేమీ దిగజారలేదని, భవిష్యత్తులోనూ అవసరం పడకపోవచ్చని జీ20పై జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు. విదేశీ బ్యాంకులతో మాయారాం భేటీ ముంబై: రూపాయిపై ప్రధాన విదేశీ బ్యాం కుల ట్రెజరీ విభాగాల అధిపతులతో కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం శనివారం చర్చించారు. ఎగుమతులు ఆశాజనకం: ఆనంద్‌శర్మ ఎగుమతుల్లో ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయని ముంబైలో జరిగిన ఎగుమతుల సంఘాల సమాఖ్య సమావేశంలో మంత్రి ఆనంద్‌శర్మ పేర్కొన్నారు. -
సుడిగుండంలో రూపాయి!
దేశానికి సారథ్యం వహిస్తున్న వారంతా కాకలుతీరిన ఆర్థికవేత్తలు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా... అందరి కందరూ నిపుణులేగానీ రూపాయి మాత్రం తల వేలాడేస్తున్నది. మిగిలిన వారి సంగతలా ఉంచి మన్మోహన్‌సింగ్‌కు 1991లో దేశాన్ని మహా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మాంత్రికుడిగా ఎగువ మధ్యతరగతి, సంపన్నవర్గాల్లో పేరు ప్రఖ్యాతులున్నాయి. కానీ, ఇప్పుడు అంపశయ్యపై ఉన్న ఆర్ధికవ్యవస్థను నిటారుగా నిలబెట్టడం ఆయనవల్ల కావడంలేదు. వరసబెట్టి చేస్తున్న చిట్కా వైద్యాలన్నీ వికటించి సంక్షోభాన్ని రెట్టింపుచేస్తున్నాయి. తెల్లారేసరికి రూపాయి ఎంతకు దిగజారుతుందో, స్టాక్ మార్కెట్ పతనం ఎక్కడితో ఆగుతుందో తెలియక అందరూ బెంబేలెత్తిపోతున్నారు. అవి ఏ అంచనాలకూ అందటం లేదు. మంగళవారం ఒకే రోజు 200 పైసలు పతనమై డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.24 వద్ద ముగియగా, బుధవారం మార్కెట్లు తెరవగానే అది 68.80 పాయింట్లకు పడిపోయింది. ఇది 70 దాటినా దాటవచ్చని లెక్కేస్తున్నారు. మున్ముందు దానికి మంచిరోజులొస్తాయని, అది మళ్లీ జవసత్వాలు తెచ్చుకుని పైకి లేస్తుందని మన నేతలు చెప్పే కబుర్లన్నీ చిలకజోస్యాలుగా తేలిపోతున్నాయి. ఈ ఏడాది ఇంతవరకూ రూపాయి విలువ 20 శాతం తరిగిపోయింది. రూపాయి పతనం పర్యవసానంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. స్టాక్ మార్కెట్ సైతం దేశ ఆర్థికవ్యవస్థను వణికిస్తోంది. మంగళవారం సెన్సెక్స్ 590 పాయింట్లు పతనమై 18,000 పాయింట్ల దిగువకు పోయిన స్టాక్ మార్కెట్ బుధవారం మరో 500 పాయింట్లు కిందకుపోయింది. చివరికెలాగో గట్టెక్కింది. కేవలం గత నాలుగురోజుల్లోనే స్టాక్ మార్కెట్ రూ.6,80,000 కోట్లు నష్టపోయింది. ఇంత జరుగుతుంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మళ్లీ గట్టెక్కాలన్న దురాశతో హడావుడి పడుతూ ఆహారభద్రత బిల్లు తీసుకొచ్చారు. స్టాక్ మార్కెట్ సంక్షోభానికి అది కూడా కారణమే. ఒకపక్క చైనా ఆర్థికవ్యవస్థ సంక్షోభం చేరువలో ఉన్నదని, ఏ క్షణంలోనైనా అది కుప్పకూలే అవకాశం ఉన్నదని ప్రపంచమంతా అంచనా వేస్తుంటే... అంతకన్నా ముందు నేనున్నానంటూ మన ఆర్థికవ్యవస్థ మూలుగుతున్నది. ఇంత జరుగుతున్నా మన పాలకులు తమవైపుగా జరిగిన, జరుగుతున్న లోపాలను సరిదిద్దుకోవడానికి సిద్ధంగాలేరు. సరిగదా... ఎప్పటికప్పుడు కొత్త కథలు వినిపిస్తున్నారు. రూపాయి తనంత తానే స్థిరత్వాన్ని సాధిస్తుందని, అందు కోసం ప్రభుత్వపరంగా ఏ ప్రయత్నమూ చేయనవసరం లేదని చిదంబరం చెప్పుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడైనా ఆయనలో భేషజం ఏమీ తగ్గలేదు. మన రూపాయి విలువ ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువుందని, ఓపిక పడితే అది మళ్లీ సర్దుకోవడం ఖాయమని చెబుతున్నారు. కానీ, ఈ విశ్వాసం ప్రపంచ ఆర్థిక నిపుణులకు లేదు. భారత్ స్థూలదేశీయోత్పత్తి వృద్ధి అంచనాలకు ఫ్రాన్స్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్పీ అడ్డంగా కోతబెట్టింది. రాగలరోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఇప్పుడు ఏర్పడ్డ సంక్షోభానికి మూలాలన్నీ ప్రపంచ పరిణామాల్లో ఉన్నాయని పాలకులు చెబుతున్న మాటల్లో అర్ధసత్యమే ఉంది. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరించుకోబోతున్నారన్న అంచనాలతో, ఇక అక్కడ పరిస్థితులు చక్కబడవచ్చన్న ఉద్దేశంతో ఇన్వెస్టర్లందరూ తమ పెట్టుబడులను తరలించుకుపోతుండటం నిజమే. అలాగే, సిరియాలో అమెరికా సైనిక జోక్యం చేసుకోబోతున్నదన్న ఊహాగానాల కారణంగా చమురు ధరలు భారీగా పెరిగిన మాటా వాస్తవమే. ఇలాంటి కారణాలవల్ల మన దేశం ఒక్కటే కాదు... చైనా, మలేసియా, ఇండొనేసియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా వంటివన్నీ ఒడిదుడుకులెదుర్కొంటున్నాయి. అన్ని దేశాల కరెన్సీలూ పల్టీలు కొడుతున్నాయి. కానీ, మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశమే అధిక ఒత్తిడికి లోనవుతున్నది. వాటితో పోలిస్తే ఇక్కడి నుంచి భారీయెత్తున పెట్టుబడులు తరలి పోయాయి. ఇందుకు మన కరెంటు అకౌంట్ లోటు, దిగజారుతున్న వృద్ధి రేటు ప్రధాన కారణాలు. మన కరెంటు అకౌంట్ లోటు 2007 నుంచీ పెరుగుతూ పోతున్నది. అప్పట్లో 800 కోట్ల డాలర్లుగా ఉన్న లోటు ఇప్పుడు 9,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. స్థూలదేశీయోత్పత్తి మళ్లీ 8 శాతానికి చేరడం ఖాయమని మన్మోహన్సింగ్ చేసిన ప్రకటనలు ఎవరిలోనూ విశ్వాసం కలిగించలేకపోయాయి. కేవలం మాటలు మాత్రమే మదుపుదారులను నమ్మించలేవు. ఖజానాకు లక్షా 80 వేల కోట్ల రూపా యల నష్టం కలిగించిన బొగ్గు కుంభకోణం విద్యుత్, సిమెంట్, ఉక్కు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగాలన్నిటా ఉత్పత్తి మందగించింది. మౌలిక సదుపాయాల రంగం సంక్షోభంలో పడటంతో దాని ప్రభావం ఇతర రంగాలకు వ్యాపించింది. పర్యవసానంగా లక్షలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. విశాల ప్రజానీకం ఉపాధిని, తద్వారా వారి ఆదాయాన్ని దెబ్బతీసి... వారి కొను గోలుశక్తిని ఊడ్చేశాక వృద్ధి ఎలా సాధ్యమవుతుంది? అందువల్లే మన్మోహన్సింగ్ ఏమి చెప్పినా ఫలితం లేకుండాపోయింది. సంక్షోభం వచ్చినప్పుడల్లా మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు వాటిని సాకుగా ఉపయోగించుకోవడం తప్ప ఈ ప్రభుత్వం వద్ద వేరే పరిష్కారం ఉన్నట్టు కనబడదు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ చిదంబరం అదే పాట అందుకున్నారు. ఆర్థికవ్యవస్థను మరింత సరళీకరిస్తే, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిస్తే అంతా సర్దుకుంటుందని నమ్మబలుకుతున్నారు. ఇలాంటి మాటలకు స్వస్తి చెప్పి స్వీయలోపాలను సమీక్షించుకోవాలి. ఉపాధిని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలే అంతిమంగా ఆర్థికవ్యవస్థకు శ్రీరామరక్ష అవుతాయని గుర్తుంచుకోవాలి. -
బాబోయ్ ధరలు..
న్యూఢిల్లీ: సామాన్యుడి బతుకుబండిని ధరలు అతలాకుతలం చేస్తున్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు జూలైలో బెంబేలెత్తించింది. వార్షిక ప్రాతిపదికన ఈ నెలలో ద్రవ్యోల్బణం స్పీడ్ 5.79 శాతంగా నమోదయ్యింది. అంటే గత ఏడాది జూలై నెలతో పోల్చితే 2013 జూలై నెలలో ధరలు టోకుగా 5.79 శాతం పెరిగాయన్నమాట. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. జూన్‌లో ఈ పెరుగుదల రేటు 4.86 శాతం. ఉల్లిపాయలు, కూరగాయలు అలాగే ఇంధన ధరలు జూలైలో టోకు ద్రవ్యోల్బణం రేటు స్పీడ్‌ను భారీగా పెంచాయి. 4-5 శాతం శ్రేణిలో ఈ రేటు ఉండాలని ఆర్బీఐ భావిస్తుండగా, ఈ లక్ష్యాన్ని మించి ద్రవ్యోల్బణం పైకి దూసుకుపోవడం విశేషం. మే వరకూ వరుసగా నాలుగు నెలలు టోకు ద్రవ్యోల్బణం రేటు తగ్గుతూ వచ్చింది. జూన్ నుంచి తిరిగి పైచూపు చూడడం ప్రారంభించింది. సరఫరాలవైపు సమస్యలను పరిష్కరించి ద్రవ్యోల్బణం అదుపునకు కృషి చేయాలని ఫిక్కీ సహా పలు పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఆహార ఉత్పత్తుల మంట... సూచీలోని ప్రధాన మూడు విభాగాల్లో ఒకటైన ఆహార ఉత్పత్తుల ధరల స్పీడ్ (మొత్తం సూచీలో 14.34 శాతం వాటా) అటు వార్షికంగా చూసినా, ఇటు నెలవారీగా చూసినా సామాన్యునికి ఆందోళనకు గురిచేసేదిగా ఉంది. 2012 జూన్‌తో పోల్చితే 2013 జూన్‌లో నిత్యావసరాల ధరలు 9.74 శాతమే పెరిగితే, జూలైలో మాత్రం ఈ ధరల పెరుగుదల రేటు (2012 జూలైతో పోల్చి) భారీగా 11.91 శాతంగా నమోదయ్యింది. జూలైలో వార్షిక ప్రాతిపదికన వేర్వేరుగా చూస్తే- ఉల్లిపాయల ధరలు 145% పెరిగాయి. జూన్‌లో వార్షిక ప్రాతిపదికన ఈ పెరుగుదల రేటు 114%. కూరగాయల ధరలు జూలైలో 46.59 శాతం పెరిగాయి. జూన్‌లో వార్షికంగా ఈ పెరుగుదల రేటు 16.47 శాతమే. అంటే జూన్‌కన్నా జూలైలో ధరలు వార్షిక ప్రాతిపదికన మరింత తీవ్రమయ్యాయి. మిగిలిన నిత్యావసరాల విషయానికి వస్తే- బియ్యం ధరలు 21.15 శాతం దూసుకుపోయాయి. తృణధాన్యాల ధరలు 17.66 శాతం పెరిగాయి. గోధుమల రేట్లు 13.42 శాతం ఎగశాయి. పప్పు దినుసుల రేట్లు మాత్రం 7.39 శాతం తగ్గాయి. వరుసగా మూడు నెలల నుంచీ ఆహార ఉత్పత్తుల రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. మిగిలిన విభాగాలు ఇలా... ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగం మొత్తం ద్రవ్యోల్బణం రేటు 8.99 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఈ పెరుగుదల రేటు 8.14 శాతం. ఒక్క ఆహారేతర వస్తువుల విభాగాన్ని చూస్తే- ద్రవ్యోల్బణం రేటు 5.51 శాతంగా ఉంది. జూన్ నెలతో పోల్చితే ఈ రేటు (7.57 శాతం) తగ్గింది. మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా కలిగిన తయారీ వస్తువుల విభాగం (కోర్) ద్రవ్యోల్బణం రేటు 2.81 శాతం. జూన్ నెలతో పోల్చితే (2.75 శాతం) ఈ రేటు స్వల్పంగా పెరిగింది. సూచీలో 15 శాతం వాటా కలిగిన ఇంధనం, విద్యుత్ సంబంధిత ద్రవ్యోల్బణం రేటు భారీగా 11.31 శాతానికి చేరింది. జూన్‌లో ఈ పెరుగుదల రేటు 7.12 శాతం మాత్రమే. రూపాయి క్షీణతే కారణం: మాంటెక్ డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం, దీనితో చమురు-ఇతర దిగుమతి చేసుకునే వస్తువులు భారంగా మారడం, ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద చూపడం ధరలు పెరుగుదలకు ప్రధాన కారణమని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. అయితే తగిన వర్షపాతం నమోదై, దిగుబడులు పెరుగుతాయని, సరఫరాల వైపు సమస్యలు కూడా తొలగిపోయి ద్రవ్యోల్బణం అదుపులోనికి వస్తుందని ఆయన విశ్లేషించారు. ద్రవ్యోల్బణం అప్‌ట్రెండ్ కొనసాగదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రూపాయి విలువ స్థిరీకరణకు ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తగిన వర్షపాతం, రూపాయి స్థిరీకరణకు ప్రభుత్వ చర్యలు వంటి కారణాల వల్ల ఈ ఏడాది చివరకు ద్రవ్యోల్బణం 5-6 శాతం శ్రేణిలో ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.